Sunday 16 October 2016

ట్రంపుని సమర్ధిస్తూ..


ఇప్పుడే కాఫీ తాగాను. టీవీలో తెల్లజుట్టు, ఎర్ర టైతో ట్రంప్ యేదే చెబుతున్నాడు. పాపం, మీడియా ట్రంపుని పచ్చడి పచ్చడి చేస్తుంది. నాకెందుకో ట్రంపుని చూస్తే యెడారిలో దారితప్పిన మదపుటేనుగు గుర్తొచ్చి, జాలేసింది. ఊరికే జాలిపడి వొదిలెయ్యకుండా కొద్దిసేపు ట్రంప్ కేసుని ప్రెజెంట్ చేస్తాను. 

మొన్న ఒబామా భార్య చేసిన ఎన్నికల ప్రసంగం చూశాను. ట్రంప్ వ్యక్తిగతంగా చెడ్డవాడు అని ఆమె చాలా ఉద్వేగంగా చెప్పింది. కొన్నాళ్ళుగా ట్రంప్ తమపై రకరకాలుగా 'చెయ్యేశాడని' అనేకమంది ఆడవాళ్ళు డైలీ సీరియల్లా చెబుతున్నారు. ఈ ఆరోపణలన్నీ ఎన్నికల తరవాత ఆవిరైపోతాయని అందరికీ తెలుసు.

అమెరికల్ ఓటర్లు తమ అధ్యక్షులవారికి స్వచ్చమైన మనస్సు, పవిత్రమైన దేహం అర్హతలుగా ఉండాలని భావిస్తున్నారా? స్త్రీలు, పురుషులు - వారి మధ్య సంబంధాలు నైతికతకి సంబంధించిన అంశాలు. రాజకీయాల్లో నైతికతకీ, వ్యక్తిగత నైతికతకీ కనెక్షన్ ఉంటుందా? నాయకులు అవినీతిపరుడైతే కొద్దిగా ఇబ్బంది. కులవాదో, మతవాదో అయితే ఇంకా ఇబ్బంది. మాంఛి వయసులో ఉండగా విచ్చలవిడిగా యెడాపెడా తిరిగితే - అందువల్ల ప్రజలకేం ఇబ్బంది?! 

ఆ మాటకొస్తే స్త్రీల విషయంలో చెగువేరాక్కూడా నెగెటివ్ మార్కులే పడతాయి, స్నానం చెయ్యకపోవడం అతనికున్న అదనపు అర్హత (చదువుము - మోటర్‌సైకిల్ డైరీస్)! ప్రపంచంలో అత్యధికులు అసహ్యించుకున్న హిట్లర్ యూదులు, కమ్యూనిస్టుల జోలికెళ్ళాడు గానీ.. ఆడవాళ్ళ జోలికెళ్ళిన ఆధారాల్లేవు.

'మూడుకథల బంగారం' సూర్రావెడ్డు అందరు దేవుళ్ళకీ 'నిచ్చెబక్తుడు'. తన భక్తివల్లే దొంగనోట్ల వ్యాపారం సాఫీగా సాగిందని నమ్ముతాడు. ధార్మికతనీ, ధర్మాన్ని తీవ్రంగా నమ్మిన పోలీసు ఉన్నతాధికారులు ఎన్‌కౌంటర్లనే చట్టవ్యతిరేక హత్యల్ని భక్తిగా, నిష్టగా కొనసాగించారు. గురువారం, శనివారం పచ్చి చికెన్ ముక్క కూడా ముట్టని డాక్టర్లు.. అన్నివారాలూ పేషంట్లని శ్రద్ధగా దోచుకుంటుంటారు.

'అనంతం' సాక్షిగా స్త్రీలపట్ల శ్రీశ్రీ వైఖరి అర్ధం అవుతుంది. రావిశాస్త్రి శ్రీశ్రీకి శిష్యుడు. సాహిత్యంలో ప్రపంచస్థాయి రచయితలకీ, కవులకీ క్రమశిక్షణ అన్న పదానికి అర్ధం కూడా తెలీదు. ఉదయాన్నే లేచి వాకింగ్ చేసుకుని, టిఫిన్ చేసి, కాఫీ త్రాగాక రాస్తే - అది 'రామకోటి' అవుతుంది గానీ గొప్పసాహిత్యం యెంతమాత్రం కానేరదని అంటాడు మా సుబ్బు.

అందువల్ల - రాజకీయాల్లో రాణించి, ఒట్లేసిన ప్రజలకి కొద్దోగొప్పో మేలు చెయ్యడానికీ, వ్యక్తిగత జీవితానికీ సంబంధం లేదు. అమ్మాయిల గూర్చి ఆలోచించని టోనీ బ్లేయెర్ అమెరికాని ఇరాక్ యుద్ధంలోకి నెట్టి ప్రపంచానికి ఘోరమైన నష్టాన్ని కలిగించాడు. హిట్లర్, టోనీ బ్లేయెర్‌ల ఉదాహరణల్తో చూస్తే - వందమంది అమ్మాయిల్ని ప్రేమించినా పర్లేదు గానీ, యుద్ధాన్ని ప్రేమిస్తే మాత్రం ప్రపంచానికి చచ్చేచావొస్తుందని తోస్తుంది.

ఇప్పుడు అమెరికా ఎన్నికల గూర్చి అమెరికాతోపాటు మనదేశంలో కూడా యెక్కువ చర్చ నడుస్తుంది. మనవాళ్ళు కొత్త అధ్యక్షుడి మిడిల్ ఈస్ట్ పాలసీ, పాకిస్తాన్‌తో స్నేహాల గూర్చి ఆలోచిస్తున్నారు. మనం అమెరికన్ ఓటర్లకి మల్లే వ్యక్తిగత అంశాల పట్ల పెద్దగా పట్టించుకోం. ఇందుకు కారణం - మనం మన నాయకుల నుండి స్వచ్చమైన సౌశీల్యతని ఆశించకపోవడం అవ్వచ్చు లేదా రాజకీయ కార్యాచరణకి, వ్యక్తిగత అలవాట్లకి సంబంధం లేదనే మెచ్యూర్ థింకింగ్ కలిగుండటం కావచ్చు.

ట్రంప్ తనకి నచ్చినట్లు జీవించాడు. ప్రెసిడెన్షియల్ కేండిడేట్‌నవుతానని కల్లోకూడా ఊహించి వుండడు. ట్రంపెడు ఆశల్తో ఉన్న ట్రంపుకి తన గతం ఒక గుదిబండగా మారింది. అందుకు మీడియా చేస్తున్న వ్యతిరేక ప్రచారం కూడా కారణం. అసలు ట్రంప్ వల్లే ఈసారి ఎన్నికలకి ఇంత గ్లామర్ వచ్చిందని నా అభిప్రాయం.

ఎన్నికల్లో - కుటుంబ విలువలు, వ్యక్తిగత వర్తన గూర్చి అమెరికాలో చర్చనీయాంశం అయినట్లు భారద్దేశంలో కాకపోవడం మాత్రం ఒక ఐరనీ! చూద్దాం, అమెరికా ప్రజల ఆలోచన యెలా ఉండబోతుందో! 

ముగింపు - 

కాఫీ ఎఫెక్ట్ అయిపోయింది. ట్రంపూ! ఇక నీ గోలేదో నువ్వే పడు, నాకు సంబంధం లేదు!