Sunday 17 September 2017

యేసుపాదం! ఐ మిస్ యూ!


యేసుపాదం పొయ్యాట్ట! మనసు బరువుగా అయిపోయింది. యేసుపాదంతో నా అనుబంధం రెండు దశాబ్దాల పైమాటే! 

యేసుపాదం స్కిజోఫ్రీనియా బాధితుడు. అనుమానాలు, భయాలు.. తన్లోతాను మాట్లాడుకుంటాడు. స్నానం చెయ్యాలి, అన్నం తినాలి అన్న ధ్యాస లేనివాడు. నల్లటి పొడవాటి ఇనప స్థంభానికి యెర్రటి కళ్లు అతికించినట్లు కొంత ఆకర్షణీయంగా, మరింత భయంకరంగా కనిపిస్తాడు. భార్యని తన్నేవాడు, ఆమె పుట్టింటికి పారిపొయ్యింది. ఆ సౌలభ్యం లేని తలితండ్రులు యేసుపాదంతో తన్నించుంకుంటూనే వుండేవాళ్లు.

యేసుపాదం నాకో పేషంట్ ద్వారా పరిచయం. అతను కడుపేదవాడని తెలుసుకొని  ఫీజు తీసుకోలేదు. కొన్నాళ్లకి యేసుపాదం మందులూ కొనుక్కోలేడని అర్ధమై physician samples తో వైద్యం కొనసాగించాను. 

సైకియాట్రీ ప్రాక్టీస్ కొంత విభిన్నంగా వుంటుంది. పేషంట్లు డాక్టర్లని నమ్మరు, నిర్లక్ష్యంగా వుంటారు. యేసుపాదానికి నేనంటే చులకన భావం.

"నువ్విచ్చే మందులకి నరాలు లీకైతన్నయ్, నిన్ను చావదెం..తా."

"మందులెవడు మింగుతాడ్రా, నీయమ్మ మొగుడా?"

ఇట్లాంటి భాషతో నన్ను ప్రేమపూర్వకంగా పలకరించేవాడు. 

కాలక్రమేణా తలిదండ్రులు మరణించారు, అన్నం తింటున్నాడో లేదో పట్టించుకునేవాళ్లూ కరువయ్యారు. యెండల్లో వానల్లో రోడ్లమ్మట తిరగడం మొదలెట్టాడు. అప్పుడప్పుడు యేసుపాదాన్ని ఊళ్లోవాళ్లు పట్టుకొచ్చేవాళ్లు, మనిషి అస్థిపంజరంలా మారిపొయ్యాడు. అటుతరవాత ఆ ఊరివాళ్లెవరన్నా వస్తే, యేసుపాదం కోసం వాళ్లతో శాంపిల్స్ పంపేవాణ్ని. వేసుకున్నాడో లేదో తెలీదు.

ఇప్పుడు యేసుపాదం పొయ్యడని వార్త! మంటల జ్వరంతో రోడ్లమ్మట అలా తిరుగుతూనే వున్నాట్ట. తిరిగీ తిరిగీ యెక్కడో రోడ్డు పక్కన పడి చనిపొయ్యాడు.

పుష్కరాలు పద్నాలుగేళ్లకోసారి వస్తాయి, సీజనల్ జ్వరాలు ప్రతేడాదీ వస్తాయి. వాటికి పేదవాళ్లంటే ఇష్టం, మానసిక జబ్బున్న పేదవాడంటే మరీ ఇష్టం. తనెవరో, తనేవిఁటో తెలీని యేసుపాదం జ్వరానికి బలైపొయ్యాడు. 

ఇకముందు, నాకేసి యెర్రగా చూస్తూ - 

"నీయమ్మా! నీ లంజకబుర్లు నాదగ్గర కాదు!" అంటూ ప్రేమగా పలకరించే యేసుపాదం నాక్కనపడడు, అదీ సంగతి!

యేసుపాదం! ఐ మిస్ యూ!  

(fb post)

Friday 1 September 2017

అర్జున్ రెడ్డి (ఇది రివ్యూ కాదు)


మెదడు భాగాల్ని సరీగ్గా వాడకపోతే అవి atrophy అయిపోతాయనీ, ఇందుకు తెలుగు హీరో అభిమానులు ఒక ఉదాహరణనీ చెప్పాను. అలాగే, active గా పన్జేసే మెదడుకు కొన్నిభాగాల్లో రక్తప్రసరణ తగ్గినప్పుడు (ischemia).. విషయం సరీగ్గా అర్ధం కాకుండా పోతుంది. నేను నా మెదడులో film appreciation center కి రక్తప్రసరణ తగ్గిపోయిందని నమ్ముతున్నాను.

నా నమ్మకానికి అనేక సాక్ష్యాలున్నయ్.

మొన్నామధ్య 'బాహుబలి' సినిమా టీవీలో వస్తుంటే పిల్లలు నోరు తెరుచుకు చూస్తున్నారు. ఓ రెణ్ణిమిషాలు చూశాక విసుగనిపించి, పక్క గదిలోకి వెళ్లిపొయ్యాను. ప్రభాస్, రానాల్లో యెవడు రాజైతే మాత్రం సామాన్యుడికి వొరిగేదేముంది? ఇది - ప్రజల దగ్గర పన్నులు కట్టించుకునే హక్కు కోసం పొట్లాడుకుంటున్న ఇద్దరు యువకుల మధ్య తగాదా మాత్రమే! అలా అని, 'బాహుబలి' విసుగ్గా అనిపించడం నాకేమీ సంతోషాన్నివ్వలేదు. in fact, దిగులుగా అనిపించింది. ఒకప్పుడు చందమామ కథల్ని ఆసక్తిగా చదివిన నేను, ఆ కథల్లాంటి సినిమాని ఎంజాయ్ చెయ్యలేకపోవడం దురదృష్టం.

నా ఈ సమస్యకి చాలా చరిత్ర వుంది. అప్పుడెప్పుడో స్నేహితుల్తో 'శంకరాభరణం' చూశాను. తులసి అనే అందమైన అమ్మాయి శంకరశాస్త్రి సంగీతం అంటే పడి చస్తుంది. శంకర శాస్త్రి ఆమెతో sexual relationship పెట్టుకుంటే (సెక్స్ ఆరోగ్యానికి మంచిది), ఆ ఆనందంతో శాస్త్రిగారు మరింత గొప్ప సంగీత విద్వాంసుడిగా ఎదిగేవాడని నా ఆలోచన. అప్పుడు వర్షమేం ఖర్మ, వరదలే సృష్టించేవాడు! ఆ మాటే బయటకి అన్నాను, నా స్నేహితులు 'గయ్'మన్నారు. పవిత్రమైన శాస్త్రీయ సంగీతంలో అపవిత్రమైన సెక్సుని కలపడం నా స్నేహితులకి నచ్చలేదు!

నాగార్జున 'శివ' సూపర్ హిట్టని నా స్నేహితుడొకడు బలవంతంగా లాక్కెళ్లాడు. నాకు సినిమా నచ్చలేదు. కెమెరా కన్ను కాలేజీలో, క్లాసు రూముల్లో పరుగులెట్టడాన్ని నా స్నేహితుడు థ్రిల్లింగుగా ఫీలయ్యాడు, నాకందులో గొప్పేంటో అర్ధం కాలేదు. సినిమా కథపై కూడా నాకు సమస్యే!

"ఒక రౌడీ నుండి ప్రజల్ని రక్షించడానికి హీరో ఇంకో రౌడీ అవతారం ఎత్తడం ఏమిటి?! Absurd గా లేదూ?" అన్నాను నా స్నేహితుడితో.

"నిజమే, కానీ - హీరో మంచి రౌడీ! నీకసలు సినిమా చూడ్డం రాదు!" విసుక్కున్నాడు నా స్నేహితుడు.

సినిమా యెలా చూడాలి? టిక్కెట్టు కొనుక్కోవాలి, కుర్చీలో కూచోవాలి, తెరపై కదుల్తున్న బొమ్మల్ని చూడాలి. ఇలా కాకుండా - ఇంకోరకంగా సినిమా చూసే ప్రత్యేకమైన టెక్నిక్ నాకు తెలీదు. అంచేత -

"అవును, నాకు సినిమా చూద్దాం రాదు!" అని అర్జంటుగా ఒప్పేసుకున్నాను.

ఇలా అనేక అనుభవాల తరవాత, నాకు సినిమా చూడ్డం రాదని డిసైడైపొయ్యాను. ఆ తరవాత మెదడు గూర్చి ఎక్కువగా చదివేసినందున, నా మెదడులో film appreciation center కి రక్తప్రసరణ తగ్గిపోయిందని కనిపెట్టాను! అంచేత, నా మెదడుని గౌరవిస్తూ సినిమాలు చూడ్డం మానేశాను.

ఈ సోదంతా యెందుకు రాస్తున్నానంటే - ఇప్పుడు అందరూ 'అర్జున్ రెడ్డి' గూర్చి రాస్తున్నారు. నాకు యెలాగూ 'అర్జున్ రెడ్డి' నచ్చడు. ఎప్పణ్ణుంచో వున్న మెదడు సమస్యకి తాజాగా నడుం నొప్పి తోడైంది. సినిమా చూస్తే ఏదోటి రాస్తాను. నచ్చలేదంటే 'నువ్వు యూత్ కాదు, నీది ముసలి టేస్ట్' అంటారు. పోనీ - యూత్ అనిపించుకోడానికి సినిమా బాగుందని అబద్దం చెబితే ఉతికి ఆరెయ్యడానికి ఇంకోవైపు మిత్రులు రెడీగా వున్నారు!

అందువల్ల - ప్రస్తుత పరిస్థితుల్లో (నా ఆరోగ్యరీత్యా) 'అర్జున్ రెడ్డి'ని చూడకుండా వదిలేస్తున్నాను.

(fb post)