Sunday 4 December 2016

ఒక జయలలిత అభిమాని ఆవేదన


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకి గుండెపోటు, ఆమె అభిమానులు తీవ్రంగా ఏడుస్తున్నారు. ఈ స్థాయిలో ఏడుస్తున్నారంటే వారికి ఆమెంటే ఎంత అభిమానమో అర్ధమవుతుంది. మరీ వారంత కాకపోయినా - నాక్కూడా కొంత బాధగానే వుంది. అందుకు నాకున్న కారణాలు పూర్తిగా వ్యక్తిగతమైనవి.


ఇప్పటి కుర్రాళ్ళు కత్తిలాంటి కత్రీనా కైఫ్‌ని వేడినిట్టూర్పులతో భారంగా చూస్తున్నట్లే - ఒకప్పుడు నేనూ నోరు తెరుచుకుని జయలలితని తెగ చూసేవాణ్ని. నాదప్పుడు స్కూల్ వయసు కాబట్టి - నా ఎత్తుకు తగ్గట్టు పొట్టిగా, బొద్దుగా, ముద్దుగా వుండే జయలలిత అంటే చాలా ఇష్టంగా వుండేవాణ్ని. 

ఒకటా రెండా! ఎన్నని చెప్పను? జయలలిత బొచ్చెడన్ని సినిమాలు చేసింది. చిక్కడు - దొరకడు, గోపాలుడు - భూపాలుడు, కదలడు - వదలడు, గండికోట రహస్యం వంటి జానపద చిత్రరాజముల్లో ఎంతో హుషారుగా ఎన్టీఆర్‌తో స్టెప్పులేసింది (ఈ కారణాన జయలలిత గొప్ప సాహసవంతురాలని నాకప్పుడే అర్ధమైంది).

'ముచ్చట గొలిపే పెళ్ళిచూపులకి వచ్చావా?'    అంటూ 'తిక్కశంకరయ్య'లో రామారావుని ఆట పట్టించింది. 'ముత్యాలజల్లు కురిసే' అంటూ 'కథానాయకుడు'లో వర్షంలో తడుస్తూ గెంతులేసింది. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో  అంటూ 'అదృష్టవంతులు'లో క్లబ్బులో నర్తించింది.

ఆవిడ సినిమాల్లోంచి రాజకీయాల్లోకి వెళ్ళాక 'పురచి తలైవి' అనీ, 'అమ్మ' అనీ పిలిపించుకుంది. కరుణానిధితో భీభత్సమైన ద్వంద్వయుద్ధం చేసింది. జయలలిత పట్ల అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినా నేనసలు పట్టించుకోలేదు . ఇందుకు నా జయలలిత అభిమానమే కారణమని నా అనుమానం.

ఒకప్పుడు నన్నెంతో ఆనందింపచేసిన జయలలిత, నేడు అనారోగ్యానికి గురవడం నన్నెంతో బాధిస్తుంది. జయలలిత కోసం దుఃఖించేవారిపట్ల పూర్తి సంఘీభావాన్ని తెలుపుకుంటూ   - 'పుట్టినవాడు గిట్టక మానడు' అని ఘంటసాలగారు భగద్గీతలో  చెప్పిన కొటేషన్ గుర్తు తెచ్చుకుని ఊరట చెందుతున్నాను.   

(photo courtesy : Google)