Thursday 19 July 2018

స్వామి అగ్నివేశ్‌


"స్వామి అగ్నివేశ్‌పై దాడి జరిగింది. ఈ సంఘటనపై మీ స్పందన యేంటి?"

"దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ దాడితో మా పార్టీవారికి యేమాత్రం సంబంధం లేదు."

"కానీ, దెబ్బలు తిన్నాయన ఇది హిందుత్వ మూకల దాడే అంటున్నారు?"

"అతను కపట సన్యాసి, దేశద్రోహి, మావోయిస్ట్, చర్చి ఫాదరీల యేజంట్.. "

"అందుకని భౌతికంగా దాడి చేస్తారా?"

"తప్పదు. వాస్తవానికి దాడి చేసినవాళ్లు దేశభక్తులు, శాంతికాముకులు. కానీ ఆ దొంగసన్యాసి తనపై దాడి చేయించుకునేలా వాళ్లని పురికొల్పాడు."

"స్వామి అగ్నివేశ్ వల్లే ఈ దాడి జరిగిందంటారు, అంతేనా?"

"అంతే. ధర్మరక్షణార్ధం హింస తప్పదని శ్రీకృష్ణులవారే సెలవిచ్చారు, మానవమాత్రులం మనమెంత!"

"ఇట్లాంటి చట్టవ్యతిరేక కార్యక్రమాల్ని.. "

"ఇంక ప్రశ్నలడిగి మీరు ఇబ్బందుల్లో పడొద్దు. దయచెయ్యండి, జై శ్రీరాం!"

Tuesday 17 July 2018

స్వామి అగ్నివేశ్

లోకంలో మంచీచెడూ వుంటాయి. చెడ్డవాళ్లు సమాజానికి చెడు చేస్తుంటే, మంచివాళ్లు మంచిని పంచుతుంటారు. అట్టి మంచివాళ్ళల్లో నిఖార్సైన మంచివాడు స్వామి అగ్నివేశ్.
వెట్టిచాకిరి విముక్తి కోసం, పౌరహక్కుల కోసం, ఆదివాసీ సమస్యల కోసం.. అలుపెరుగని పోరాటం చేస్తున్న ధీశాలి స్వామి అగ్నివేశ్. ఈ కారణంగా సహజంగానే ఆయన రాజ్యానికీ, మతోన్మాదులకీ శత్రువయ్యాడు.
నానాటికీ దేశంలో ప్రజాస్వామ్య వాతావరణం తగ్గిపోతూ మతమూకల ఆగడాలు ఎక్కువవుతున్నాయి. ఇందుకు మరో నిదర్శనం ఇవ్వాళ స్వామి అగ్నివేశ్ పై జరిగిన దారుణమైన దాడి. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను.

Thursday 5 July 2018

డబ్బు - వైద్యం

కథ రాసేద్దామనే దుస్సాహసం, పూర్తి చెయ్యలేని అసహయం ---
ఒక చల్లని సాయంకాలం, పక్షుల కిలకిలలు, కోయిల కుహుకుహులతో వొడలు (తినే వడలు కాదు) పులకరించగా.. మనసు ఆనందంతో గంతులేసింది.
ఇట్లాంటి సమయాల్లో ప్రతివ్యక్తీ తనకి నచ్చిన విషయాల్ని ఆలోచిస్తాడు. కిరాయి హంతకుడు తను చెయ్యబొయ్యే హత్యకి స్కెచ్ రచిస్తే, రసికోత్తముడు ముండల కంపెనీ కొత్తపిట్ట గూర్చి ఆలోచిస్తాడు. రాక్షస ప్రేమికుడు చెయ్యబొయ్యే బలాత్కారం గూర్చి ఆలోచిస్తే, తిండిపోతు వెధవ బూందీలడ్డుని తల్చుకుని లొట్టలేస్తాడు.
ఇలా ఒక్కో కేటగిరీ వాడు తమతమ స్పెషాలిటీ సంబంధిత ఆలోచనల్ని చేస్తాడు. ఇంతమందిని పలువిధములుగా పులకింపజేసిన ప్రకృతికి పులకరించకపోడానికి నాకేం తక్కువ? అంచేత నేనూ తీవ్రంగా పులకించేసాను. కానీ పులకించేశాక ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. కొద్దిసేపు తీవ్రంగా ఆలోచించిన తరవాత 'ఒక గొప్పకథ రాసెయ్యాలి' అని నిర్ణయించేసుకున్నవాడనై.. laptop వొళ్ళో పెట్టేసుకుని (ఆ రోజుల్లో ఫోన్లో రాయడం నాకు తెలీదు).. కథ టైపడం మొదలెట్టాను.
తెలుగు సాహిత్యంలో రావిశాస్త్రిని మించిన మొనగాడు లేడు (ఉన్నాడని ఎవరైనా చెప్పినా ఒప్పుకోడానికి నేను సిద్ధంగా లేను). రావిశాస్త్రి తనకి తెలిసిన ప్లీడర్లు, దొంగల గూర్చి రాశాడు. అంచేత గురువుగార్ని ఫాలో అయిపోతూ నేనూ డాక్టర్లు, పేషంట్ల గూర్చి ఒక కథ రాయాలని డిసైడ్ అయిపొయ్యాను. రాయడానికి ఒక లైన్ తళుక్కుమంది. 'వార్నీ, కథ రాయడం అంటే ఇంతేనా' అనుకుని టైపుతూ వెళ్లిపొయ్యాను. సాయంకాలం రాత్రిగా మారింది. కొద్దిసేపటికి వేళ్లు నొప్పెట్టి, విసుగ్గా అనిపించింది. 'హాయిగా సింగిల్ మాల్ట్ చప్పరిస్తూ ప్రకృతిని ఎంజాయ్ చెయ్యక, ఈ కథ రాసే కూలిపని నేనెందుకు చెయ్యాలి?' అనే ధర్మసందేహం కలిగి, టైపడం ఆపేశాను.
కొద్దిసేపటికి 'నన్నేం చేస్తావ్?' అంటూ నే టైపిన కథ ట్రాఫిక్కులో చిక్కుకుపోయిన చిన్నపిల్లాళ్లా నన్ను దీనంగా ఆడిగినట్లనిపించింది. నిజమే! ఇప్పుడీ stillborn baby ని నేనేం చెయ్యాలి? 'డోంట్ వర్రీ, నీకు తర్వాతెప్పుడైనా మార్పులు చేర్పులూ చేసి ప్రాణం పోస్తాలే!' అని సముదాయించి దాన్ని డ్రాఫ్టుగా అవతల పడేశాను.
తరవాత అప్పుడప్పుడూ కథ గూర్చి గుర్తొచ్చినా.. 'కథకులు గొప్పవారు. వ్యక్తుల్నీ, సమాజాన్నీ లోతుగా, సునిశితంగా పరిశీలించిన మేధావులు. నాకు సాధారణ విషయాలు తెలుసుకోడానికే బుర్ర సహకరించదు. అటువంటి నేను కథ రాయడమా!' అని నవ్వుకోడం మినహా, దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు.
అదీగాక - సాయంకాలం పక్షుల కిల కిలాలు, కోయిల కుహుకుహులు నాకు మళ్లీ వినిపించలేదు, మూడూ రాలేదు. కాబట్టి కథని ఎడిట్ చేసే అవకాశం రాలేదు.
ఇదంతా యెందుకు రాస్తున్నానంటే - ఆ కథని వెదికి గుంజుకొచ్చి ఇక్కడ పోస్ట్ చేద్దామని. పోస్ట్ చెయ్యడం ఎందుకంటే - దాన్ని ఓ సాయంత్రం కూచుని రాశాను కాబట్టి.. ఎక్కడో ఒకచోట పోస్ట్ చేస్తే కథ 'అనుకుని' నేను చేసిన కూలిపనికి ఒక logical conclusion ఇచ్చేశానన్న తృప్తి కోసం.
ఇప్పటిదాకా నా 'పూర్తికాని కథ' ఆడియో రిలీజ్ ప్రోగ్రాం చదివారు. త్వరలో అసలు కథ చదువుతారు. కథని సరిచేసే ఓపిక లేనందున మీకు అనేక టైపో కనిపించవచ్చు. అందుగ్గానూ నన్ను క్షమించాలని మందుగా.. సారీ, ముందుగా కోరుకుంటున్నాను. ఇక్కడదాకా చదూకుంటూ వచ్చినందుకు ధన్యవాదాలు/కృతజ్ఞతలు (రెంటికీ తేడా తెలీనందున ఫోర్స్ కోసం రెండూ వాడేశాను).

---------------------------------------------------------------------------------------------

'సకల చరాచరములకి పుట్టినిల్లైన ఈ ప్రపంచంలో శాశ్వతమైనది ఏమిటి?'
మంచితనం శాశ్వతమని కొందరూ, కీర్తిప్రతిష్టలు శాశ్వతమని ఇంకొందరు అంటారు (బాబ్బాబూ! అవెట్లా వుంటాయో, ఎక్కడుంటాయో చూపించి పుణ్యం కట్టుకోండి).
నా దృష్టిలో మనుషులే కాదు - రాళ్ళూ, రప్పలూ శాశ్వతం కాదు (మా ఊళ్ళో కొండల్ని ఎప్పుడో తవ్వేసి కరిగించేశారు). ఈ ప్రపంచంలో ఒక్క డబ్బు మాత్రమే శాశ్వతమైనది, ఖచ్చితంగా ఇంకేదీ కాదు. నాకీ అభిప్రాయం పట్ల ఏ విధమైన కంఫ్యూజన్ లేదు.
మానవజన్మ అశాశ్వతం అయినప్పటికీ - డబ్బు మాత్రం శాశ్వతమే! ఎదురుగా కనిపిస్తున్న ఈ నగ్నసత్యాన్ని కొందరు కవులు, కథకులు ఒప్పుకోరు. వాళ్ళు మానవత్వం అంటారు, సమాజ శ్రేయస్సు అంటారు, గాడిదగుడ్డు అంటారు - ఇట్లాంటి చెత్త నేనసలు పట్టించుకోను. యివన్నీ - పేదరికంతో, నిద్ర పట్టని రోగంతో బాధ పడుతూ, ఏడుస్తూ ఠావుల కొద్దీ నింపేసే వారి దరిద్రపు గొట్టు రాతలు. లేదా దరిద్రాన్ని ప్రేమించే వింతరోగం అయ్యుండొచ్చు! నేనిలా రాస్తున్నందుకు నన్నొట్టి డబ్బుమనిషనీ, కునిష్టి వెధవననీ మీరనుకోవచ్చు. అనుకోండి, నేనసలు పట్టించుకోను.
లేకపోతే - కళ్ళ ముందు కనిపించేదొకటీ, ఈ వెధవలు చెప్పేదొకటీ ఎలాగవుతుంది చెప్పండి? పెద్ద అంబానీగారు పొయ్యారు, ఇవ్వాళ వారి కొడుకులు చిన్న అంబానీలు చచ్చేంత డబ్బుల్తో ఉయ్యాలలూగుతున్నారు. రేపు వీళ్ళ కొడుకులు బుల్లి అంబానీలు వజ్రాలతో తులాభారాలూగుతారు. అంటే అర్ధమేంటి? - మనుషులు చస్తుంటారు, తరాలు మారుతుంటయ్, డబ్బు మాత్రం చచ్చినా చావదు. డబ్బే శాశ్వతం అంజెప్పడానికి యింతకన్నా మంచి ఉదాహరణ లేదనుకుంటున్నాను.
డబ్బున్నోడంటే ఆ తిరపతి వెంకన్నక్కూడా భలే ఇష్టం. అందుకే ఆడికి తొందరగా దర్శనం ఇచ్చేస్తాడు. 'ఏంటి బ్రదరూ! నీకు మంచితనం మాత్రమే వుందా? సొమ్ముల్లేవా? ఎల్లెళ్ళవయ్యా, ధర్మదర్శనం క్యూలో ఆ చివరాకర్న నించో. ఫీలవ్వమాకు. రేపటికో, ఎల్లుండికో ఆ వెంకన్న దర్శనం అవ్వుద్దిలే! మంచితనం మాత్రమే వున్నోడివి, ఆ మాత్రం ఓపిక పట్టాలి మరి!'
ఇలా - ఈ ప్రపంచాన్ని నడిపించేది డబ్బు మాత్రమే అన్న జీవిత సత్యాన్ని చిన్నవయసులోనే గ్రహించేసిన నేను, డబ్బు సంపాదనకి గల మార్గాల్ని తీవ్రంగా ఆలోచించాను. ఏ వ్యాపారంలోనైనా పొటీ వుంటుంది. ఇవ్వాళ ఒక వ్యాపారంలో పదిరూపాయిలు సంపాదిస్తే, రేపటి కల్లా పదిమంది పోటీకి తయారవుతారు.
బాగా ఆలోచించిన మీదట - ఈ దేశంలో చదువు అనే పెట్టుబడి మంచి లాభసాటిగా వుంటుందని గ్రహించాను. బాగా గిట్టుబాటయ్యే వృత్తి ఏమి? ఠక్కున నాకు తట్టిన సమాధానం 'వైద్యవృత్తి'. ఈ వృత్తిలో దిగుబడి ఎక్కువ, పోటీ తక్కువ. ఈ విషయం గ్రహించిన నేను కష్టపడి గవర్నమెంట్ మెడికల్ కాలేజిలో మెడికల్ సీటు సంపాదించాను. అధిక దిగుబడి కోసం బాగా గిట్టుబాటయ్యే బ్రాంచినెన్నుకుని పోస్ట్ గ్రాజుయేషన్ (పీజి) కూడా చేశాను.
పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా చేతికందే సమయానికి నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. నా ఆశయం ప్రైవేట్ ప్రాక్టీస్. కట్నం మార్కెట్లో నా రేటు బాగానే పలుకుతుంది. అందర్లో అత్యంత ఎక్కువ ధర ఎవరు పలికారో ఆ సంబంధాన్నే చేసుకున్నాను. కొందరు నా భార్య బాగా పొట్టిగా వుందన్నారు, యింకొందరు నా భార్యకి మెల్లకన్నన్నారు, నేను పట్టించుకోలేదు.
కొందరు పనికిమాలినవాళ్ళు పవిత్ర వివాహం, అలూమగలు, అనురాగ బంధం లాంటి పనికిమాలిన చెత్త వాగుతుంటారు. మొదట్లోనే చెప్పాను కదా? నేను వెధవల మాటలు పట్టించుకోనని! పెళ్ళి అనేది డబ్బు కోసం మాత్రమేననీ, బంగారు భవిష్యత్తుకి వేసుకునే తారు రోడ్డు వంటిది మాత్రమేనని నా నమ్మకం. సెక్సు సుఖాలే కావాలంటే డబ్బు పడేస్తే మార్కెట్లో అమర సుఖాలు లభిస్తాయి, అయితే - దానికీ డబ్బు కావాలి. చూశారా డబ్బుకున్న పవర్! (కొందరు పీజీ చెయ్యకుండానే పెళ్ళి చేసుకుంటారు, అది చాలా తప్పు. మార్కెట్లో మన రేటు పెరగాలంటే పీజీ చెయ్యాలి).
నా మామ పెద్ద కాంట్రాక్టర్. ఆయన కుటుంబంలో డబ్బు తప్పితే చదువుకున్నవారు లేరు, నలుపే తప్ప ఎర్రటివాళ్ళు లేరు . అంచేత - చదువే కాకుండా.. ఎర్రగా, అందంగా వుండే నన్ను అల్లుడిగా కొనుక్కున్నందుకు అందరూ మా మామని అభినందించారు. ఆయన డబ్బుకు తగ్గ అల్లుడు దొరికినందుకు విపరీతంగా సంతోషించాడు, గర్వించాడు. ఆ సంతోషంతోనే, ఊరు నడిబొడ్డున నాకో నాలుగంతస్తుల ఆస్పత్రి కట్టించాడు. ఆ అస్పత్రిలో కన్సల్టేషన్ రూములో రివాల్వింగ్ చైర్లో కూర్చున్న నేను మిక్కిలి సంతోషించాను. ఇప్పుడు నేను నా ఆశయంలో సగం సాధించినట్లుగా అనిపించింది.
డబ్బు చాలా విలువైనది, డబ్బు సంపాదన ఒక పవిత్ర వ్యాపకం. అందువల్ల మనం డబ్బు సంపాదన పట్ల గౌరవం వుండాలి, ఒక సీరియస్ కమిట్మెంట్ వుండాలి. అందుకోసం చక్కని ప్లానింగ్ కూడా కలిగుండాలి. ఏ వ్యాపారంలోనైనా బ్రాండ్ బిల్డింగ్ ముఖ్యం. అటుతరవాత ఆ బ్రాండ్ ఇమేజే మనకి డివెడెండ్లు సంపాదిస్తుంది.
ఈ సూత్రం గ్రహించిన నేను - ప్రాక్టీసు పెట్టిన కొత్తలో నిజాయితీగా వైద్యం చేశాను, గొడ్డులాగా కష్టపడ్డాను. డాక్టరు బాబు 'ధర్మప్రభువు', 'అపర ధన్వంతరి', 'చల్లని చెయ్యీ' వగైరా బిరుదులు సంపాదించాను. మొదట్లో నిదానంగా, తరవాత వేగంగా, అంకా తరవాత శరవేగంగా.. నా ప్రాక్టీస్ అభివృద్ధి చెందింది.
సమాజంలో కులజాఢ్యం వుందని, అది పోవాలనీ కొందరు 'సమాజ హితం' అనే జబ్బుతో బాధపడే రోగిష్టులు చెబుతుంటారు. నాకైతే ఈ విషయం పట్ల ఏ అభిప్రాయమూ లేదు. కానీ డబ్బు సంపాదనకి మాత్రం కులం పనికొస్తుంది. ఎలాగో ఇప్పుడు చెబుతాను.
ప్రాక్టీసులో నా కులం వాళ్ళంటే ఎంతో అభిమానం వున్నట్లు ప్రవర్తించాను. మా కులసంఘానికి విరాళాలు ఇచ్చాను. నా కులం వాళ్ళెవరూ ఇంకో డాక్టర్ దగ్గరకి వెళ్ళరాదు, అదీ నా లక్ష్యం! అంచేత - మా కులం వాళ్ళ ఇళ్ళల్లో చిన్నచిన్న ఫంక్షన్లక్కూడా ఠంచనుగా హాజరు వేయించుకున్నాను. ఇప్పుడు నేను వాళ్ళందరికీ ఇంట్లోమనిషితో సమానం! 'డాక్టరుగారికి మన కులం అంటే తరగని ప్రేమ!' వాళ్ళిలా అనుకోవటం నాకు నవ్వుగా వుంటుంది. నాకిదంతా చాలా సులువుగా జరిగిపోయింది, కులానికున్న పవరు అట్లాంటిది.
అమ్మయ్య! ఇప్పుడు నేను నా బ్రాండ్ బిల్డింగ్ జయప్రదంగా పూర్తి చేశాను. ఇప్పుడు జాగ్రత్తగా, నిదానంగా నా ప్రాక్టీసుని రెండో గేర్లోకి మార్చాను. ఇందుకు నాకు మార్గదర్శకత్వం - పెరుగుతున్న పెట్రోల్ రేట్లు, హోటల్ రేట్లు. ఇవి కొద్దికొద్దిగా - నొప్పి తెలీకుండా సూదిమందేసినట్లు, రేట్లు పెంచుకుంటుంటయ్.
ఇప్పుడు నేను - పేషంట్లకి (అవసరం లేకపోయినా) టెస్టులు రాయడం, (అవసరం లేకపోయినా) ఎడ్మిట్ చేసుకోవటం మొదలెట్టాను. నా పేషంట్లు కూడా నన్ను పూర్తిగా నమ్మినందున, ఏమాత్రం సందేహించకుండా సంతోషంగా నాకు డబ్బులు సమర్పించుకోసాగారు. ఇక్కడో జాగ్రత్త - పేషంట్లలో కొందరు దొంగముండా కొడుకులుంటారు. మనం డబ్బు చేసుకునే విధానాన్ని కుక్కలా పసిగడ్తారు. ఆ కుక్కల వాసనకి అందకుండా మనం జాగ్రత్త పడాలి.
నేను తెలివైనవాణ్ని. 'బంగారు గుడ్లు - బాతు' కథ తెలిసినవాణ్ని. అందుకే - పేషంట్లనే బంగారు బాతుల మందని మైంటైన్ చేస్తున్నానే కానీ, ఒక్క బాతునీ కేసుకు తిన్లేదు. ఆ అమాయకపు బాతుల మంద పెట్టే బంగారు గుడ్లని బుట్టలో వేసుకుని.. ఊరికి నలుమూలలా స్థలాలు, పొలాలు కొనేశాను (వీటిని బేరం చెయ్యడం దగ్గర్నుండి, రిజిస్ట్రేషన్ గట్రా పన్లన్నీ నాకు నా పేషంట్లే చేసిపెట్టారు).
ఇప్పుడు నాకు బొజ్జ పెరిగింది, సంపాదన మరింత పెరిగింది. నా స్థలాలు, పొలాల రేట్లు ఆకాశాన్నంటుతున్నయ్. రాజధాని నగరంలో ఏదైనా పెద్ద వ్యాపారం మొదలెట్టే ఆలోచన కూడా వుంది. స్టార్ హోటల్ వ్యాపారం ఎలా వుంటుంది? పోనీ - ఒక స్టార్ హోటల్లాంటి హాస్పిటల్ నిర్మిస్తే ఎలా వుంటుంది? తెలిసిన వ్యాపారం, సేఫుగానూ వుంటుంది. నేనీ ఆలోచనల్తో బిజీగా వుంటున్న సమయంలో, చాలా యేళ్ళ తరవాత సూర్యాన్ని చూశాను.
సూర్యం.. మెడికల్ కాలేజిలో నా క్లాస్మేట్. నాకన్నా ఎత్తుగా వుంటాడు, నాకన్నా అందంగా వుంటాడు, నాకన్నా ఎక్కువ మార్కులు సంపాదించాడు, అనేక గోల్డ్ మెడల్సూ సాధించాడు. సూర్యానికి అన్నీ వున్నాయి కానీ.. డబ్బు సంపాదన తెలివితేటలు లేవు. దేవుడు తెలివైనవాడు, సూర్యానికి చదివే తెలివినిచ్చాడు, నాకు డబ్బు సంపాదించే తెలివినిచ్చాడు. ఇది దైవనిర్ణయం, కాదన్డానికి మనమెవరం?
సూర్యానికి మెడికల్ నాలెడ్జ్ ఎక్కువ, క్లినికల్ స్కిల్స్ ఎక్కువ, కుటుంబ బాధ్యతలూ ఎక్కువే. అందుకే గవర్నమెంటు ఉద్యోగంలో చేరిన్నాడు చాలా సంతోషించాడు. అతని జీతం ఇంటి ఖర్చుల నిమిత్తం ఇరవయ్యో తారీక్కల్లా ఖర్చైపోతుంది. ఆపై రాబోయే జీతం కోసం ఎదురు చూస్తూ ఉద్యోగం చేస్తుంటాడు. 'ఏదైనా ఆస్పత్రిలో ప్రాక్టీస్ చెయ్యొచ్చుగా?' అంటే - 'నో నో, గవర్నమెంటు డాక్టర్లు ప్రయివేట్ ప్రాక్టీస్ చెయ్యడానికి రూల్సు ఒప్పుకోవు' అంటాడు. అందుకే - అద్దె ఇల్లు, డొక్కు స్కూటర్తో జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు.
నాకు సూర్యం బాపతు మనుషుల పట్ల గౌరవం లేదు, పైగా చికాక్కూడా. వీళ్ళంతా సంపాదన చేతకాని చవటలు, సన్నాసులు. అందుకే - 'సామాజిక బాధ్యత, రూల్సు రోళ్ళకర్ర' అనే ముసుగులేసుకుంటారని నమ్ముతాను. డబ్బు సంపాదించడం చేతకాక - డబ్బునే అల్పమైనదిగా భావించే అల్పులు వీళ్ళు. ఐశ్వర్యరాయ్ దొరకలేదని, అందాన్నే అసహ్యించుకునే మానసిక దౌర్భల్యులు వీళ్ళు. అందుకనే వీళ్ళ నెత్తిన దరిద్రప్పెద్దమ్మ కూర్చునుంటుంది. సూర్యం భార్యది యేదో ఉద్యోగం కాబట్టి సరిపోయింది కానీ, లేకపోతే ఎప్పుడో వెళ్లిపొయ్యుండేది.
అతను ఉద్యోగ రీత్యా ట్రాన్స్ఫర్లవుతూ అనేకచోట్ల పన్జేస్తూ వుంటం మూలానా, చాల్రోజుల పాటు మేమిద్దరం కలుసుకోవటం కుదర్లేదు. ఈమధ్య ఏదో పనుండి నన్ను కలుద్దామని వచ్చాడు. నా విశాలమైన ఆస్పత్రి, ఆస్పత్రిలో కిటకిటలాడుతున్న పేషంట్లని చూసి నోరెళ్ళబెట్టాడు.. 'కుళ్ళుకున్నాడా? కుళ్లుకునే ఉంటాడు!' సూర్యం నా స్టేటస్ చూసి కుళ్ళుకున్నాడని అనుకోవటం నాకు చాలా ఆనందంగానూ, మరింత గర్వంగానూ అనిపించింది.
'డబ్బు సంపాదన వల్ల కలుగు అదనపు ప్రయోజనమేమి?'
నీ గత పేదరికపు చరిత్ర ఎరిగిన వారు నీ డబ్బుని, లక్జరీల్ని చూసి ఆశ్చర్యపోయినప్పుడు మనసంతా హాయిగా, ప్రశాంతంగా అయిపోతుంది. ఒకప్పుడు మొటిమల్తో గరుగ్గా వున్నా నీ మొహం బ్యూటీ పార్లల్లో వేలు తగలేసి నున్నగా అద్దంలా తయారు చేసుకున్నప్పుడు, నీ స్నేహితులు నీ మొహాన్ని ఎడ్మైరింగ్ గా చూస్తుంటే గర్వంగా వుండదూ? ఒకప్పుడు పాలుపోసే పాపాయమ్మకి కన్ను కొట్టి చెప్పు దెబ్బలు తిన్న నువ్వు, సిన్మా స్టార్ లాంటి అందమైన పెళ్ళాంతో కాపురం చేస్తుంటే చూసేవాళ్ల కళ్ళల్లో నీమీద అసూయ ఎంత కిక్కిస్తుందో కదా!
అటుతరవాత నా ఆస్పత్రికి ఇంకొన్నిసార్లు వచ్చాడు సూర్యం. వాస్తవానికి - అతనలా నా దగ్గరకి వచ్చేట్లు నేనే అతనితో కొన్ని పన్లు కల్పించుకున్నాను. సూర్యం నా ఆస్పత్రి, నా పేషంట్ల తాకిడీ, నా వైభవం చూసి యేడవాలి.. నాకది బాగుంది. పైసా ఖర్చు లేకుండా అనుభవిస్తున్న ఆనందాన్ని నేనెందుకు కాదనాలి?
సూర్యం - నేను పేషంట్లని డీల్ చేసే విధానానికి కొన్నిసార్లు ఆశ్చర్యపొయ్యాడు, ఇంకొన్నిసార్లు బిత్తరపొయ్యాడు, అప్పుడప్పుడు చిరాగ్గా మొహం పెట్టాడు. మొత్తానికి సూర్యంకి నా పద్ధతి నచ్చనట్లుగా గమినిస్తున్నాను. ఆ రోజు ఏదో పని మీద నా దగ్గర కొచ్చాడు సూర్యం. నేను బిజీగా పేషంట్లని చూస్తున్నందున వొక మెడికల్ జర్నల్ తిరగేస్తూ కూర్చున్నాడు. అయితే - ఒక చెవి నా పేషంట్ల వైపే వేసే వుంచాడు.
అప్పుడు వచ్చాడు నారాయణ. పక్కనే పీలగా వణికిపోతూ ఒక కుర్రాడు, వాడు నారాయణ కొడుకు. వాడికి రెండ్రోజులుగా జ్వరంట. నారాయణ నాలుగెకరాల రైతు, బక్కగా మకిలి పట్టిన ఇత్తడి చెంబుల వుంటాడు. అతనిది జాతీయస్థాయిలో 'ఉత్తమ పేదరైతు' ఎవార్డు కోసం ఏకగ్రీవంగా ఎన్నిక కాగలిగిన దుస్థితి. వ్యవసాయం గిట్టుబాటు కాక, పిల్లల చదువుల కోసం పొలం అమ్మేశాడు. కొనుక్కున్నదీ నేనే! అంతేకాదు, ఆ చుట్టుపక్కల వూళ్ళల్లో అనేక భూములు నాచేత కొనిపించాడు. అతను పైసా ఆశించలేదు, నేనూ ఇవ్వలేదు. 'భూమి బంగారం డాట్టరుగారు! ఏనాటికైనా భూవే మన్ని కాపాడుద్ది.' అనేవాడు. కానీ తన భూమిని మాత్రం వాయిదాలవారీగా అమ్మేసుకున్నాడు. నాకా భూమీ గట్రా ఎకనామిక్స్ సంగతి తెలీదు గానీ.. నా దగ్గర పేరుకుపోయిన బ్లాక్ మనీని వదిలించుకోటానికి ఆ పొలాల కొనుగోలు బాగా ఉపయోగపడింది.
నారాయణ నాకేదో ఫ్రీ సర్వీస్ చేస్తున్నాడని నేను భావించలేదు. ఈ సమాజంలో చదువు లేనివాడికి చదువుకున్నవాడి పట్ల, అందునా డాక్టర్ వృత్తిలో వున్నవాడి పట్ల అభిమానం, గౌరవం వుంటాయి. వాటిని మనం క్యాష్ చేసుకోవాలి. ఏదో మొహమాటంగా, ఇష్టం లేనట్లు నారాయణ సేవల్ని స్వీకరించినట్లు పోజు కొట్టానే గానీ, నాకు నారాయణ వల్ల చాలా లాభం చేకూరింది.
నేను యెంతో కంగారుపడుతూ రక్తపరీక్షలు, ఎక్స్ రేలు చేయిస్తూ నారాయణ కొడుక్కోసం చాలా ఆదుర్దా చెందాను.
పాఠకులకి ఒక గమనిక -
వాస్తవానికి వైద్యం చేసేప్పుడు నేనస్సలు ఆందోళన చెందను. రెడ్డీ కిళ్ళీ షాపులో రెడ్డిగారు కిళ్ళీల్ని ఎంత అలవోకగా కట్టగలడో నేనూ అంతే ఈజ్‌తో వైద్యం చేస్తాను. కానీ - పేషంట్లని మెప్పించడానికి మొహానికి ఆందోళనా, ఆదుర్దా పులుముకుంటాను. ఈ నటన నా వృత్తిలో భాగం!
రక్తపరీక్షల రిపోర్టు చూసి బాధగా నిట్టూర్చాను.
"అయ్యో నారాయణా! తెల్లరక్త కణాలు బాగా తగ్గిపొయ్యాయి. అర్జంటుగా ఐసీయూలో వుంచి, వైద్యం చెయ్యాలి" దిగాలుగా అన్నాను.
"బాబూ! డాట్టరుబాబు! నా బిడ్డని నువ్వే రచ్చించాలా!" అంటూ నారాయణ నాకాళ్ళపై పడి భోరుమన్నాడు.
"అయ్యో! ఇదేంటి నారాయణా! నీ బిడ్డ నాకూ బిడ్డతో సమానం. నా ప్రాణం అడ్డైసైనా సరే నీ బిడ్డని రక్షిస్తాను. ఊరుకో, ఏడవకు." అంటూ ఓదారుస్తూ నారాయణ కొడుకుని ఐసీయూలో ఎడ్మిట్ చేసుకున్నాను.
"నేన్నీకు రాములోరికి అనుమంతుళ్ళాగా సేవ చేసాను. ఇయ్యాల నా బిడ్డని నీ చేతిలో యెడతన్నాను. నీ ఇట్టం." అంటూ కుళ్లికుళ్లి ఏడుస్తూ నర్సుతో పాటు ఐసీయూ వైపుగా వెళ్ళాడు నారాయణ.
సూర్యం ఇంక వుండబట్టలేకపొయ్యాడు.
"ఇదేంటి! కొన్నాళ్ళుగా చూస్తున్నాను, నీ దగ్గరకి జ్వరంతో వచ్చే వాళ్ళందరికీ ప్లేట్లెట్ కౌంట్ తక్కువగా వస్తుంది. హౌ ఈజిట్ పాజిబుల్? ఒక్కసారి నీ లాబ్ టెక్నీషియన్‌తో మాట్లాడు, అతను రిపోర్టింగ్ పట్ల నాకు అనుమానంగా వుంది." అన్నాడు.
నేను నా రివాల్వింగ్ చైర్లో ఇబ్బందిగా కదిలాను. ఏదో పనంటూ వచ్చినవాడికి ఈ కూపీలెందుకు?
అసలు సంగతేంటంటే - నా లాబ్‌లో జ్వరంతో వచ్చినవాళ్లందరికీ తెల్లరక్తకణాలు తక్కువే వస్తాయి. అది లాబ్ టెక్నీషియన్‌కి నా ఇన్స్ట్రక్షన్! ఓ పదిరోజుల పాటు ఐసీయూలో నేను తీవ్రంగా వైద్యం చేస్తాను. అనేక ఖరీదైన మందులు వాడుతూ, నా శాయశక్తులా కృషి చేసి పేషంటుని కాపాడతాను. క్రమంగా తెల్లరక్తకణాలు నార్మల్ అయిపోతాయి. వెళ్ళేప్పుడు డబ్బుకుడబ్బు, 'ఈ డాట్టరుగారు దేవుడు. ఈయన వైద్యం వల్లనే నా బిడ్డ బతికి బట్ట కట్టాడు' వంటి మెప్పుకోళ్ళు. ఇది నా మోడస్ ఒపరాండి, నా వ్యాపార రహస్యం.
కానీ ఇవన్నీ నేను సూర్యంకి చెప్పలేను, చెప్పను. ఒకవేళ చెప్పినా, అతనికి నచ్చదు. ఏదో దేశాన్నుద్ధరించేవాళ్లా నాకు క్లాసు పీకుతాడు. ఈ దేశంలో డబ్బున్నవాడంటే అందరికీ లోకువే!
"టెక్నీషయన్తో మాట్లాడ్డం ఇప్పుడు కుదర్దు, రేపు మాట్లాడతాలే." అన్నాను పొడిగా.
"పాపం! మరీ పేదవాళ్లా వున్నాడు, ఫీజులో రాయితీ ఇవ్వచ్చేమో!" అన్నాడు సూర్యం.
నాకు ఆ అమాయకుణ్ని చూసి నవ్వొచ్చింది. నాకు ఫీజు గుంజటంలోనూ ఒక పద్ధతుంది. యాభై వేలు బిల్లేసి పదివేలు తగ్గిస్తాను, నా 'ధర్మప్రభువు' ఇమేజ్ దెబ్బతినకుండా చూసుకుంటాను.
అయితే - ఇక్కడో మతలబుంది. రోగం (?) తగ్గాక వెళ్ళేప్పుడు ఒక్కసారిగా అన్నివేలు కట్టమంటే, పేచీ పెడతారు.. నేస్టీ పీపుల్. అందువల్ల - ఆక్సిజన్ కనీ, ఖరీదైన ఇంజక్షన్లకనీ (ఆ మందులు మళ్ళీ నా మందుల షాపుకే చేరుకుంటాయి, అది వేరే సంగతి) రోజువారిగా గుంజాలి. కానీ ఇవన్నీ బయటకి చెప్పుకునేవి కావు.
"తప్పకుండా తగ్గిస్తాను, నారాయణ నాకు బాగా కావాల్సినవాడు." నవ్వుతూ అన్నాను.
సూర్యం సందేహిస్తూ అన్నాడు.
"ఇలా అంటున్నందుకు ఏమీ అనుకోకు. ఇది నీ హాస్పిటల్, నీ ఇష్టం. ఈ కేస్ నిజంగానే డెంగీ ఫీవర్ అని అనుకుంటున్నావా?"
సూర్యం అడిగిన పధ్ధతిలోనే నాకర్ధమైంది - అతనికి డయాగ్నోసిస్ పట్ల అనుమానం వుందని. నాకు చికాకేసింది, కానీ అతన్ని చూసి జాలేసింది.
అతను చదువులో నాకన్నా తెలివైనవాడు, నాతోటివాడు, మంచివాడు. కానీ బొత్తిగా అమాయకుడు. జీతం తప్పించి పైసా సంపాదన తెలీనివాడు. కేవలం డబ్బు ప్రాముఖ్యతనీ, ప్రభావన్నీ మాత్రమే గుర్తించలేక అజ్ఞానిగా మిగిలిపొయ్యాడు.
అతనికి మరీ భగవద్గీత కృష్ణుడంత కాకపోయినా, కొద్దిగా జ్ఞానోపదేశం చేద్దామని ముచ్చటేసింది.
"సూర్యం! నువ్వూ నేనిలా అంటున్నందుకు ఏమీ అనుకోకు. నువ్వు మంచివాడివి, అందులో నాకేమాత్రం సందేహం లేదు. కానీ మంచితనానికి ఈ లోకంలో విలువ లేదు, ఒక్క డబ్బుకి మాత్రమే విలువుంది. ఆ డబ్బు నీ చేతిలో వున్నా, దావూద్ ఇబ్రహీం చేతిలో వున్నా.. ఒకేరకమైన విలువ. అమెరికా వాణ్నీ, ఆఫ్రికా వాణ్నీ వేరు చేసేది ఒక్క డబ్బు మాత్రమే!" అన్నాను.
"అయితే?" అర్ధం కానట్లు చూశాడు సూర్యం.
"నీకు వైద్యం బాగా తెలుసు. కానీ ఏం లాభం? నీకా వైద్యం విలువ తెలీదు. సింహానికి పంజానే బలం, ఆ పంజా ఉపయోగించుకొనే బ్రతకాలి. లేకపొతే సింహానికీ, జింకకీ తేడా లేదు. సింహానికి పంజాలాగే మన డాక్టర్లకి ట్రీట్మెంట్ తెలుసుండటమే పంజా. అది వాడుకుంటూ మనం బ్రతికెయ్యాలి." అన్నాను.
సూర్యం నావైపు ఆశ్చర్యంగా చూశాడు.
"రాజకీయ నాయకుడు పదవిని అడ్డం పెట్టుకుని కోట్లు మింగేస్తాడు, గవర్నమెంట్ ఉద్యోగస్తుడు లంచాలు గుంజేస్తాడు, తెలివైనవాడు అమాయకుణ్ని మోసగిస్తాడు, బలవంతుడు బలహీనుణ్ని తొక్కేస్తాడు. ఇది లోక రీతి, నీతి. ఇంతకు మించిన నీతి నాకేమీ కనిపించట్లేదు." నవ్వుతూ అన్నాను.
సూర్యం నవ్వలేదు, ఆలోచిస్తూ అన్నాడు.
"మనం మెడిసిన్ చదువుకున్నాం. ఈ దేశంలో కొందరికి మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది. వైద్యం అనేది ప్రాణాల్ని కాపాడే నైపుణ్యం. రోగులకి నిజాయితీగా నీ సేవలు అందించి, ఆ సేవలకి తగిన ఫీజు వసూలు చేసుకునే హక్కు మనకెప్పుడూ వుంది."
"నిజమే! కానీ - ఎంతో కష్టపడి చదివింది సుఖమయ జీవనం కోసమే కదా!" అన్నాను.
"కాదు. అందుకోసమే అయితే అనేక వృత్తులున్నాయి. వైద్యం ఒక ప్రత్యేకమైన వృత్తి. అందరూ మోసం చేస్తున్నారు కాబట్టి మనమూ చెయ్యొచ్చుననే ఆలోచన ఆత్మవంచన." అన్నాడు సూర్యం.
"ఈ రోజుల్లో నిజాయితీగా వైద్యం చేస్తే డబ్బులిచ్చి చచ్చేదెవరు?" నాకు చికాగ్గా అనిపిస్తుంది. అనవసరమైన చర్చలో ఇరుక్కున్నాను.
"వైద్యం చేసి, వైద్యానికి డబ్బు వసూలు చెయ్యడం వేరు. డబ్బు కోసమే రోగాన్ని పెంచి, భయపెట్టి.. డబ్బు సంపాదించడం వైద్యం అవదు. ఇది నైతికతకి సంబంధించిన విషయం." అని, కొంచెం సేపు ఆగి "ఇది నేనెవ్వర్నీ ఉద్దేశించి అనడం లేదు, జెనరల్ గా చెబ్తున్నాను." అన్నాడు. కానీ - అతను నన్ను ఉద్దేశించే అన్నాడని నాకర్ధమవుతుంది.
నేను సూర్యాన్ని చూస్తుండిపొయ్యాను. పూర్తిగా వ్యతిరేకమైన అభిప్రాయాలున్న ఇద్దరు వ్యక్తులు వాదించుకుని ప్రయోజనం లేదు. కాబట్టి ఇక అతనితో వాదించి లాభం లేదు. అసలు - డబ్బుని గౌరవించనివాడితో నాకు వాదనలెందుకు? పైగా నైతికత అంటూ ఏవో పెద్ద విషయాలు మాట్లాడుతున్నాడు.
అందువల్ల నేనేం మాట్లాడలేదు. బహుశా సూర్యం కూడా నాలాగే ఆలోచించి వుంటాడు, అందుకే అతను కూడా ఇంకేమీ మాట్లాళ్ళేదు. కొద్దిసేపటికి లేచి - నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి నిదానంగా వెళ్ళిపొయ్యాడు. అటు తరవాత అతనెప్పుడూ నా హాస్పిటల్ కి రాలేదు, వస్తాడని నేనూ అనుకోలేదు.
(fb post in 6 parts 30/6/2018)
-----------------------------------------------
నా కథ చదివి అభిప్రాయం తెలియజేసినవారందరికీ ధన్యవాదాలు.
నేను intro లో రాసినట్లు ఇది నాలుగైదేళ్ల క్రితం.. సాయంకాలం నుండి రాత్రి వరకు కూచుని టైపిన కథ. రాసేప్పుడు ముందు skeleton of the story రాద్దామనుకున్నాను.. కానీ flow లో రాసుకుంటూ వెళ్ళిపొయ్యి.. అటుతరువాత ఆసక్తి లేక cold storage లో పెట్టేసాను.
మళ్లీ ఇన్నాళ్ళకి Facebook format కి తగ్గట్లుగా ముక్కలుగా చేసి పోస్ట్ చేశాను. కూతురు పెళ్లిచేసిన గుమ్మడిలా 'హమ్మయ్యా' అని ఊపిరి పీల్చుకున్నాను.
ఈ కథలో నాకు చాలామంది "నేను"లు తెలుసు. ఒకళ్లిద్దరు "సూర్యం"లూ తెలుసు. కాబట్టి రాయడం చాలా సులువుగా జరిగిపోయింది.
ఈ కథ ముగింపు రెండురకాలుగా అనుకున్నాను. ఓపిక/ఆసక్తి లేక అర్దాంతరంగా అలా వదిలేశాను. అందుకే దీన్ని stillborn baby అని చెప్పాను. దీన్ని చివరిదాకా చదూకుంటూ వచ్చినవారు నన్ను మరోసారి మన్నించాలి.
ఈ కథ రాసిన 1st person "నేను"కు స్పూర్తి 'గోవులొస్తున్నాయి జాగ్రత్త' కిరీటిరావు, narration కి స్పూర్తి 'రాజు - మహిషి' మందుల భీముడు. చదివేప్పుడు మీకీ దొంగరాస్కెల్స్ గుర్తొస్తే సంతోషం.
ఈ సమాజంలో బలమైనవారు బలహీనుల్ని exploit చేసే కార్యక్రమం నిరంతరాయంగా జరిగిపోతుందనీ.. ఇక్కడ దయాదాక్షిణ్యాలూ, కరుణాకటాక్షాలు భూతద్దంలో చూసినా కనపడవని నా నమ్మకం.
చివరగా - ఇది కథ రాద్దామనే సరదా తీర్చుకుందుకు రాసిన half baked story. ఇందుమూలంగా కథ (పూర్తిగా) రాయడానికి యెంతో ఓపిక కావాలనీ, అది నాదగ్గర అస్సల్లేదనీ తెలుసుకున్నాను. ఇంకెప్పుడూ ఇటువంటి ప్రయోగాలు చెయ్యనని హామీ ఇస్తున్నాను. 😊

Thursday 28 June 2018

ఎన్నికల సమయం

అవి నా స్కూలు రోజులు. నా స్నేహితుడొకడు సంవత్సరం పొడుగునా చదువుకోడం తప్పించి అన్ని పనులూ చేసేవాడు. పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో.. Imp (important) అంటూ ఏవో ప్రశ్నల్ని సంపాదించే వాడు. పరీక్ష పేపర్ ఔట్ అవుతుందేమోననే ఆశతో చివర్రోజు వరకు వుండేవాడు. పరీక్షల్లో అడిగే ప్రశ్నలు తెలుసుకోడానికి అతను చేసే ప్రయత్నాలు ఆశ్చర్యకరంగా వుండేవి.
ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే.. ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ.. ప్రజల సెంటిమెంట్/ఎమోషన్స్ తెలుసుకుని, ఎలాగైనా గెలవాలనే రాజకీయ పార్టీల లక్ష్యం చూస్తుంటే, నా చిన్ననాటి స్నేహితుడు గుర్తొస్తుంటాడు.
ఒకాయన విదేశాల్లో నల్లధనం అంటాడు, సంవత్సరానికో కోటి ఉద్యోగాలు అంటాడు. ఇంకొకాయన ఋణమాఫీలంటాడు, ఇంటికో ఉద్యోగం అంటాడు. విశేషం ఏమంటే.. తామివన్నీ చెయ్యాలని వీళ్లూ అనుకోరు, చేస్తారని ఓటర్లూ అనుకోరు. అందుకే కొందరు తెలివైన ఓటర్లు ఓటేసేందుకు డబ్బుచ్చుకుంటారు.
అమలు చెయ్య(లే)ని వాగ్దానాల్ని చేసే రాజకీయ నాయకులు, వారిని నమ్మని ప్రజానీకం.. ఇదంతా సైకిల్ చక్రం తిరిగినట్లు ఐదేళ్ల కోసారి వస్తుంటుంది. దీన్నే మనం ముద్దుగా 'ప్రజాస్వామ్యం' అని పిల్చుకుంటున్నాం.
ప్రజలు తమని నమ్మినా, నమ్మకపోయినా రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం సమాయత్తం కాకుండా మానుకోవు. ఏదోక అంశం తీసుకుని పాదయాత్రలనీ, ధర్నాలనీ, నిరాహారదీక్షలనీ.. రకరకాల ప్రయత్నాలు చేస్తుంటయ్.
ప్రజలు/ఓటర్లు గుంభన జీవులు. 'వురే రాజకీయ నాయకులూ! మాకు ఫలానా సమస్య ముఖ్యం, యిందుకోసం ఎవరైతే కొట్లాడతారో వారికి మా ఓటు.' అని తేల్చి చెప్పరు (పరీక్షల్లో ప్రశ్నల్లాగే). అంచేత రాజకీయ పార్టీలు ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ 'యెందుకైనా మంచిద'ని ప్రతి సమస్యనీ ప్రజల సమస్యగా మార్చడానికి కృషి చేస్తుంటాయ్.
మరప్పుడు మనమేం చెయ్యాలి?
అదేంటి మేష్టారూ! ప్రతొక్కటీ విడమర్చి చెప్పాలా? మన "పవిత్రమైన" ఓటు కోసం కుస్తీపోటీలు పడుతున్న రాజకీయ పార్టీల విచిత్ర విన్యాసాల్ని యే విస్కీనో, ఫిల్టర్ కాఫీనో చప్పరిస్తూ ఎంజాయ్ చెయ్యండి. ఇవ్వాళ సినిమాల్లో కన్నా రాజకీయాల్లోనే వినోదం ఎక్కువగా వుంది!

(fb post)

కథ రాసేద్దామనే దుస్సాహసం

కథ రాసేద్దామనే దుస్సాహసం, పూర్తి చెయ్యలేని అసహయం ---
ఒక చల్లని సాయంకాలం, పక్షుల కిలకిలలు, కోయిల కుహుకుహులతో వొడలు (తినే వడలు కాదు) పులకరించగా.. మనసు ఆనందంతో గంతులేసింది.
ఇట్లాంటి సమయాల్లో ప్రతివ్యక్తీ తనకి నచ్చిన విషయాల్ని ఆలోచిస్తాడు. కిరాయి హంతకుడు తను చెయ్యబొయ్యే హత్యకి స్కెచ్ రచిస్తే, రసికోత్తముడు ముండల కంపెనీ కొత్తపిట్ట గూర్చి ఆలోచిస్తాడు. రాక్షస ప్రేమికుడు చెయ్యబొయ్యే బలాత్కారం గూర్చి ఆలోచిస్తే, తిండిపోతు వెధవ బూందీలడ్డుని తల్చుకుని లొట్టలేస్తాడు.
ఇలా ఒక్కో కేటగిరీ వాడు తమతమ స్పెషాలిటీ సంబంధిత ఆలోచనల్ని చేస్తాడు. ఇంతమందిని పలువిధములుగా పులకింపజేసిన ప్రకృతికి పులకరించకపోడానికి నాకేం తక్కువ? అంచేత నేనూ తీవ్రంగా పులకించేసాను. కానీ పులకించేశాక ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. కొద్దిసేపు తీవ్రంగా ఆలోచించిన తరవాత 'ఒక గొప్పకథ రాసెయ్యాలి' అని నిర్ణయించేసుకున్నవాడనై.. laptop వొళ్ళో పెట్టేసుకుని (ఆ రోజుల్లో ఫోన్లో రాయడం నాకు తెలీదు).. కథ టైపడం మొదలెట్టాను.
తెలుగు సాహిత్యంలో రావిశాస్త్రిని మించిన మొనగాడు లేడు (ఉన్నాడని ఎవరైనా చెప్పినా ఒప్పుకోడానికి నేను సిద్ధంగా లేను). రావిశాస్త్రి తనకి తెలిసిన ప్లీడర్లు, దొంగల గూర్చి రాశాడు. అంచేత గురువుగార్ని ఫాలో అయిపోతూ నేనూ డాక్టర్లు, పేషంట్ల గూర్చి ఒక కథ రాయాలని డిసైడ్ అయిపొయ్యాను. రాయడానికి ఒక లైన్ తళుక్కుమంది. 'వార్నీ, కథ రాయడం అంటే ఇంతేనా' అనుకుని టైపుతూ వెళ్లిపొయ్యాను. సాయంకాలం రాత్రిగా మారింది. కొద్దిసేపటికి వేళ్లు నొప్పెట్టి, విసుగ్గా అనిపించింది. 'హాయిగా సింగిల్ మాల్ట్ చప్పరిస్తూ ప్రకృతిని ఎంజాయ్ చెయ్యక, ఈ కథ రాసే కూలిపని నేనెందుకు చెయ్యాలి?' అనే ధర్మసందేహం కలిగి, టైపడం ఆపేశాను.
కొద్దిసేపటికి 'నన్నేం చేస్తావ్?' అంటూ నే టైపిన కథ ట్రాఫిక్కులో చిక్కుకుపోయిన చిన్నపిల్లాళ్లా నన్ను దీనంగా ఆడిగినట్లనిపించింది. నిజమే! ఇప్పుడీ stillborn baby ని నేనేం చెయ్యాలి? 'డోంట్ వర్రీ, నీకు తర్వాతెప్పుడైనా మార్పులు చేర్పులూ చేసి ప్రాణం పోస్తాలే!' అని సముదాయించి దాన్ని డ్రాఫ్టుగా అవతల పడేశాను.
తరవాత అప్పుడప్పుడూ కథ గూర్చి గుర్తొచ్చినా.. 'కథకులు గొప్పవారు. వ్యక్తుల్నీ, సమాజాన్నీ లోతుగా, సునిశితంగా పరిశీలించిన మేధావులు. నాకు సాధారణ విషయాలు తెలుసుకోడానికే బుర్ర సహకరించదు. అటువంటి నేను కథ రాయడమా!' అని నవ్వుకోడం మినహా, దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు.
అదీగాక - సాయంకాలం పక్షుల కిల కిలాలు, కోయిల కుహుకుహులు నాకు మళ్లీ వినిపించలేదు, మూడూ రాలేదు. కాబట్టి కథని ఎడిట్ చేసే అవకాశం రాలేదు.
ఇదంతా యెందుకు రాస్తున్నానంటే - ఆ కథని వెదికి గుంజుకొచ్చి ఇక్కడ పోస్ట్ చేద్దామని. పోస్ట్ చెయ్యడం ఎందుకంటే - దాన్ని ఓ సాయంత్రం కూచుని రాశాను కాబట్టి.. ఎక్కడో ఒకచోట పోస్ట్ చేస్తే కథ 'అనుకుని' నేను చేసిన కూలిపనికి ఒక logical conclusion ఇచ్చేశానన్న తృప్తి కోసం.
ఇప్పటిదాకా నా 'పూర్తికాని కథ' ఆడియో రిలీజ్ ప్రోగ్రాం చదివారు. త్వరలో అసలు కథ చదువుతారు. కథని సరిచేసే ఓపిక లేనందున మీకు అనేక టైపో కనిపించవచ్చు. అందుగ్గానూ నన్ను క్షమించాలని మందుగా.. సారీ, ముందుగా కోరుకుంటున్నాను. ఇక్కడదాకా చదూకుంటూ వచ్చినందుకు ధన్యవాదాలు/కృతజ్ఞతలు (రెంటికీ తేడా తెలీనందున ఫోర్స్ కోసం రెండూ వాడేశాను).

(fb post)

Sunday 28 January 2018

బూతు ఆలోచనలు (revised post)


బూతు అనగా సెక్స్‌కి సంబంధించిన విషయం. వ్యక్తుల మధ్య జరిగే 'సెక్సువల్ ఇంటర్‌కోర్స్' అనే క్రియని 'బూతు' అని అంటారు. బూతుని రిఫర్ చేస్తూ అనే మాటల్ని 'బూతుమాటలు' అంటారు. మన దేశంలో నగ్నత్వం కూడా బూతుగానే చెలామణి అవుతుంది.. కొన్నిదేశాల్లో నగ్నత్వం బూతు కాదు. ఇవన్నీ కల్చర్‌కి సంబంధించిన అంశాలు.

ఇంటర్‌కోర్స్‌ని చిత్రీకరించే సినిమాల్ని 'బూతుసినిమాలు' అంటారు. వీటినే 'నీలిచిత్రాలు' అనికూడా అంటారు.. ఎందుకంటారో తెలీదు. కొందరు 'పోర్న్' అంటారు. మరికొందరు 'ఎడల్ట్ ఫిల్మ్స్' అంటారు. ఈ బూతుసినిమాలు ఎంతో ముఖ్యమైనవి కాబట్టే ఇన్ని పర్యాయ పదాలు ఉన్నట్లుగా తోస్తుంది. ఈ తరహా సినిమాలు తియ్యడం కొన్నిదేశాల్లో 'కళారూపం' కిందకి వస్తుంది. కొన్ని అమెరికా రాష్ట్రాల్లో ఎడల్ట్ ఫిల్మ్ 'ఇండస్ట్రీ'కి చట్టబద్దత ఉంది.

బూతు విషయాలు చర్చకి వచ్చినప్పుడు ఆడవాళ్ళు, పిల్లలు చదువుతారని/చూస్తారని స్పృహ ఉండాలని విజ్ఞులు వాకృస్తారు. పిల్లల విషయంలో నాకెటువంటి భేదాభిప్రాయం లేదు, వారిని ఈ విషయాల నుండి దూరంగా ఉంచాలని నేను గట్టిగా నమ్ముతాను. భారత ప్రభుత్వం వారు కూడా పజ్జెనిమిదేళ్ళ వయసు లోపు వారిని బూతుకి దూరంగా ఉంచాలని చట్టం చేశారు. ఆపై వయసువారు 'ప్రైవేటు'గా బూతు చూడొచ్చు. ఇందుకు చట్ట ప్రకారం ఆడామగ వివక్షత లేదు.

ఒక నేరాన్ని అంచనా వేసేప్పుడు వ్యక్తిగతం, సమాజగతం అనే అంశాలుగా బేరీజు వెయ్యాలి. వ్యక్తిగతం కన్నా సమాజగతమైన నేరాలు యెక్కువ ప్రమాదకరం. హత్య, దొంగతనం లాంటివి వ్యక్తిగతమైన నేరాలు. అలాగే 'అక్రమ' సంబంధాలు ('సక్రమ' సంబంధం అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే 'చట్టపరమైన' సెక్సు సంబంధం) కూడా ఈ కోవకే చెందుతాయి. వీటివల్ల వ్యక్తులకీ, వారి కుటుంబాలకీ నష్టం. సమాజానికి పరిమితమైన నష్టం.

సమాజానికి నష్టం కలిగించే నేరాలు.. దొంగనోట్ల వ్యాపారం, పబ్లిక్ పరీక్షల పేపర్లు అమ్ముకునే వ్యాపారం, రాజకీయమైన అవినీతి, ఓట్ల కోసం ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టటం.. ఈ ఘరానా నేరస్తుల లిస్టు చాలా పెద్దది, అది వేరే చర్చ.

మనలో అభిప్రాయాలు అనేక రకాలుగా ఉంటాయి. కొన్ని అభిప్రాయాల్ని అనుభవంతో ఏర్పరచుకుంటాం. మిరపకాయ బజ్జీ తింటే కడుపు భగ్గుమంటుంది, ఉల్లిపాయలు కోస్తుంటే కళ్ళు భగ్గుమంటాయి.. ఇవన్నీ అనుభవంతో తెలుసుకుంటాం. మేడమీంచి దూకితే కాళ్ళు విరుగుతాయని తెలుసుకోడానికి అనుభవం అవసరం. ఇవేవీ కాకుండా ఆయా సమాజాలకి చెందిన 'నైతికపరమైన' అభిప్రాయాలు మరికొన్ని. ఉదాహరణకి - మన గ్రామీణ సమాజంలో ఆడవారు 'పరాయి' మగాడితో మాట్లాడటం తీవ్రమైన తప్పు. 

ఇప్పుడు నా బూతు కథల అనుభవాల గూర్చి రాస్తాను. నే చదువుకునే రోజుల్లో 'రమణి' అని ఒక 'శృంగార కథల పత్రిక' బాగా పాపులర్. 'రమణి'లో సెక్స్ కథలు చందమామ కథల్లా నిత్యనూతనం. అనగా పాతసంచికలకి రిపీట్ వేల్యూ ఉంటుందని అర్ధం! ఆ విధంగా బూతుకథా యజ్ఞం అవిజ్ఞంగా కొనసాగించాను. ఆ కథలు అన్నేసి చదివినా నాకెప్పుడూ ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాలనిపించలేదు.

ఇప్పుడు నా బూతు సినిమా అనుభవాలు కొన్ని. 1980 లలో విడియో ప్లేయర్లు ఉన్న ఇళ్ళు తక్కువ. ఆ తక్కువ ఇళ్ళల్లో మా ఇల్లొకటి. అమ్మానాన్న తరచుగా అక్క దగ్గరకి వెళ్తుండేవారు. వాళ్ళు లేని రోజుల్లో నా స్నేహితులు మా ఇంటిని నీలిచిత్రాల అడ్డాగా మార్చేసేవారు. మొదట్లో వారితో పాటు నేను కూడా ఆ చిత్రరాజాల్ని ఉత్సాహంగా చూశాను గానీ.. ఆ తరవాత విసుగేసింది - ఎప్పుడూ ఒకటే గోల!

రాత్రుళ్ళు భీభత్సమైన బూతు సినిమాలు చూసిన నేనూ, నా స్నేహితులూ.. పగలు మెడికల్ కాలేజ్ లైబ్రరీలో తీవ్రంగా చదివేవాళ్ళం, క్లాసమ్మాయిల్తో కేంటీన్లో కాఫీ తాగుతూ సరదాగా కబుర్లు చెప్పేవాళ్ళం. ఇప్పుడో ప్రశ్న - అసలు ఈ పోర్న్ ఎందుకు చూశాను? వెనక్కి తిరిగి ఆలోచిస్తే ఒకటే సమాధానం. చిన్నప్పుడు క్రికెట్ ఎందుకు ఆడానో, సినిమాలెందుకు చూశానో, అవధానిగారి ఇంట్లో దొంగతనంగా మావిఁడి కాయలు ఎందుకు కోశానో.. అదీ అందుకే! 

నాకంటూ ఒక ఎకడెమిక్ కెరీర్ ఉంది కాబట్టి, నా ఆలోచనలు ఎల్లప్పుడూ ఎంతో ఉన్నతంగా ఉండేవని చెబితే చెల్లిపొవచ్చు.. చాలామంది ఇలా అబద్దాలే చెబుతారు. మనిషి డెవలెప్మెంట్ స్టేజెస్ ఒక్కో సమయంలో ఒక్కో ప్రయారిటీ ఉంటుంది. ఇవన్నీ సిటీ బస్ స్టేజీల్లాంటివి. ఒకటి దాటితేనే ఇంకోటి వస్తుంది. కొందరికి చెప్పుకోడం ఇష్టం ఉండదు, నేను చెప్పుకుంటున్నాను - అంతే తేడా!

బూతు సాహిత్యం చదివినా, బూతు సినిమాలు చూసినా మగాడు మృగాడుగా (దుర్మార్గమైన ఈ పదం తెలుగు మీడియా సృష్టి) మారిపోతాడని కొందరు గట్టిగా వాదిస్తారు. వారి సత్యసంధతని, నిజాయితీని శంకించను. యెవరి అభిప్రాయం వారిది. కొందరిది మతపరమైన సమస్యైతే, మరికొందరిది నైతిక సమస్య. ఇంకొందరిది సమాజ శ్రేయస్సు కోరుకునే నిజాయితీతో కూడిన నిజమైన ఆందోళన అయ్యుండొచ్చు.

కానీ - ఈ అభిప్రాయాలన్నీ ఋజువుకి నిలబడని వారి సొంత అభిప్రాయాలనే అనుమానం నాకుంది. అందుకు నా స్వానుభవం కూడా ఒక కారణం. బూతు సాహిత్యాన్ని, నీలిచిత్రాల్ని ఎంజాయ్ చేసిన నేను చెడిపోనప్పుడు.. ఇంకెవరన్నా ఎలా చెడతారు?! 

నా అనుభవాల్ని జనరలైజ్ చెయ్యడం కరెక్ట్ కాదు. కానీ.. మన సమాజంలో పోర్న్ గాంచడం వల్ల చెడిపోతారంటానిక్కూడా ఋజువు కావాలి కదా? అయితే అందుకు కొందరు సెక్స్ నేరాలు చేసిన 'చెడిపోయిన'వారిని ఉదాహరణగా చూపవచ్చు. కానీ వాళ్ళు పోర్న్ వల్లే చెడిపొయ్యారని నిర్ధారించలేం. పోర్న్ చూసినా ఎఫెక్ట్ కాని నన్ను ఎలాగైతే జెనరలైజ్ చెయ్యకూడదో పోర్న్ చూసి చెడిపోయినవాణ్నీ జనరలైజ్ చెయ్యకూడదు.

సైకాలజిస్టులు కోపాన్ని కంట్రోల్ చేసుకోడానికి 'కథార్సిస్' అనే టెక్నిక్ వాడతారు. ఎగ్రెసివ్ పర్సన్ ఒక భీభత్సమైన ఏక్షన్ సినిమా చూస్తూ ఆ హీరోతో తనని తాను ఐడెంటిఫై చేసుకుని తన ఎగ్రెసివ్ ఫీలింగ్స్ నుండి విముక్తి పొందొచ్చు. దీన్నే 'వెంటిలేషన్' అని కూడా అంటారు. అలా కోపవిముక్తుడైన ఆ వ్యక్తి, ప్రవర్తనలో కొంత సౌమ్యుడుగా మారవచ్చు.

ఇప్పుడు ఇదే లాజిక్‌ని పోర్నగ్రఫీకి తీసుకొద్దాం. పోర్న్ వాస్తవం అనుకునే అమాయకుడు ఉండడు. పోర్న్ నటుల ఇమేజెస్ మెదడుని స్టిమ్యులేట్ చేస్తాయి. చూసేవాడు ఆ నటుల్తో ఐడెంటిఫై చేసుకుని ఆనందం పొందుతాడు. ఇది పూర్తిగా ఫేంటసీ, వెంటిలేషన్ ఆఫ్ సెక్సువల్ డ్రైవ్. జాకీ చాన్ ఫైటింగులు చూసినవాడు రోడ్ల మీద జనాల్ని తన్నడు, తన్నినట్లు తృప్తి నొందుతాడు, ఇదీ అంతే.

నేనిదంతా రాస్తుంది నా ఆలోచనలు మీతో పంచుకోవటానికి తప్ప పోర్న్ ప్రమోట్ చెయ్యటానికి కాదు, దానికి ఆల్రెడీ కోట్లాది అభిమానులున్నారు. మీరొక్కసారిగా ఉలిక్కిపడి నాకు నీతిబోధన కార్యక్రమం మొదలేడ్తే నే చేసేదేంలేదు (ఇప్పుడంతా నీతుల కాలం నడుస్తుంది). బూతు వల్ల తెలుగు సమాజం ఎంతగా చెడిపోయ్యిందో తెలుసుకోటానికి మన దగ్గర సైంటిఫిక్ డాటా లేదని నా అభిప్రాయం. ఋజువు లేకుండా ఏం చెప్పినా అది వారి వ్యక్తిగత అభిప్రాయమే అవుతుంది, అంతకుమించి మరేమీ కాదు.

అసలు బూతు అంటే ఏమిటి? 'మనసుని చెడుగా ప్రభావితం చేసి, వ్యక్తిత్వాన్ని చెడగొట్టేది బూతు' అనే విస్తృత నిర్వచనం ఇచ్చేసుకున్నట్లైతే ఈ ప్రపంచంలో మనకి కావలసినంత బూతు ఉండనే ఉంది.

మత చాందసాన్ని ప్రమోట్ చేస్తూ, ఇతర మతాలపై విషం చిమ్మే ఏ పుస్తకమైనా బూతు పుస్తకమే! మనుషుల్ని శతాబ్దాల వెనక్కి తీసుకుపొయ్యే ఏ సాహిత్యమైనా బూతు సాహిత్యమే. సాంప్రదాయాల పేరుతొ తిరోగమన భావాజాలాన్ని ప్రమోట్ చేసే ఏ సినిమా అయినా బూతు సినిమానే.

ఆ విశాల దృష్టితో చూస్తే సినిమాల్లో నగ్నత్వం చూపిస్తే బూతు కాదు. ప్రేమ పేరుతొ హీరో వేసే వెకిలి వేషాలు బూతు. ఆడపిల్లల్ని హీనంగా తీసిపడేసే హీరోగారి పొగరు బూతు.

పాత సినిమాల్లో కూడా బుట్టల కొద్ది బూతు డైలాగులుండేవి.

'ఏమండి! మీరు ఎంతైనా తాగండి, తిరగండి. కానీ ఈ నిర్భాగ్యురాలికి మీ పాదాల దగ్గర ఇంత చోటివ్వండి. కనీసం మీ ఇంట్లో పనిమనిషిగానైనా చోటివ్వండి.'

నో డౌట్.. ఇది మాత్రం పచ్చి బూతు డైలాగ్!

(Ramana Yadavalli on 14 June 2014) fb post on 29/1/2018

తెలుగు పత్రికల మెడికల్ వార్తల స్థితి

ఒక తెలుగు వార్తాపత్రికలో నిన్న మాంసాహారం యెక్కువగా తింటే పెద్ద పేగు కేన్సర్ 'వస్తుందనీ', అదే పత్రిక ఇవ్వాళ మాంసాహారంతో క్యాన్సర్ 'దూరం' అని రాసిందనీ మిత్రులు ఫోటోలు పెట్టారు. ఈ పోస్టుకి ప్రేరణ ఆ ఫోటోలే.
ఇలాంటి వార్తల పట్ల నాకున్న అవగాహన -
మెడికల్ రీసెర్చ్ మెథడాలజీలో డాటా కలెక్షన్లో ప్రధాన విషయంతో పాటు అనేక ఇతర విషయాల్ని పొందుపరచి విషయ సేకరణ చేస్తారు. ఈ రీసెర్చ్‌లో అనేక రకాలైన స్టాటిస్టికల్ సిగ్నిఫికెన్స్ లేని సమాచారం కూడా వచ్చేస్తుంది. అసలు విషయం కన్నా ఈ కొసరు విషయాలు సర్దాగానూ, ఆసక్తికరంగానూ వుంటాయి. శాకాహారులకి కిడ్నీ జబ్బులు ఎక్కువని ఒక డాటా చెబితే ఇంకో డాటాలో శాకాహారులకి కిడ్నీ జబ్బులు తక్కువని వస్తుంది. ఫలానా స్టడీలో ఇలా తేలిందని సోర్స్‌ని కోట్ చేస్తూ ఆసక్తికరంగా రాయడానికి ఇంగ్లీషు మెయిన్ స్ట్రీమ్ జర్నల్స్‌కి మెడికల్ జర్నలిస్టులు వుంటారు. వాళ్లకి ఆయా మెడికల్ జర్నల్స్‌తో కాపీరైట్ తాలూకా ఒప్పందాలుంటాయి. అయితే - ప్రొఫెషనల్ డాక్టర్లెవరూ ఈ వార్తల్ని సీరియస్‌గా తీసుకోరు. ఈ స్టడీస్ ఫలితాలు అనేకసార్లు రేప్లికేట్ అయ్యి, ప్రతిష్టాత్మకమైన మెడికల్ జర్నల్స్‌లో కన్సిస్టెంట్‌గా రిపోర్ట్ అయితేగానీ డాక్టర్లు పట్టించుకోరు.
ఇప్పుడు తెలుగు పత్రికల మెడికల్ వార్తల స్థితి -
నేను తెలుగు వార్తాపత్రికలు చదివి చాలా సంవత్సరాలే అయింది. అయినా - ఈ తెలుగు మెడికల్ వార్తా జర్నలిస్టుల పట్ల ఇలా అనుకుంటున్నాను (నా అవగాహన తప్పని నా జర్నలిస్టు మిత్రులు చెబితే 'సారీ' చెప్పడానికి రెడీ). ఈ జర్నలిస్టులకి కనీసస్థాయి మెడికల్ అవగాహన వుండదు. ఇంగ్లీషు పత్రికల్లో పబ్లిషైన గాలివార్తల్ని తెలుగులోకి అనువదించడం మాత్రమే వీరికి తెలిసిన విద్య. వార్తకి సోర్స్ మాత్రం చచ్చినా ఇవ్వరు (తస్కరించిన వార్త కాబట్టి కాపీరైట్ సమస్యలొస్తాయి). ఈ వార్తల్ని వాళ్ల బాసుల ఆజ్ఞననుసరించి ఫిల్లింగ్ అప్ న్యూసుగా ప్రచురిస్తుంటారు. అంచేత ఈ బాపతు వార్తలకి విశ్వసనీయత వుండదు, కనుక మనం పట్టించుకోరాదు.
ఇదంతా యెందుకు చెబుతున్నానంటే - 'ఫలానా పేపర్లో ఫలానా తింటే ఫలానా రోగం వస్తుందని రాశారు! నిజమేనా?' అంటూ నన్ను కొందరు అడుగుతుంటారు. వారికిదంతా చెబితే అర్ధమవుతుందో లేదో తెలీదు, అంచేత సమాధానం దాటవేస్తాను. ఇది చదివాక తెలుగు మెడికల్ వార్తల డొల్లతనాన్ని మీరుకూడా అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను.

(FB post)

Tuesday 9 January 2018

కత్తి మహేశ్ - సామాజిక ప్రయోజనం

కత్తి మహేశ్ - సామాజిక ప్రయోజనం
'సినిమా నటులు మనలాంటి మనుషులే. మనలాగే అన్నం తింటారు, రాత్రవంగాన్లే దుప్పటి కప్పుకుని నిద్రపోతారు.' ఈ విషయం నాకు చిన్నప్పుడు తెలీదు, తరవాత తెలుసుకున్నాను. ఇలా తెలుసుకోడం అనేది వొక పరిణామం. కొందరు - చదువు లేకపోడం, తద్వారా వచ్చే జ్ఞానానికి దూరమైపోడం.. ఇలా అనేక కారణాల వల్ల ఈ పరిణామ క్రమానికి దూరమైపోతారు.
అయితే చదువుకుని, ఉద్యోగాలు చేసుకుంటున్నంత మాత్రాన జ్ఞానులైపోతారనే గ్యారెంటీ లేదు. గొప్ప చదువులు చదివి కూడా సినిమా నటుల్ని దేవుళ్లుగా భావించేవారి మనస్తత్వం గూర్చి కొంత ఆలోచన చేద్దాం.
సినిమా వొక వ్యాపారం, ఈ వ్యాపారంలో సినిమా హీరో వొక స్టేక్ హోల్డర్. హీరోల యూఎస్పీ పెరగాలంటే తమ సినిమాలకి ఓపెనింగ్స్ వుండాలి, తమని దేవుళ్లా ఆరాధించే వొక మూక కావాలి. అందుకోసం తెలుగు సినిమా హీరోలు అనేక మార్గాలు యెంచుకున్నారు. వాటిల్లో ముఖ్యమైనది - కులతత్వం.
కులాభిమానం అనేది వొక ప్రిమిటివ్ ఎమోషనల్ భావం. దీన్ని తమ వ్యాపారం కోసం వాడుకోడంలో తెలుగు హీరోలు రాటుదేలారు. జ్ఞానాన్ని ఎమోషన్స్ అధిగమిస్తాయి. కాబట్టి గొప్పచదువులు చదివి అమెరికాలో ఉద్యోగం వెలగబెడుతూ కూడా "జైబాలయ్యా" అంటూ రెచ్చిపొయ్యే కమ్మకులస్తుల్నీ, "జైపవనిజం" అంటూ ఊగిపొయ్యే కాపుకులస్తుల్నీ అర్ధం చేసుకుంటూ.. వారిని వారి అజ్ఞానానికి వదిలేద్దాం.
చదువుకి దూరంగా వుండిపోయిన నిరక్షరాస్యుల హీరోభక్తి పూర్తిగా అమాయకత్వం, అజ్ఞానం. వీరు నా చిన్నతనంలో నాకున్న అమాయకత్వ స్థాయిలోనే మిగిలిపోయిన అభాగ్యజీవులు. వీరిని చూసి జాలిపడదాం.
ఇప్పుడొక సందేహం -
చదువులేకనో, కులాభిమానంతోనో హీరోల్ని తీవ్రంగా అభిమానించే దురభిమానులే అభిమాన మూకలైతే వీళ్ల సంఖ్య చాలా పరిమితంగా వుండాలి, కానీ వాస్తవంగా ఈ మూక చాల పెద్దదిగా వుంది! కారణం యేమైయ్యుండొచ్చు?
తెలుగు రాష్ట్రాల్లో బీసీ, ఎస్సీ కులస్తుల సంఖ్య చాలా యెక్కువ. వీరిలో చదువుకున్నవాళ్లూ యెక్కువే. చదువుకున్న బీసీ, ఎస్సీ కులస్తులు కూడా కొందరు (యెందరో తెలీదు) ఈ వీరాభిమానుల లిస్టులో వున్నారని అర్ధమవుతుంది. చదువూ వుండీ, గోక్కోటానికీ కులమూ లేక - మరి వీళ్లెందుకు హీరోల బానిసల లిస్టులో వున్నారు?!
ఇక్కడే తెలుగు సమాజానికి కత్తి మహేశ్ ప్రయోజనం వుంది. కత్తి మహేశ్, టీవీ చానెళ్లు.. యెవరి లెక్కలు వాళ్లకుండొచ్చు. కానీ చివరాకరికి ఈ ఎపిసోడ్లో వొక సామాజిక ప్రయోజనం వుందని నమ్ముతున్నాను. ఆ రెండు కులాలకి "చెందని" ఆవేశపరులైన అభిమానులు.. కత్తి మహేశ్ లేవనెత్తుతున్న అంశాల పట్ల (తరవాత కొన్నాళ్లకైనా) మనసుపెట్టి ఆలోచించే అవకాశం వుంది. వొక్కసారి ఆలోచించడం మొదలెడితే వీళ్లకి చాలా విషయాల్లో కళ్లు తెరుచుకుంటాయి. ఇది తెలుగు సమాజానికి కలిగే దీర్ఘకాలిక ప్రయోజనం.
మనలో వుండే అమాయకత్వం, అజ్ఞానం వల్ల సినిమావాళ్లని నెత్తిన పెట్టుకుంటున్నాం. సినిమావాళ్లేం పైనుండి వూడిపళ్లేదు. మనందరిలాగా వాళ్లూ మామూలు మనుషులు. వాళ్లక్కూడా దెబ్బ తగిల్తే నెత్తురొస్తుంది, అన్నం తినకపోతే నీరసం వస్తుంది. సినిమా నచ్చితే పదిసార్లు చూసుకుందాం. హీరోల్ని దేవుళ్లుగా భావించడం, వారిచేత తన్నులు తినడం మన మూఢత్వాన్నీ, బానిసబుద్దినీ సూచిస్తుంది.
'మాకివన్నీ అనవసరం, మేం మా హీరోదేవుళ్లకి భక్తులం!' అంటారా? సరే, అలాగే కానివ్వండి - బెస్టాఫ్ లక్!

(fb post)