Sunday 24 July 2016

టూత్ఏక్.. టూ మెనీ డౌట్స్


సుబ్బు నా చిన్ననాటి స్నేహితుడు. మా స్నేహం ఇప్పటికీ మూడు మసాలా దోసెలు, ఆరు కాఫీలుగా వర్ధిల్లుతుంది. సుబ్బుకి ఉద్యోగం సద్యోగం లేదు, పెళ్ళీపెటాకుల్లేవు. వుండడానికో కొంపా, వండి పెట్టడానికో తల్లీ వున్నారు. మావాడు కబుర్ల పుట్ట, వార్తల దిట్ట.
ప్రస్తుతం నా కన్సల్టేషన్ చాంబర్లో సోఫాలో కూలబడి వున్నాడు సుబ్బు. కుడిబుగ్గ మీద అరచెయ్యి ఆనించుకుని, ఏసీబీ రైడ్సులో దొరికిపోయిన ప్రభుత్వోద్యోగిలా దిగాలుగా వున్నాడు సుబ్బు.
“సుబ్బూ! సిగరెట్లు మానెయ్యమని మొత్తుకుంటూనే వున్నాను, విన్నావు కాదు – అనుభవించు.” అన్నాను.
“ఆ చెప్పేదేదో సరీగ్గా చెప్పొచ్చుగా! ‘సత్యము పలుకుము, పెద్దలని గౌరవింపుము’ టైపులో నీతివాక్య బోధన చేస్తే నేనెందుకు వినాలి?” అన్నాడు సుబ్బు.
“ఇంకెట్లా చెప్పాలోయ్! ‘సిగరెట్లు తాగితే ఛస్తావ్’ అని చెబుతూనే వున్నాగా!?” ఆశ్చర్యపొయ్యాను.
“సిగరెట్లు తాగేవాడు సిగరెట్ల వల్లే చావాలని రూలేమన్నా వుందా? ఈ దేశంలో దోమతో కుట్టించుకుని చావొచ్చు, ప్రభుత్వాసుపత్రిలో వైద్యం చేయించుకుని చావొచ్చు, ఫ్రిజ్జులో మాంసం వున్నందుకు తన్నించుకుని చావొచ్చు, మునిసిపాలిటీ మేన్‌హోల్లో పడి చావొచ్చు. అసలెలా చస్తామో తెలిసి చస్తేనే కదా, అలా చావకుండా ముందు జాగర్తలు తీసుకునేది?” అన్నాడు సుబ్బు.
“అంతేగాని సిగరెట్లు తాగితే చస్తారన్న సంగతి మాత్రం ఒప్పుకోవు.” అన్నాను.
“ఒప్పుకుంటాను. ఈ లోకంలో సిగరెట్ల వల్ల చచ్చేది ఇద్దరైతే, ఇతర కారణాల్తో వెయ్యిమంది చస్తున్నారు. ఇటు సిగరెట్టు మానేసి, రేపింకేదో కారణంతో చస్తే దానికన్నా దారుణం మరోటుంటుందా?” నవ్వుతూ అన్నాడు సుబ్బు.
కొందరు విషయం తమకి అనుకూలంగా వుండేట్లు వితండవాదం చేస్తారు, అందులో మా సుబ్బు గోల్డ్ మెడలిస్ట్. ఇప్పుడు సిగరెట్లు ఆరోగ్యానికి మంచిదని ఇంకో లెక్చర్ ఇవ్వగల సమర్ధుడు. సుబ్బు ధోరణి నాకలవాటే.
ఇవ్వాళ సుబ్బుని చూస్తుంటే జాలేస్తుంది. అసలు విషయం – రెండ్రోజులుగా మా సుబ్బు పంటినొప్పితో బాధ పడుతున్నాడు.
నిన్న ఫోన్ చేశాడు సుబ్బు.
“పన్ను నొప్పిగా వుంది.”
“పెయిన్ కిల్లర్స్ వాడి చూడు. తగ్గకపోతే అప్పుడు చూద్దాం.” అన్నాను.
“నేను ఇంగ్లీషు మందులు వాడను, సైడ్ ఎఫెక్టులుంటయ్.” అన్నాడు సుబ్బు.
“మందులకి ఇంగ్లీషు, తెలుగు అంటూ భాషాబేధం వుండదోయ్. నీకు రోగం తగ్గాలా వద్దా?” నవ్వుతూ అన్నాను.
“ఇంగ్లీషు మందులు వాడితే వున్న రోగం పొయ్యి కొత్త రోగం పట్టుకుంటుంది.” స్థిరంగా అన్నాడు సుబ్బు.
“అట్లాగా! మరి ఫోనెందుకు చేశావ్?” విసుగ్గా అన్నాను.
“ఊరికే! నువ్వేం చెబుతావో విందామని!” నవ్వాడు సుబ్బు.
‘వీడీ జన్మకి మారడు.’ అనుకుంటూ ఫోన్ పెట్టేశాను.
ఇవ్వాళ నొప్పి బాగా ఎక్కువైందిట, నా దగ్గరకొచ్చేశాడు – అదీ విషయం.
“ఇంగ్లీషు మందులకి సైడ్ ఎఫెక్ట్స్ వుంటాయి, నువ్వు వాడవుగా!” వ్యంగ్యంగా అన్నాను.
“అవును, కానీ వాడాలని నువ్వు ముచ్చట పడుతున్నావుగా! ఒక స్నేహితుడిగా నీ కోరిక తీర్చడం నా ధర్మం. కాబట్టి నిన్న చెప్పిన ఆ మందులేవో రాసివ్వు, వాడి పెడతాను.” అన్నాడు సుబ్బు.
“బుగ్గ కూడా వాచింది సుబ్బూ! ఇదేదో పెద్దదయ్యేట్లుంది. డెంటల్ డాక్టర్ దగ్గరకి వెళ్దాం పద.” టైమ్ చూసుకుంటూ లేచాను.
సుబ్బు కుర్చీలోంచి లేవలేదు.
“నీతో నేన్రాను. నువ్వూ, ఆ డాక్టరు నా పంటి గూర్చి డిసైడ్ చేసేసి ఏదో చేస్తారు. హడావుడిలో పన్ను పీకించినా పీకేంచేస్తావు, నీదేం పోయింది.” నిదానంగా అన్నాడు సుబ్బు.
“అంటే – నీకు నామీద నమ్మకం లేదా?” కోపంగా అన్నాను.
“ఎంతమాట! నువ్వు నా ప్రాణస్నేహితుడివి. కావాలంటే నీ కోసం నా ప్రాణాన్నిచ్చేస్తాను, కానీ పన్నుని మాత్రం ఇవ్వలేను.” నొప్పిగా నవ్వుతూ అన్నాడు సుబ్బు.
“సుబ్బు! ఎక్కువ మాట్లాడకు. న్యాయంగా మాట్లాడితే నీమీదసలు జాలి చూపకూడదు.” చిరాగ్గా అన్నాను.
“చూడబోతే నా టూత్ఏక్ నీకు సంతోషంగా వున్నట్లుంది.” నిష్టూరంగా అంటూ అరచెయ్యి దవడపై ఆనించి బాధగా కళ్ళు మూసుకున్నాడు.
పాపం! బిడ్డడికి బాగా నొప్పిగా వున్నట్లుంది.
“సరే. నా ఫ్రెండ్ డాక్టర్ సుబ్రమణ్యంకి ఫోన్ చేసి చెబుతాను. సిటీలో ఇప్పుడతనే టాప్ డాక్టర్. నువ్వే వెళ్లి చూపించుకో.” అన్నాను.
“నేను బిజీ డాక్టర్ల దగ్గరకి పోను. వాళ్ళు హడావుడిగా పైపైన చూస్తారు.” అన్నాడు సుబ్బు.
“పోనీ – నీ పంటిని నిదానంగా, స్పెషల్‌గా చూడమని చెబుతాను. సరేనా?” అన్నాను.
“సరే గానీ – నాకో అనుమానం వుంది.” గుడ్లు మిటకరించాడు సుబ్బు.
“యేంటది?” అడిగాను.
“డెంటల్ డాక్టర్లు అవే ఇన్‌స్ట్రుమెంట్లు అందరి నోట్లో పెడుతుంటారు కదా! సరీగ్గా కడుగుతారంటావా?” అన్నాడు సుబ్బు.
“కడుగుతార్లే సుబ్బూ! అయినా ఇన్ని డౌట్లు సర్జరీ చేయించుకునే వాడిక్కూడా రావు.” అసహనంగా అన్నాను.
“పన్ను నాది, నొప్పి కూడా నాదే. అన్ని నొప్పుల్లోకి తీవ్రమైనది పన్నునొప్పి అని నీవు గ్రహింపుము.” నీరసంగా నవ్వాడు సుబ్బు.
“గ్రహించాన్లే, పోనీ డాక్టర్ రంగారావు దగ్గరకి వెళ్తావా?” అడిగాను.
“ఎవరు? బ్రాడీపేట మెయిన్ రోడ్డులో వుంటాడు, ఆయనేనా?”
“అవును, ఆయనే.”
“రోజూ అటువైపుగా వెళ్తుంటాను. యేనాడూ ఒక్కడంటే ఒక్క పేషంటు కూడా నాక్కనపళ్ళేదు.” అన్నాడు సుబ్బు.
“నీక్కావల్సిందీ అదేగా సుబ్బూ! ఆయన దగ్గర జనం తక్కువగా ఉంటారు. శ్రద్ధగా ఎక్కువసేపు చూస్తాడు, ఇన్‌స్ట్రుమెంట్లూ శుభ్రంగా వుంటాయి.” అన్నాను.
“అంత శ్రద్ధగా చూసేవాడైతే ప్రాక్టీసు లేకుండా ఖాళీగా ఎందుకున్నాడంటావ్?” అడిగాడు సుబ్బు.
“యేమో! నాకేం తెలుసు?”
“నీకే తెలీదంటే – ఆయన వైద్యంలో ఏదో లోపం వుంది.” స్థిరంగా అన్నాడు సుబ్బు.
“నీకు నీ పంటినొప్పికి ట్రీట్మెంట్ కావాలా? డాక్టర్ల బయోడేటా కావాలా?” విసుక్కున్నాను.
“పేషంటన్నాక అన్నీ విచారించుకోవాలి.”
“వొప్పుకుంటాను. కానీ నీక్కావలసింది పంటి వైద్యం, గుండె వైద్యం కాదు.”
“గుండె ఒక్కటే వుంటుంది. అదే నోట్లో పళ్ళైతే? ముప్పైరెండు! డాక్టర్లు కన్ఫ్యూజ్ అయ్యే చాన్స్ ఎక్కువ. పొరబాటున ఒకదాని బదులు ఇంకోటి పీకేస్తే!” అన్నాడు సుబ్బు.
“నాయనా! నీకో నమస్కారం. ఇప్పుడు నేనేం చెయ్యాలో చెప్పు.” అన్నాను.
“నువ్వు ఏమీ చెయ్యనక్కర్లేదు. ఆసనాల బాబా పళ్ళపొడి వేసి పసపసా తోమితే పంటినొప్పి ఇట్టే మాయమౌతుందని టీవీల్లో చెబుతున్నారు.” అంటూ లేచాడు సుబ్బు.
“సుబ్బూ! శకునం చెప్పే బల్లి కుడితిలో పడి చచ్చిందిట! ఇన్ని కబుర్లు చెబుతావ్, చివరాకరికి నువ్వు చేసే పని ఇదా!” అన్నాను.
“ఈ దేహం భారతీయం, ఈ పన్నూ భారతీయమే. తరతరాలుగా మన పూర్వీకులు ప్రసాదించిన ప్రకృతి వైద్యం గొప్పదనాన్ని నేను నమ్ముతాను. ఆసనాల బాబా పళ్ళపొడిని వాడి మన భారతీయ సాంప్రదాయ వైద్య విలువల్ని ప్రపంచానికి యెలుగెత్తి చాటుతాను. ఇంగ్లీషు డాక్టర్లు డౌన్ డౌన్, ఆసనాల బాబా జిందాబాద్!” అంటూ నిష్క్రమించాడు సుబ్బు.
నాకు విషయం బోధపడింది! సుబ్బుకి డాక్టర్లంటే భయం. దాన్ని కప్పిపుచ్చుకోడానికి యేదేదో మాట్లాడాడు.
కొద్దిసేపటికి నా పనిలో నేను బిజీ అయిపొయ్యాను.
సాయంకాలం సుబ్బు మదర్ ఫోన్.
“ఒరే నాయనా! ఇక్కడ సుబ్బు పరిస్థితి ఏమీ బాగాలేదు. అదేదో పళ్ళపొడి తెచ్చుకుని మధ్యాహ్నం నించి పళ్ళకేసి ఒకటే రుద్దుడు. నోరంతా పోక్కిపొయింది, మూతి వాచిపోయింది. మాట్లాళ్ళేకపోతున్నాడు, సైగలు చేస్తున్నాడు.” అన్నారావిడ.
“అమ్మా! వాణ్ని నోరు మూసుకుని నే చెప్పినట్లు చెయ్యమను.” అన్నాను.
“వాడిప్పుడు నోరు మూసుకునే వున్నాడు, తెరవలేడు. మళ్ళీ మూసుకొమ్మని చెప్పడం దేనికి?” ఆశ్చర్యపొయ్యారావిడ.
ఈవిడ అన్నివిధాలా సుబ్బుకి తల్లే!
“సరేనమ్మా, కారు పంపిస్తున్నాను. ఆ వెధవని అర్జంటుగా నా దగ్గరకి రమ్మను. వెళ్ళనంటే కర్ర తీసుకుని నాలుగు బాది కార్లోకి నెట్టు.” అంటూ ఫోన్ పెట్టేసి డ్రైవర్ కోసం కాలింగ్ బెల్ నొక్కాను.
కృతజ్ఞత –
ఈ రచన ప్రధాన పాయింట్‌కి ఆధారం – చాలాయేళ్ళ క్రితం ‘హిందు’ చివరిపేజిలో వచ్చిన ఆర్ట్ బక్‌వాళ్ (Art Buchwald) కాలమ్.
(ప్రచురణ - సారంగ వెబ్ మేగజైన్ 2016 జులై 20)