Sunday 13 December 2015

రావిశాస్త్రి చేసిన మేలు


"నువ్వు కథలేమన్నా రాశావా?"

"లేదు."

"రాయొచ్చుగా?"

నా స్నేహితుల్లో ఎక్కువమంది డాక్టర్లు. ప్లీడర్లకి ప్లీడర్లూ, దొంగలకి దొంగలూ.. ఇలా యే వృత్తివారికి ఆ వృత్తిలోనే స్నేహాలుంటయ్. కొందరు డాక్టర్లని తెలివైనవారిగా భావిస్తారు. నేనైతే అలా అనుకోవడం లేదు. ఎందుకంటే - నాకు తెలిసి అనేకమంది డాక్టర్లలో వృత్తిపరమైన నైపుణ్యం తప్ప ఇంకే విషయంలోనూ పెద్దగా అవగాహన లేదు.

నా స్నేహితులకి నేను రాస్తానని తెలుసు గానీ - ఏం రాస్తానో తెలీదు. అంచేత 'కథల్రాస్తున్నావా?' అంటూ మర్యాద కోసం అడుగుతుంటారు. ఇంకొందరు నాకు కథలు రాసేంత తెలివున్నాకూడా రాయకుండా నా ప్రతిభని వృధా చేస్తున్నానని అనుకుంటారు! ఇలా అడిగిన వాళ్ళ చదువరితనంపై నాకేమీ భ్రమల్లేవు. వాళ్ళు - చిన్నప్పుడు చదివిన చందమామ తప్ప ఇంకేదీ చదివుండరు, సెలవు చీటి మించి ఇంకేదీ రాసుండరు. కాబట్టి వాళ్ళ ప్రశ్నకి చిరునవ్వే సమాధానంగా ఊరుకుంటాను.  

హైస్కూల్ రోజుల్లో నేను వారపత్రికలు చదివేవాణ్ని. అదే సాహిత్యం అనే భ్రమలో కూడా వుండేవాణ్ని. అంచేత ఎప్పటికోకప్పుడు నేను కూడా కొన్ని కథలు రాయకపోతానా అన్న మిణుకు మిణుకు ఆశతో వుండేవాణ్ని. కొంతకాలానికి రావిశాస్త్రి చదివాను. గుండె గుభిల్లుమంది! ఇంకా నయం - కథ రాసి నా అజ్ఞానాహంకారముల్ని లోకానికి చాటుకున్నాను కాదు! ఆవిధంగా తెలుగు పాఠకులు అదృష్టవంతులయ్యారు.

నేను కథ రాయకపోవడం వల్ల తెలుగు పాఠకులకే కాదు, నాకూ చాలా లాభించింది! లేపోతే ఉత్సాహంగా అనేక కథలు రాసి సమయం వృధా చేసుకునేవాణ్ని! అవును - నాకు విలువైన జీవితానుభవం లేదు (సినిమాలు, షికార్లు, హోటళ్ళు - జీవితానుభవం కాదు). సాహిత్యంతో పరిచయం లేదు (వారపత్రికల (అ)జ్ఞానం సాహిత్యానుభవం కాదు). కావున కడుపు నిండిన సరదా కథలేవో కొన్ని వండగలిగేవాణ్నేమో గానీ - 'మంచికథ' మాత్రం ఖచ్చితంగా రాయగలిగేవాణ్నికాదు.

రావిశాస్త్రి వల్ల నాకింకో మేలు కలిగింది. నేనప్పటిదాకా చదివిన కథలన్నీ పరమచెత్తని కూడా గ్రహించే జ్ఞానం అబ్బింది. అంచేత అర్జంటుగా తెలుగు కథలు చదవడం మానేశాను, నా సమయాన్ని మరింత ఆదా చేసుకున్నాను. అయితే కథల్రాయడం వల్ల ప్రయోజనం లేదా? పాఠకుల సంగతేమో గానీ, రచయితకి మాత్రం ప్రయోజనమే!

నాలుగేళ్ల క్రితం నాకో డాక్టర్ అనుసరిస్తున్న అరాచక, భీభత్స వైద్యంపై చాలా కోపం వచ్చింది. ఏం చెయ్యాలి? ఏం చెయ్యగలను? బాగా ఆలోచించాక ఆ డాక్టరాధముణ్ని ఒక కథతో కొట్టాలని నిర్ణయించుకున్నాను. ఆ రాత్రి చాలాసేపు మేలుకుని కథొకటి టైప్ కొట్టాను. మర్నాడు నా కథ చదువుకొని బిత్తరపొయ్యాను - పరమ చెత్త! కానీ ఆశ్చర్యంగా ఆ క్షణం నుండి నాకా డాక్టర్ మీద కోపం పోయింది! ఇది రచయితగా నాకు చేకూరిన కథా ప్రయోజనం అనుకుంటున్నాను!

అటుతరవాత నా కథ గూర్చి ఈ నాలుగేళ్ళలో నాలుగు నిమిషాలు కూడా ఆలోచించలేదు. కానీ.. కానీ.. ఎవడి మీదో కోపం వచ్చి ఏదో రాసినా - అది నా కీబోర్డులో నా వేళ్ళ మీద గుండా జాలువారిన కథ! కావున నా కథని అలా చిత్తుప్రతిగా వదిలెయ్యడం సరికాదు. ఇది ఆడపిల్ల పుట్టిందని రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయినంత రాక్షసత్వంతో సమానం! అంచేత ఆ కథని నా బ్లాగులో పబ్లిష్ చెయ్య నిర్ణయించాను. చెత్తలో చెత్త - కలిసిపోతుంది!

(picture courtesy : Google)

Tuesday 1 December 2015

రచయితలూ! మీ "స్పందన" ఎక్కువైపోతుంది


మనుషుల్లో రకాలున్నట్లే రచయితల్లోనూ అనేక రకాలు. కొందరు రచయితలకి రచనా వ్యాసంగం ఒక వృత్తి. వారు మార్కెట్ ట్రెండుని బట్టి రాస్తుంటారు. సినిమావాళ్ళు ప్రేక్షకుల అభిరుచిని ఫాలో అయిపోతున్నట్లు వీళ్ళూ పాఠకుల నాడిననుసరించి రాస్తుంటారు. ఇక్కడ రాసేవాళ్ళకీ, చదివేవాళ్ళకీ మధ్య సంబంధం ఉత్పత్తిదారుడికీ, వినియోగదారుడి మధ్య గల సంబంధం మాత్రమే.

ఇంకోరకం రచయితలున్నారు. వీరికి రచన అనేది ఒక passion - పాఠకుల స్పందన, విమర్శకుల feedback కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారు. కొన్నేళ్లుగా ఆన్లైన్ మేగజైన్లు వచ్చాయి. రచయితలకి పాఠకులకి మధ్య దూరం బాగా తగ్గింది. రచయితలకి ఇదో లక్జరీ. అయితే ఈ పద్ధతికి side effects వస్తున్నాయని నా అభిప్రాయం. రచయితలు పాఠకుల్తో constant dialogue లో వుంటున్నారు. వేదికలెక్కి తమ రచనల 'నేపధ్యం' అంటూ ఉపన్యాసాలిస్తున్నారు!

తమ రచనల పట్ల రచయితల వ్యవహార శైలి ఎలా వుండాలో రావిశాస్త్రి 'రత్తాలు - రాంబాబు' రాసినప్పుడు స్పష్టంగా చెప్పేశాడు. 'రత్తాలు - రాంబాబు' తీవ్రమైన విమర్శకి గురైన సందర్భంలో రావిశాస్త్రి వెలిబుచ్చిన అభిప్రాయాల్ని యధాతధంగా ఇక్కడ ఇస్తున్నాను -

1.విమర్శ విడిచిపెట్టి విమర్శకుల మీద వ్యక్తిగతంగా విసుర్లు విసరడం మంచిది కాదని నా అభిప్రాయం.

2.కథ రాసేక, దాన్ని మరింక విడిచిపెట్టక, దాని మానాన దాన్ని బతకనివ్వక (లేదా చావనివ్వక) ఆ రాసినవాడు దాన్ని సాకుతూ సంరక్షించుకొంటూ సమర్ధించుకొంటూ నెత్తిన పెట్టుకుని తిరగడం నాకు ఇష్టం లేదు.

3.నిజానికి దగ్గరగా ఉంటె కథ కొన్నాళ్ళు ఉండవచ్చు. సత్తువుంటే ఉంటుంది, లేకపోతే పోతుంది.

4."రత్తాలు - రాంబాబు" నవల గురించి ఏమైనా తెలియాలంటే అది నవల వల్లే తెలియాలి కాని, నావల్ల కాదు.

రావిశాస్త్రి చెప్పిన ఈ విషయాన్నే డాక్టర్ కేశవరెడ్డి ఒక నవల ముందుమాటలో కోట్ చేశాడు. కానీ - 'మునెమ్మ'పై విమర్శలకి మాత్రం ఆయన సంయమనం కోల్పోయాడు. ఆయనకి 'చూపు' కాత్యాయిని విమర్శ బాధించింది. నాకైతే కాత్యాయిని చేసిన విమర్శ వ్యక్తిగతం అనిపించలేదు. మరి కేశవరెడ్డి ఎందుకంతగా offend అయ్యాడో అర్ధం కాదు.

రచయితలు తమ రచనల పట్ల సెన్సిటివ్‌గా వుండటం నేనర్ధం చేసుకోగలను. కానీ - టెక్నాలజీ వల్ల కలిగిన సౌలభ్యంతో వాళ్ళో ట్రాప్‌లో పడిపోతున్నారు. రచయితలూ! చెక్ యువర్సెల్ఫ్. రచన పబ్లిష్ అవ్వంగాన్లే మీ పాత్ర ముగిసింది. మీ రచన గూర్చి చర్చ జరగాల్సింది పాఠకుల్లో మాత్రమే! అంచేత మీరు మాట్లాడకపోవడమే మంచిది. 'నేనా ఉద్దేశంతో రాయలేదు, నా రచనని ఇలా అర్ధం చేసుకోవాలి' - లాంటి చర్చలు చేస్తే రచయితగా మీరు విఫలం అయినట్లే!

(picture courtesy : Google)

Wednesday 11 November 2015

ఒక సినిమా జ్ఞాపకం (స్వాతిముత్యం)


అవి మేం చదూకునే రోజులు. మాకు సినిమాలే ప్రధాన కాలక్షేపం. సినిమా బాగుందా లేదా అనేది ఎవడికీ పట్టేది కాదు, సినిమా చూడ్డమే ముఖ్యం. అవ్విధముగా - ప్రవాహంలో బెండుముక్క కొట్టుకుపోయినట్లు స్నేహితుల్తో అనేక సినిమా చూశాను. 

ఒకరోజు 'స్వాతిముత్యం' అనే సినిమాకి వెళ్లాం. హీరో వెర్రిబాగులాడు (పాపం). అతన్ని పెంచి పెద్దచేసిన ముసలామె చచ్చిపోయి అందరూ ఏడుస్తుంటే - ఆకలేస్తుందని అడిగి మరీ అన్నం పెట్టించుకుని తింటాడు. అతగాడు mentally retarded, కాబట్టి అతనలా అన్నం తిన్డం దర్శకత్వ ప్రతిభే!

హీరోయిన్ వితంతువు. భర్త పోయిన పుట్టెడు దుఃఖంతో (వితంతువులు ఎల్లప్పుడూ దుఃఖిస్తూనే వుండాలని మన సినీమేధావులు భానుమతి 'బాటసారి' రోజుల్నుండే నిర్ణయించేశారు, మనమూ అలవాటు పడిపోయ్యాం), ఒక ఎల్కేజీ వయసు పిల్లాడితో బ్రతుకు వెళ్లమారుస్తూ వుంటుంది (మళ్ళీ ఇంకోసారి 'పాపం').

రాముడి గుళ్ళో యేదో కార్యక్రమం జరుగుతుంటే - మన బుర్ర తక్కువ హీరో అడావుడిగా ఆ దుఃఖపు వితంతువుకి తాళి కట్టేస్తాడు. వాస్తవానికి ఒక స్త్రీకి ఎవడో అపరిచితుడు ఇలా హఠాత్తుగా తాళి కట్టేస్తే నాలుగు బాది పోలీసులకప్పజెప్పాలి. కానీ ఇది తెలుగు సినిమా, పైగా - ఆ స్త్రీ ఒక దుఃఖవితంతువాయె! దర్శకుడు హీరోగారిది ఆదర్శంగా హైలైట్ చేస్తాడు! హీరోయిన్ కూడా - 'వెర్రిబాగులోడైతేనేం తాళి కట్టాడు, అంతే చాలు' అన్నట్లు సైలెంట్‌గా వుండిపోతుంది.

సరే! తెలుగు సినిమా రాజకీయ నాయకుల ప్రజాసేవలాగా అర్ధం పర్ధం లేకుండా వుంటుంది. కావున - సినిమా చూస్తూ కూర్చున్నాను (అంతకన్నా చేసేదేమీ లేదు). ప్రేక్షకుల అదృష్టం బాగుండి హీరోయిన్ చచ్చిపోతుంది. అప్పుడు మన MR హీరో చాలా సెంటిమెంటల్‌గా అయిపోతాడు (ఇప్పుడు మాత్రం అన్నం అడగడు)!

సినిమా ఫస్టాఫ్‌లో ముసలామె చచ్చిపోయినప్పటికీ ఇప్పటికీ ఎంత మార్పు! అవును, అలనాడు 'అర్ధాంగి'లో సావిత్రి కూడా తన ప్రేమతో నాగేశ్వర్రావు IQ score పెంచింది (యెంతైనా ఆ రోజులు భర్తల పాలిట స్వర్ణయుగం)!

సినిమా అయిపోంగాన్లే హాలు పక్కనే వున్న హోటల్లో రవ్వట్టు తిన్నాం, బాగుంది.

"సినిమా ఎలా వుంది?" కాఫీ తాగుతూ అడిగాను.

నా స్నేహితుల్లో ఒకడు యదార్ధవాది, విజ్ఞానవంతుడు. ఒక్కక్షణం ఆలోచించి చెప్పాడు. 

"సినిమా ఎలా వుంటే మనకెందుకు? తీసేవాళ్ళు తీస్తారు, చూసేవాళ్ళు చూస్తారు. వాళ్ళేమన్నా మనకి బొట్టూ కాటుక పెట్టి 'మా సినిమా చూడగ రారండీ!' అని పిల్చారా? లేదు కదా? మనకి పనీపాటా లేక సినిమాకొస్తాం. నచ్చితే కళ్ళు తెరుచుకుని సినిమా చూస్తాం, నచ్చకపోతే కళ్ళు మూసుకుని ఓ కునుకు తీస్తాం. అంతే!"

అవును, అంతే! 

(posted on fb 16/6/2017)

Sunday 6 September 2015

రెండు ఫోటోలు - రెండు ఆలోచనలు


ఈ ఫొటోలో చనిపోయిన చిన్నారి బాలుణ్ని చూడండి - గుండె కలచివేయట్లేదూ? ఎర్ర టీషర్టూ, బ్లూ షార్ట్సూ, షూస్, తెల్లని మేనిఛాయతో అచ్చు దొరబాబులా.. పాపం! అర్ధాంతరంగా తనువు చాలించాడు. ఈ ఫోటో చూసి చాలమందికి షాకయ్యారు. అందుకే సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అయ్యింది.


ఇప్పుడీ పాపని చూడండి. మాసిపోయిన బట్టలు, పుల్లల్లాంటి కాళ్ళూ చేతుల్తో నేలపాలైన ఆహారాన్ని ఆబగా నోట్లో కుక్కుకుంటూ ఆకలి తీర్చుకుంటుంది. ఈ రెండో ఫొటో చూస్తే మొదటి ఫొటో అంత షాకింగ్‌గా లేదు కదూ? అవును, మనని రెండో ఫొటో కదిలించదు. అంచేత ఫేస్బుక్కులో ఎవరికీ షేర్ చేసుకోం.

ఎర్రని టీషర్టు తెల్లటి పిల్లవాడు అచ్చు మన పిల్లాడిలాగే వున్నాడు. ఇంకో సౌకర్యం ఆ పిల్లాడు మన దేశానికి చెందినవాడు కాదు. ఆ రాజకీయాలు మనకి అనవసరం. మనకి జెనరల్ నాలెడ్జి, సామాజిక స్పృహ, స్పందించే గుణం వుందని మన ఫేస్బుక్ స్నేహితులకి తెలుస్తుంది. కాబట్టి షేర్ చేసుకుందాం. ఫేస్బుక్కులో అవతలివారూ ఇలాగే ఆలోచిస్తారు. కావున బోల్డన్ని లైకులొస్తాయి! బస్ - ఖేల్ ఖతం, దుకాణ్ బంద్!

వీళ్ళు - రెండో ఫొటో షేర్ చెయ్యాలని అనుకోరు. పొరబాటున షేర్ చేసినా పెద్దగా లైకుల్రావు. ఎందుకని? ఎందుకంటే - అప్పుడు భారద్దేశానికి స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా కొన్నివర్గాలు ఇంకా దరిద్రంలోనే ఎందుకు మగ్గిపోతున్నాయి? వారిని బాగుచేస్తామని చెప్పుకుని రాజ్యాధికారం చేపట్టేవారు ఇంకాఇంకా ఎందుకు బలిసిపోతున్నారు? అన్న ఆలోచన చెయ్యాలి. అప్పుడు మనకి చాలా ఇబ్బందికర సమాధానాలొస్తయ్. ఆ సమాధానాల్ని ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం మన రాజకీయ సామాజిక ఆర్ధిక అవగాహనపై ఆధారపడి వుంటుంది. 

రెండో ఫోటోలోని పిల్లలు మురికివాడల్లో కనపడుతూనే వుంటారు. ధైర్యం వుండి అడగాలే గానీ - ఆ పాప ద్వారా మనక్కొన్ని నిజాలు తెలియొచ్చు. ఆ కుటుంబం వ్యవసాయం గిట్టుబాటు కాక పూట గడవక బస్తీకి మైగ్రేట్ అయ్యిండొచ్చు. అగ్రకులాల దాడిలోనో, మతకల్లోలంలోనో కుటుంబం దిక్కు లేనిదై అక్కడ తల దాచుకునుండొచ్చు. పచ్చని పొలాల్ని కాంక్రీటు జంగిల్‌గా మార్చే అభివృద్ధిలో స్థానం కోల్పోయిన నిర్భాగ్య కుటుంబం అయ్యుండొచ్చు లేదా గనుల కోసమో, డ్యాముల కోసమో ఆవాసం కోల్పోయిన గిరిజన కుటుంబం కావచ్చు. ప్రభుత్వ పథకాలకి అందకుండా మైళ్ళ దూరంలో ఆగిపోయి ఓటర్లుగా మిగిలిపోయిన జీవచ్చవాలూ కావచ్చు.     

'నువ్వు మురికివాడల్ని రొమేంటిసైజ్ చేస్తున్నావు. అభివృద్ధి జరుగుతున్నప్పుడు కొందరు సమిధలవక తప్పుదు. ఇది చాలా దురదృష్టం. దిక్కు లేనివారికి దేవుడే దిక్కు. టీవీల్లో గంటల తరబడి సాగే ప్రవచనాలు వినడం లేదా?' అంటారా? ఓకే! ఒప్పుకుంటున్నాను. అందుచేత ప్రస్తుతానికి మనకి రెండో ఫోటో అనవసరం. హాయిగా మొదటి ఫోటో షేర్ చేసుకుందాం. మన దయాగుణాన్నీ, వితరణ శీలాన్నీ లోకానికి చాటుకుందాం. 

గమనిక -   

మొదటి ఫోటోలో చనిపోయిన బాబుకి నివాళులు అర్పిస్తూ, ఆ బాబుని మరణాన్ని ఏ మాత్రం తక్కువ చేసే ఉద్దేశం నాకు లేదని మనవి చేసుకుంటున్నాను.

(photos courtesy : Google) 

Tuesday 1 September 2015

చంపడమే ఒక సందేశం!


ఈ లోకమందు చావులు నానావిధములు. ప్రపంచంలోని పలుదేశాల్లో పలువురు తిండి లేకో, దోమలు కుట్టో హీనంగా చనిపోతుంటారు. కొన్నిదేశాల్లో రాజకీయ అస్థిరత, యుద్ధవాతావరణం కారణంగా పెళ్ళిభోజనం చేస్తుంటేనో, క్రికెట్ ఆడుకుంటుంటేనో నెత్తిన బాంబు పడి ఘోరంగా చనిపోతుంటారు. ఇంకొన్ని దేశాల్లో మెజారిటీలకి వ్యతిరేకమైన ఆలోచనా విధానం కలిగున్న కారణంగా హత్య కావింపబడి చనిపోతారు. 
నరేంద్ర దభోల్కర్, గోబింద్ పన్సరె, మల్లేశప్ప కల్బుర్గి.. వరసపెట్టి నేల కొరుగుతున్నారు. వీరు వృద్ధులు, వీరికి మతం పట్ల డిఫరెంట్ అభిప్రాయాలున్నాయ్. ఇలా ఒక విషయం పట్ల విరుద్ధమైన అభిప్రాయాలు కలిగుండటం నేరం కాదు. తమ అభిప్రాయాలని స్వేచ్చగా ప్రకటించుకునే హక్కు రాజ్యంగం మనకి కల్పించింది గానీ అందుకు మనం అనేకమంది దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాలి.
సౌదీ అరేబియాలో మతాన్ని ప్రశ్నించడం తీవ్రమైన నేరం. శిక్ష కూడా అత్యంత పాశవికంగా అమలవుతుంది. ఇదంతా వారు తమ రాజ్యాంగంలోనే రాసుకున్నారు. కనుక సౌదీ అరేబియా ప్రభుత్వం ఎటువంటి మొహమాటాలు లేకుండా దర్జాగా, ప్రశాంతంగా, పబ్లిగ్గా తన శిక్షల్ని అమలు చేసేస్తుంది. సౌదీకి అమెరికా మంచి దొస్త్. దోస్తానాలో దోస్త్‌లు ఎప్పుడూ కరెక్టే. అందుకే అమెరికా సౌదీ అరేబియా క్రూరమైన శిక్షల్ని పట్టించుకోదు!
సౌదీ అరేబియా శిక్షలు అనాగరికమైనవనీ, ప్రజాస్వామ్యంలో అటువంటి కఠినత్వానికి తావు లేదని కొందరు విజ్ఞులు భావిస్తారు. అయ్యా! ప్రజాస్వామ్య దేశాల్లో కూడా విపరీతమైన భౌతిక హింస, భౌతికంగా నిర్మూలించే శిక్షలు అమలవుతూనే వుంటాయి. కాకపొతే అవి అనధికారంగా అమలవుతాయి. ఎందుకంటే – ప్రజాస్వామ్య ముసుగు కప్పుకున్న ఈ దేశాలకి కూసింత సిగ్గూ, బోల్డంత మొహమాటం!
మతాన్ని ప్రశ్నించిన వారిని చంపడం ఎప్పుడూ కూడా ఒక పధ్ధతి ప్రకారమే జరుగుతుంది, కాకతాళీయం అనేది అస్సలు వుండదు. బంగ్లాదేశ్‌లో మతోన్మాదులు బ్లాగర్లని వేదికి వెదికి వేటాడి మరీ నరికేస్తున్నారు. పాకిస్తాన్లో పరిస్థితీ ఇంతే. శ్రీలంకలో బౌద్ధమతాన్ని ప్రశ్నించినవారూ ఖర్చైపొయ్యారు! ఇక క్రిష్టియన్ మతం హత్యాకాండకి శతాబ్దాల చరిత్రే వుంది. ఇవన్నీ స్టేట్, నాన్ స్టేట్ ఏక్టర్స్ కూడబలుక్కుని చేస్తున్న నేరాలు. అంచేత ఈ నేరాల్ని స్టేట్ విచారిస్తూనే వుంటుంది. సహజంగానే నిందితులెవరో తెలీదు, కాబట్టి కేసులూ తేలవు.
దక్షిణ ఆసియా దేశాల్లో మెజారిటీకి వ్యతిరేకంగా డిఫరెంట్ అభిప్రాయాల్ని కలిగున్నవారిని గాడ్‌ఫాదర్ సినిమా టైపులో పద్ధతిగా ఎలిమినేట్ చేస్తుండడం అత్యంత దారుణం. ఇటువంటి హత్యలు అరుదుగా జరిగే సంఘటనలేనని, వీటికి స్టేట్‌తో సంబంధం లేదని కొందరు వాదించవచ్చు. కానీ – ఈ హత్యలు పౌరసమాజానికి స్టేట్ పంపుతున్న ఒక సందేశంగా చూడాలని నా అభిప్రాయం. ఈ హత్యలు జరిగిన దాని కన్నా ఆ తరవాత దర్యాప్తు సంస్థలు చూపించే నిర్లిప్తతని పరిశీలించి ఒక అభిప్రాయం ఏర్పరచుకోవల్సిందిగా నా విజ్ఞప్తి.
ఇంకో విషయం – ఈ హత్యలు జరిగినప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ చదువుతుంటే ఒళ్ళు జలదరిస్తుంది. ‘మతాన్ని కించపరిచే ఎవరికైనా ఇదే శిక్ష’ అంటూ హత్యకి సపోర్ట్ చేస్తూ వికటాట్టహాసం చేస్తున్న వ్యాఖ్యలు వెన్నులో వణుకు తెప్పిస్తున్నయ్! దభోల్కర్‌తో మొదలైన ఈ హత్యా పరంపర ఇంకా కొనసాగవచ్చు, రైతుల ఆత్మహత్యల్లానే ఇదీ ఒక రెగ్యులర్ తంతు కావచ్చు, అప్పుడు మీడియాలో ఈ హత్యలు ఏ పదో పేజి వార్తో కావొచ్చు!
మరీ హత్యల వల్ల ప్రయోజనం?
సమాజంలో ఒక భయానక వాతావరణం ఉన్నప్పుడు, ప్రాణాలకి తెగించి ఎవరూ రాయరు, మాట్లాడరు. అంచేత వాళ్ళు ఏ సినిమా గూర్చో, పెసరట్టు గూర్చో రాసుకుంటారు. ఇంకొంచెం మేధావులు – ఉదయిస్తున్న భానుడి ప్రకాశత గూర్చీ, వికసిస్తున్న కలువల అందచందాల గూర్చీ, అమ్మ ప్రేమలో తీపిదనం గూర్చీ సరదా సరదాగా హేపీ హేపీగా రాసుకుంటారు – అవార్డులు, రివార్డులు కొట్టేస్తారు! ఈ హత్యల పరమార్ధం అదే!
(ప్రచురణ - సారంగ వెబ్ మేగజైన్ 2015 సెప్టెంబర్ 1)

Thursday 23 July 2015

రాజకీయ నటనా శిల్పం


తెలీని విషయాల్ని అర్ధం చేసుకోడానికో పద్ధతుంది. ఆల్రెడీ తెలిసిన విషయాలని క్రమపద్ధతిలో పేర్చుకుంటూ.. తద్వారా తెలీని విషయాల్ని అర్ధం చేసుకోవడం అనేది సులువైన పధ్ధతి. అంచేత నేనూ ఇదే ఫాలో అయిపోతుంటాను. అందుకే - చాలాసార్లు విషయాన్ని అర్ధం చేసుకోడానికి నాకు తెలిసిన నా సినిమా జ్ఞానాన్ని ఉపయోగిస్తుంటాను!

ఇప్పుడు కొంచెంసేపు సినిమాల గూర్చి -

తెర మీద కదిలే బొమ్మలు చూడ్డం తప్పించి కథ సరీగ్గా అర్ధం కాని దశలో.. ఒక సినిమాలో చనిపోయిన నటుడు ఇంకో సినిమాలోకి ఎలా వస్తాడో అర్ధమయ్యేది కాదు. ఈ దశలో 'పాండవ వనవాసం' చూశాను. ఎన్టీఆర్ గద తిప్పుతూ 'ధారుణి రాజ్యసంపద.. ' అంటు పద్యం మొదలెట్టంగాన్లే ఆవేశంతో ఊగిపొయ్యాను. సినిమా చూశాక.. ఎన్టీఆర్ ఎస్వీరంగారావులు శత్రువులనీ, పొరబాటున ఎదురు పడితే గదల్తో కొట్టుకుంటారని ఘాట్టిగా నమ్మాను. కొన్నాళ్ళకి 'గుండమ్మకథ' చూశాను. ఆశ్చర్యం - అందులో రంగారావు ఎన్టీఆర్‌ తండ్రీకొడుకులు! ఈ సినిమాలన్నీ నిజం కాదనీ, దర్శకుడి సూచనలకి అనుగుణంగా నటులు నటిస్తారనీ కొన్నాళ్ళకి అర్ధమైంది.

సినిమాలకి సంబంధించిన నా అమాయకత్వం తొలగిపోయింది గానీ రాజకీయాల్లో మాత్రం కంటిన్యూ అయ్యింది. ఇందిరాగాంధీ మనకి ఎంతో మంచి చేస్తుందనీ, ఆమెనలా చెయ్యనీకుండా ఇతర నాయకులు అడ్డు పడుతున్నారనీ నమ్మాను. ఆ తరవాత ఇందిరాగాంధీ ఎవరో నాయకుడితో కబుర్లు చెబుతున్న ఫొటో చూసి ఆశ్చర్యపొయ్యాను. వీళ్ళు ఎదురు పడ్డప్పుడు తిట్టుకోవాలి గానీ - ఇలా కబుర్లు చెప్పుకుంటున్నారేవిఁటి!? అటుతరవాత రాజకీయ నాయకుల మధ్య రాజకీయ విబేధాలే గానీ వ్యక్తిగత వైరాలు వుండవని అర్ధం చేసుకున్నాను. ఆ విధంగా నా రాజకీయ అమాయకత్వాన్నీ వదిలేసుకున్నాను.

నా సినిమాల, రాజకీయాల అమాయకత్వానికి కారణమేమి? ఇప్పుడీ ప్రశ్నకి సమాధానం రాయడానికి ప్రయత్నిస్తాను.

మానవ శరీరం నిర్మాణపరంగా ఒకే విధంగా వున్నా - మెదడు ప్రత్యేకమైనది. గుండె అందర్లో ఒకేరకంగా కొట్టుకుంటుంది. కాళ్ళూ చేతులూ ఒకేరకంగా పని చేస్తాయి. కానీ - మనిషి మేధస్సు, అవగాహన, ఆలోచనా విధానం ఒక్కోవ్యక్తికి ఒక్కోరకంగా వుంటుంది. ఒకడు ఒక స్త్రీని గౌరవించాలన్నా, ఇంకోడు అదే స్త్రీని రేప్ చేసి చంపాలన్నా - వారిద్దరికీ సిగ్నల్స్ ఇచ్చే నాడీవ్యవస్థకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ మెదడులో వుంటుంది.

మానవుని ఆలోచింపజేసేదీ, నడిపించేదీ మేధస్సు. అయితే ఈ మేధస్సు ఎక్కువమందిలో తక్కువ స్థాయిలో, తక్కువ మందిలో ఎక్కువ స్థాయిలో వుంటుందని నా అభిప్రాయం. అంచేత - మెదడు ఏ విషయాన్నైనా నలుపు తెలుపులుగా చేసుకుని అర్ధం చేసుకోడానికి మొగ్గు చూపుతుంది (బహుశా మన్లాగే మన మెదడుకీ బద్దకమేమో). అంతేనా? మెదడు బోల్డంత వినోదాన్నీ కోరుకుంటుంది, అందుకోసం విషయాల్ని సింప్లిఫై చేసుకుంటుంది. ఈ సింప్లిఫికేషన్ ప్రాసెస్‌లో - 'మనం vs వాళ్ళు' అనే కాన్సెప్ట్ తయారవుతుంది.

ఇంకిప్పుడు మన ఆలోచనలు ఇలా మారిపోతాయి - 

నా దేశం vs వాడి దేశం, నా సంస్కృతి vs వాడి సంస్కృతి, నా మతం vs వాడి మతం, నా ప్రాంతం vs వాడి ప్రాంతం, నా కులం vs వాడి కులం, నా ఇల్లు vs వాడి ఇల్లు, నా పిల్లలు vs వాడి పిల్లలు.. ఇలా చాలా రాసుకుంటూ పోవచ్చు. అన్ని మంచి లక్షణాలు కుప్పపోసి 'నా'కి అప్లై అయితే, అన్ని చెడ్డలక్షణాలు గుంపగుత్తగా 'వాడి'కి అప్లై అవుతాయి.

భారత్ పాక్ సరిహద్దులో ఇరువర్గాల మధ్యా కాల్పులు ఏదోక స్థాయిలో జరుగుతూనే వుంటాయి. ఈ వార్త మన్దేశంలో ఇలా రిపోర్ట్ అవుతుంది - భారత భూభాగంలోకి అక్రమంగా చొచ్చుకువచ్చి దొంగదెబ్బ తీసిన పాకిస్తాన్ సైనికులు. ఎదురు కాల్పుల్తో ధీటుగా సమాధానం చెప్పిన మన వీరజవాన్లు. పాకిస్తాన్‌ లో కూడా ఇలాంటి వార్తే రాస్తారు, కాకపోతే అట్టు తిరగబడుతుంది - అంతే తేడా!

సైనికుల్ని ఉదాహరణగా చూసినంత సులభంగా రాజకీయాల్లోకి డివిజన్ చూడ్డం మెదడుకు కష్టం. ఎందుకంటే - ఇక్కడ నేను vs వాడు కూడా మనమే కనుక. కానీ - మెదడు ఇన్‌పుట్స్ రిసీవ్ చేసుకోడానికి ఏదోరకంగా డివిజన్ అవసరం. ఇప్పుడెలా!?

ఈ దేశంలో అనేక కులాలున్నాయి, సామాజిక అసమానతలున్నాయి. కాబట్టి కులాల్ని అధారంగా చేసుకుని పార్టీలు పుట్టుకొచ్చాయి. దక్షిణ భారతంలో బ్రాహ్మణ వ్యతిరేకతతో ద్రవిడ పార్టీ పుట్టుకొస్తే, ఉత్తర భారతంలో జాట్‌ల కోసం లోక్‌దళ్ పుట్టుకొచ్చింది. ఈ ప్రయోగాలు ఆయా ప్రాంతాల్లో విజయవంతం కావడంతో ప్రాంతీయ పార్టీల హవా మొదలైంది. పార్టీ మనది, మన కులానిది అంటూ అర్ధిక వనరులు సమకూర్చే స్థితిమంతులు (ఆఫ్ కోర్స్, అంతకి పదింతలు రిటర్న్స్ గ్యారెంటీ అనుకోండి).. మన కులం పార్టీ అంటూ గుడ్డిగా అభిమానించే సాధారణ కార్యకర్తలూ (వీళ్ళు మాత్రం అమాయకులు) ప్రాంతీయ పార్టీలకి బలం.

ఇప్పుడు భారత జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారిద్దాం. ప్రాంతీయ పార్టీల్లాగా ఒక కులాన్నో, ప్రాంతాన్నో నమ్ముకుంటే కేంద్రంలో అధికారం దక్కదు. ఇంకా విశాలమైన ప్రాతిపదికతో ఓటర్లని రెండుగా విడగొట్టాలి. అప్పుడే పార్టీలకి తమకంటూ ఒక ఓటు బ్యాంక్ సృష్టింపబడుతుంది. అందువల్ల మెజారిటీ, మైనారిటీ రాజకీయ వాదాలు పుట్టుకొచ్చాయి.

ఒకవైపు రాజకీయ పక్షం మైనారిటీల హక్కులు రక్షిస్తామని హామీ గుప్పిస్తుంది. ఇంకో పక్షం మెజారిటీకి అన్యాయం జరిగిపోతుందని గగ్గోలు పెడుతుంది. ఇరు పక్షాలు ఎన్నికలప్పుడు వాగ్దానాలతో ప్రజల్ని ఊదర కొడతారు. అటు మైనారిటీకి వాళ్ళు గానీ, ఇటు మెజారిటీకి వీళ్ళు గానీ ఏదీ చెయ్యరు! ఐదేళ్ళ పాటు ప్రజలు ఒక రాజకీయ పక్షాన్ని ఆశగా నమ్మి - ఆపై విసుగు చెంది, మరుసటి ఎన్నికలప్పుడు అవతలి రాజకీయ పక్షం వైపు మొగ్గుతారు. ఇదో seesaw battle.

ఇప్పుడు మళ్ళీ 'పాండవ వనవాసం'కి వద్దాం. భీముడికీ, ధుర్యోధనుడికీ పద్యాలు రాసింది ఒకరే, సంగీత దర్శకత్వం వహించింది ఘంటసాలే. ఎన్టీఆర్ ఆవేశంతో తొడగొట్టినా, ఎస్వీఆర్ 'బానిసలు' అంటూ ఈసడించుకున్నా.. ఇద్దరూ కమలాకర కామేశ్వరరావు డైరక్షన్‌లోనే చేశారు. మిక్కిలినేని సావిత్రి చీర లాగలేదు, లాగినట్లు నటించాడు. లాగని చీర కోసం సావిత్రి ఎందుకంత తీవ్రంగా దుఃఖించింది? దీన్నే నటనా కౌశల ప్రదర్శన అందురు! అసహాయంతో గుమ్మడీ, వీరావేశంతో ఎన్టీఆర్, యారోగెన్స్‌తో ఎస్వీఆర్ మనని బ్లాక్ అండ్ వైట్ థింకింగ్ వైపు నెట్టారు. అంచేత నేను పాండవుల పక్షం వహించి సినిమాని ఎంజాయ్ చేశాను. అందుకే సినిమా సూపర్ హిట్టైంది!

చివరాకరికి నే చెప్పొచ్చేదేమనగా - రాజకీయ పార్టీలన్నీ ఒక తానులో ముక్కలే. అవి అత్యంత తెలివిగా, జాగ్రత్తగా తమలో తాము విబేధాలు ఉన్నట్లుగా నటిస్తాయి. పార్లమెంటుని స్తంభింపజేసేందుకు మేచ్ ఫిక్సింగ్ కుట్రలు చేసుకుంటాయి. అవి సృష్టించిన - మనం vs వాళ్ళు అనే ట్రాప్‌లో పడిపోయి రెండుగా విడిపొయ్యి విమర్శించుకుంటాం. వాస్తవానికి ఇక్కడ మనం లేదు, వాళ్ళు లేదు! ఉన్నదల్లా సామాన్య ప్రజలు, వారి అవసరాలు, కష్టాలు మాత్రమే!

సినిమాలో ఎన్టీఆర్, ఎస్వీఆర్ మాత్రమే చాలెంజిలు చేసుకోవాలి, పద్యాలు పాడుకోవాలి. వాళ్ళ గోలలేవో వాళ్ళకున్నాయి. మధ్యలో ఏ విదురుడో, వికర్ణుడో దూరబోతే - ఇద్దరూ కలిసి పద్యాలు పాడ్డం కొద్దిసేపు ఆపుకుని, తమ గదల్తో వాళ్ళ బుర్ర రాంకీర్తన పాడించేస్తారు! అలాగే ప్రధాన రాజకీయ పక్షాలవాళ్ళు వారి రాజకీయం చేసుకుంటూ వుంటారు. మధ్యలో ఇంకెవరికీ అవకాశం రాకూడదు. ఎప్పుడైనా ఆ ప్రమాదమే వస్తే - ఇరు పక్షాలు ఏకమై ఆ మూడోవాడి పని పడతాయి - అదీ సంగతి!

అంకితం -

'రాబర్ట్ వద్రా ఇంకా జైలుకెళ్ళలేదేమిటి!?'
'అయోధ్యలో రాముడి గుడి ఇంకా మొదలెట్టలేదేమిటి!?'
ఇట్లాంటి ప్రశ్నలతో బుర్ర ఖరాబు చేసుకునే అమాయకులకి..   

(picture courtesy : Google)

Friday 17 July 2015

మనసు భారమైన సమయం..


కొన్ని సంఘటనలు మనసుని కలచివేస్తాయి. ఎంత సర్దిచెప్పుకుందామనుకున్నా మనసు మాట వినదు. రాజమండ్రి పుష్కరాల్లో చనిపోయినవారి వారి మృతదేహాలు చూసినప్పట్నుండి మనసు గ్లూమీగా అయిపోయింది. పాపం - పిల్లలు, వృద్ధులు, ఆడవారు.. వాళ్ళేం పాపం చేశారు? కుసింత పుణ్యం మూట కట్టుకుందామని పుష్కర స్నానం కోసం పడిగాపులు కాశారు. ఇదేనా వాళ్ళు చేసిన నేరం?

వారి నుదుటిన అలా రాసిపెట్టుంది అంటూ ప్రవచనకారులు తమదైన వేదాంత ధోరణిలో విశ్లేషించవచ్చు. రాజకీయ నాయకులు రెండు పక్షాలుగా విడిపొయ్యి తిట్టుకోవచ్చు. కరుణా హృదయులు 'అయ్యో' అని జాలి చెందవచ్చును. ఎవరేది చేసినా.. ఈ వార్త కొన్ని రోజుల పాటు మాత్రమే వార్త! అటు తరవాత ఇంకో సంఘటన జరుగుతుంది. మనం ఇదంతా మర్చిపోతాం. 

మర్చిపోలేనిదీ, జీవితమంతా ఏడుస్తూ తల్చుకునేదీ ఆయా కుటుంబ సభ్యులే. చనిపోయినవారికి సివిక్ సెన్స్ లేదనీ, ఆత్రంగా తోసేసుకున్నారనీ ఏవేవో కథనాలు! ఆ రోజు నిజంగా ఏం జరిగిందో చనిపోయినవారొచ్చి సాక్ష్యం చెప్పరు, అక్కడున్న ప్రభుత్వ ఉద్యోగులు నిజం చెప్పరు. 

చనిపోయినవారికి దుస్తులు తొలగిపోయున్నాయి. చెరుగ్గడల్లా నలిగిపొయ్యి చాలా ఆక్వర్డ్ పొజిషన్లో పడున్నారు. ఆ దురదృష్టవంతుల ఫొటోలు అదేపనిగా అన్నిసార్లు చూపించడం ఏ రకమైన న్యూస్ రిపోర్టింగ్? బ్రతికున్నవాళ్ళకి గౌరవం ఎలాగూ ఇవ్వం, కనీసం విగత జీవుల పట్లనైనా మనకి గౌరవం వుండనక్కర్లేదా!

ఇసుకకి విలువుంది, కందిపప్పుకి విలువుంది.. ఏ విలువా లేనిది సామాన్యుల ప్రాణానికేనా! తిండి లేక చస్తాం, దోమ కుట్టి చస్తాం, ఎండలకి మాడి చస్తాం, వరదలకి కొట్టుకుపోతాం, రోడ్డు దాటుతూ చస్తాం, పంట పండక చస్తాం. ఇప్పుడు స్నానం చెయ్యడానికి వెళ్ళి చస్తున్నాం! మనం ఎక్కడున్నా, ఏం చేసినా.. అసలేం చెయ్యకపోయినా చావు మాత్రం వెతుక్కుంటూ వస్తూనే వుంటుంది.

దైన్యంగా బ్రతకడాన్ని కుక్క బ్రతుకు అంటారు, హీనంగా చావడాన్ని కుక్కచావు అంటారు. కుక్కలకి కడుపు నింపుకోవడం, బద్దకంగా పడుకోవడం తప్పించి పెద్దగా ఆశలున్నట్లు తోచదు. అంచేత - ఆశానిరాశల్లేని కుక్కలన్నీ మనని చూసి జాలిపడుతున్నాయని నా అనుమానం!  

ఓయీ అజ్ఞానాధమా! అధిక ప్రసంగం కట్టిపెట్టు. ఈ చావులన్నీ లలాట లిఖితము! ఎంతటివారైనా సరే - పూర్వజన్మలో చేసిన పాపపుణ్యముల ఫలితము అనుభవించక తప్పదు. తుచ్చమైన ప్రాణముల గూర్చి కలత చెందక దైవాన్ని మరింతగా ప్రార్ధింపుము, కనీసం వొచ్చే జన్మలోనైనా నువ్వు ఈర్ష్య చెందుతున్న ఆ కుక్కగా జన్మించగలవు!   

(picture courtesy : Google)

Thursday 16 July 2015

గాయకుడు రామకృష్ణ


కాలం గడియారం ముల్లులా నిదానంగా, నిరంతరంగా తన పని తను చేసుకుపోతుంటుంది. పుట్టేవాళ్ళు పుడుతుంటే పొయ్యేవాళ్ళు పోతుంటారు. ఎవరు ఎంత గొప్పవాళ్ళైనా, అసలు గొప్పవాళ్ళే కాకపోయినా కాలమహిమకి తలొంచక తప్పదు. మన రాజకీయ నాయకులకి లేకపోయినా కాలానికి మాత్రం గొప్ప డెమోక్రటిక్ స్పిరిట్ వుందని భావిస్తున్నాను.

గాయకుడు రామకృష్ణ మరణించాడు. ఆయన సినిమాల్లో పాడి చాలా కాలమే అయింది. సినిమా రంగం విచిత్రమైంది. ఇక్కడ ఎవరు ఎందుకు ఎంతకాలం సక్సస్‌ఫుల్‌గా వుంటారో తెలీదు. రామకృష్ణ కెరీర్ మొదలవడం మాత్రం చాలా ప్రామిసింగ్‌గా మొదలైంది. అందుకు ఆయనకి సమయం కూడా అనుకూలించింది. ఘంటసాల తన అనారోగ్యం వల్ల పాటలు తగ్గించుకున్న సమయంలో సినిమావాళ్ళకి అచ్చు ఘంటసాలని అనుకరించే రామకృష్ణ మంచి ప్రత్యామ్నాయంగా కనిపించాడు. 

ఆనాడు సినిమాల్లో రామారావు, నాగేశ్వరరావులది అగ్రస్థానం. కృష్ణ, శోభన్‌బాబులది తరవాత స్థానం. ఎప్పుడైనా అగ్రనటులకి పని చేసినవారిదే టాప్ బిల్లింగ్. అలా రామకృష్ణ సినిమా రంగం ఎంట్రీనే టాప్ గేర్‌లో మొదలైంది. మరి ఆ తరవాత ఏం జరిగిందో తెలీదు గానీ.. వెనకపడ్డాడు, బాగా వెనకపడ్డాడు. ఆ తరవాత కొన్నాళ్ళకి కచేరీల్లో మాత్రమే పాడాడు. సినిమాల్లో కెరీర్ అప్ అండ్ డౌన్‌లు సహజం. కానీ రామకృష్ణ మాత్రం మళ్ళీ కోలుకోలేకపొయ్యాడు. 

ఎప్పుడైనా ఒక అగ్రస్థాయి గాయకుడిని మక్కికిమక్కిగా అనుకరిస్తూ లాంగ్ కెరీర్ నిర్మించుకోవడం కష్టం, అసాధ్యమేమో కూడా. ఈ విషయం రఫీ, ముకేశ్, కిశోర్‌లని అనుకరిస్తూ తొందరగా లైంలైట్‌లోకి వచ్చినా.. అర్జంటుగా ఫేడౌట్ అయిన అనుకరణ గాయకులని గమనిస్తే అర్ధమవుతుంది. 

సరే! రామకృష్ణ గొప్ప గాయకుడా? అయితే ఎంత గొప్ప గాయకుడు? లాంటి ప్రశ్నలకి ఇక్కడ సమాధానం వుండదు. ఎందుకంటే ఇక్కడ నేన్రాస్తుంది గాయకుడు రామకృష్ణ గూర్చి నా ఆలోచనలు, జ్ఞాపకాలు మాత్రమే కాబట్టి.

రామకృష్ణా! మీరు మంచి గాయకులు. మీరు పాడిన పాటలు విని నేను ఆనందించాను. అందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రస్తుతానికి గురువు ఘంటసాల గారితో కబుర్లు చెప్పుకోండి. నేనక్కడికి వచ్చినప్పుడు మీ గాయకులందర్నీ ఒకచేట చేర్చి పసందైన జుగల్‌బందీ ఎరేంజ్ చేస్తాన్లే!

(picture courtesy : Google)

Saturday 11 July 2015

ఒమర్ షరీఫ్


ఒమర్ షరీఫ్ చనిపొయ్యాడు. ఆయన కొన్నాళ్ళుగా ఆల్జైమర్స్ డిసీజ్‌తో ఇబ్బంది పడుతున్నాట్ట. కాబట్టి ఆయనకి తను చనిపోతున్నానని తెలిసుండకపోవచ్చు. చనిపోవడం కన్నా చనిపోతున్నామన్న ఆలోచనే భయం కలిగిస్తుంది. ఈ భయమేమి లేకుండా హాయిగా చనిపోయిన ఒమర్ షరీఫ్ అదృష్టాన్ని అభినందిస్తున్నాను.  

ఒమర్ షరీఫ్ నాకు చిన్నప్పుడే తెలుసునని చెప్పడానికి మిక్కిలి గర్విస్తున్నాను. అవి బెజవాడలో ఊర్వశి సినిమా హాల్ కొత్తగా కట్టించిన రోజులు. నాన్న, మావయ్య, అన్న సినిమా ప్రోగ్రాం వేసుకున్నారు. సినిమా ప్రోగ్రాంలని పసిగట్టడంలో నేను కుక్కలాంటివాణ్ని. వాళ్ళు బయల్దేరే సమయానికి ప్రోగ్రాంలోకి నేనూ దూరిపోయ్యాను, బెజవాడ బండెక్కాను. సినిమా పేరు 'మెకన్నాస్ గోల్డ్'. 

నాకప్పటికి 70 mm సినిమా తెలీదు. ఆ పెద్ద తెర చూసి నోరెళ్ళబెట్టాను. సినిమా మొదట్లో వచ్చే గ్రెగరీ పెక్ షూటింగ్ సీన్, ఆ సౌండ్ ఎఫెక్ట్స్.. వేరే లోకంలో ఉన్నట్లుగా అనిపించింది. విలన్ ఒమర్ షరీఫ్ మన తెలుగు హీరోల కన్నా బాగున్నాడు. ఇంటర్మిషన్‌లో కొనుక్కున్న సమోసా సినిమా కన్నా బాగుంది. ఆ రోజుల్లో మా గుంటూరుకి బెజవాడ అమెరికా కన్నా దూరం! స్నేహితులకి మెకన్నాస్ గోల్డ్ సినిమా కథని స్పెషల్ ఎఫెక్ట్స్‌తో సహా చెప్పేవాణ్ని, వాళ్ళు నోరు తెరుచుకుని వినేవాళ్ళు. 

ఒమర్ షరీఫ్ ఈజిప్ట్ దేశం వాడనీ, గొప్ప నటుడనీ, బ్రిడ్జ్ చక్కగా ఆడతాడనీ.. ఇలాంటి విశేషాలు ఆ తరవాత తెలిశాయి. ఆంగ్ల సినిమాల గూర్చి అపారమైన జ్ఞానం కలిగున్న నా మిత్రుడొకడు పీటర్ ఒటూల్ అభిమాని. అతగాడు 'లారన్స్ ఆఫ్ అరేబియా' గూర్చి అనేకమార్లు చెప్పినందున ఆ సినిమా చూశాను. నాకు 'లారన్స్ ఆఫ్ అరేబియా' ఒమర్ షరీఫ్ కన్నా 'మెకన్నాస్ గోల్డ్' ఒమర్ షరీఫే నచ్చాడు - నాది చౌకబారు టేస్ట్ అయ్యుండటం ఒక కారణం కావచ్చు! 

ఆ తరవాత బెజవాడ 'మేనక'లో చెంగిజ్ ఖాన్ చూశాను. పోస్టర్లో సినిమా పేరు జెంగిస్ ఖాన్! ఈ పేరులో వున్న తికమకే సినిమాలోనూ వుంది. ఒమర్ షరీఫ్ ఎంత గొప్ప నటుడో 'డాక్టర్ జివాగో' చూస్తే తెలుస్తుంది అంటారు. నేను చూళ్ళేదు కాబట్టి తెలీదు. కానీ 'మెకన్నాస్ గోల్డ్' ఒమర్ షరీఫ్ మాత్రం నా బుర్రలో తిష్ట వేసుకుపొయ్యాడు. ఆ చురుకైన కళ్ళు, సూటి ముక్కు.. ఒమర్ షరీఫ్ ముఖం నటనకి అనుకూలంగా వుంటుంది. అందుకే అతగాడు క్షణకాలంలో హావభావాలు మార్చెయ్యగలడు. 

మనుషులు శాశ్వతం కాదు. పుట్టిన వాడు గిట్టక మానడని భగద్గీతలో శ్రీకృష్ణులవారు సెలవిచ్చారు. తదనుగుణంగా ఒమర్ షరీఫ్ కూడా చనిపొయ్యాడు. ఆ సందర్భాన ఇలా ఓ నాలుగు ముక్కలు రాశాను. ఒమర్ షరీఫ్! ఎక్కడో ఈజిప్టులో పుట్టి అమెరికాలో నటించి బెజవాడలో కనిపించిన నీకు గుంటూరు నుండి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను, గైకొనుము!  

(picture courtesy : Google)

Thursday 9 July 2015

చిత్తప్రసాద్

కళాకారులు - రాసేవాళ్ళు, గీసేవాళ్ళు, పాడేవాళ్ళు అంటూ అనేక రకాలుగా వుంటారు. అందులో మళ్ళీ పాలక పక్షం, మధ్యతరగతి పక్షం, ప్రజల పక్షం అంటూ అనేక తరగతులుగా విడిపోయ్యుంటారు. కొందరి ప్రస్తానం ప్రజాకళాకారులుగా మొదలై కాసులకి, కీర్తికి లొంగిపొయ్యి పాలక పక్షంలోకి మారిపోతారు. వీరిని 'ఉభయచర జీవులు' అంటారని ఓ సందర్భంలో రంగనాయకమ్మ వెక్కిరించగా చదివాను, మిక్కిలి సంతసించాను. 

పాలకుల ప్రాపకం (ఒకప్పుడు రాజులు, ఇప్పుడు ప్రభుత్వాలు) సంపాదించి తమ విద్యని వారికి దాసోహం చేసి, వారిని వేనోళ్ళ కీర్తిస్తూ బాగుపడే కళాకారులని 'పాలక వర్గ కళాకారులు' అంటారు. కోడికి ఈకల్లాగా, పందికి బురదలాగా వారికి ప్రభుత్వంవారి అవార్డులు, రివార్డులు మిక్కిలి శోభనిస్తాయి! వీరిని 'బ్రతకనేర్చిన కళాకారులు' అనికూడా అనవచ్చును. 

మధ్యతరగతి ఆలోచనలకి అందంగా,  ఆహ్లాదంగా, చతురంగా ప్రెజెంట్ చేసేవారిని 'మధ్యతరగతి కళాకారులు' అంటారు. వీరినే 'ఉబుసుపోని కళాకారులు' అని కూడా అనవచ్చు. ఈ జాతివారు స్త్రీలని చారడేసి కళ్ళతో ఆరడుగుల చీరకట్టుతో అందంగా, వయ్యారంగా చూపిస్తారు. పెద్ద వాక్యాన్ని ముక్కలుగా నరికేస్తూ తల్లి మీదా, పిల్లి మీదా 'హృదయం పిండేలా' పాడతారు. ప్రవాస భారతీయుల సాంస్కృతిక సంస్థల్లో లాబీయింగ్ చేయగలగడం వీరికి గల అదనపు అర్హత (ఎచట డబ్బులుండునో అచటనే కళలూ రాణించును). 

ఇక చివరిగా - ప్రజల పక్షం నిలబడిన కళాకారులు. వీరిని 'ప్రజా కళాకారులు' అనవచ్చు. అభివృద్ధికి దూరంగా సమాజపు అడుగున వున్నవారి సమస్యల్ని, కష్టాల్ని ప్రపంచ దృష్టికి వచ్చేలా ఎంతగానో కృషి చేస్తారు. వీరు కళ కళ కోసం కాదు, ప్రజల కోసం మాత్రమేనని ఘాట్టిగా నమ్మినవారు. అయితే - వీరు నమ్ముకున్న ప్రజలు గోచీ పాతర రాయుళ్లైనందున వీరూ దరిద్రులుగానే మిగిలిపోతుంటారు.  

ఇదంతా ఎందుకు రాశానంటే -

ప్రజాకళాకారులకి అసలు సిసలు ప్రతినిథి చిత్రకారుడు చిత్తప్రసాద్. ఆయన చిత్రాలకి ముడిసరుకు అట్టడుగు వర్గాల ప్రజల జీవనమే. చిత్తప్రసాద్ గీసిన ఏ బొమ్మైనా మనకిదే చెబుతుంది. ఆ చిత్రాల్లో ఆయా వర్గాల వేదనా, కసి స్పష్టంగా కనిపిస్తూనే వుంటుంది. 

నాకు చిత్రలేఖనంలో సాంకేతిక అంశాలు తెలీదు. కానీ - ఒక బొమ్మ ఎవరికోసం గీయబడిందో, ఎందుకు గీయబడిందో స్పష్టంగా గుర్తు పట్టగలను. నాకు చిత్తప్రసాద్ బొమ్మల్లో జీవితం కనిపిస్తుంది, మండే గుండెని చీల్చేసే చురకత్తుల వాడితనం కనిపిస్తుంది. అందుకే చాలాసార్లు ఆ బొమ్మల వైపు అలానే చూస్తుండిపోతాను. 

సరే! చిత్తప్రసాద్ దరిద్రంలో దరిద్రంగా బ్రతికాడు. ఎందఱో ప్రజా కళాకారులకి మల్లె చిత్తప్రసాద్ కూడా అనామకంగా ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపొయ్యాడు. ఈ సంగతి నేను ప్రత్యేకంగా రాయనవసరం లేదు. ఎందుకంటే చాలాసార్లు ప్రజల మనుషుల జీవితాలు దుర్భరంగానే ముగుస్తాయి. 

చిత్తప్రసాద్! మీ పట్టుదలకీ, ప్రతిభకీ శిరసు వంచి నమస్కరిస్తున్నాను. హేట్సాఫ్ టు యు! 


(pictures courtesy : Google)

Tuesday 7 July 2015

హేమమాలిని! గెట్ వెల్ సూన్!

హేమమాలిని నా అభిమాన నటి. అసలు హేమమాలినిని నటి అనవచ్చునా? ఎందుకంటే నాకు తెలిసి ఆమె ఎప్పుడూ నటించలేదు, నటించడానికి ప్రయత్నించనూ లేదు. తన వీక్ పాయింట్స్ తెలుసుకుని అందుకు అనుగుణంగా ప్రవర్తించువారే విజ్ఞులు. హేమమాలిని విజ్ఞురాలు. అందుకనే - ఏ సినిమాలోనూ నటించకుండా సాధ్యమైనంత ఎక్కువ అందంగా వుండటానికి ప్రయత్నించింది. అయినా కూడా హేమమాలిని నా అభిమాన నటి అని గర్వంగా ప్రకటించుకుంటున్నాను. 

నాల్రోజుల క్రితం జరిగిన ఒక రోడ్డు యాక్సిడెంటు ద్వారా హేమమాలిని మళ్ళీ వార్తల్లో వ్యక్తి అయింది. యాక్సిడెంట్ తరవాత గాయపడిన వారిని వారి చావుకి వదిలేసి ఆమె మాత్రమే వేరే కార్లో హడావుడిగా ఆస్పత్రికి వెళ్లిపోవడం సరి కాదని విమర్శకుల అభిప్రాయం. సరే! ఒప్పుకుంటున్నాను. కానీ మేధావులందరూ కట్ట గట్టుకుని హేమమాలి ఏటిట్యూడ్‌ని చెండుకు తిండం నాకు బాధగా వుంది. ఎంతైనా నేనామెకు అభిమానిని కదా. నా డ్రీమ్ గాళ్ కష్టాల్లో వున్నప్పుడు ఆమెని సమర్ధిస్తూ నాలుగు ముక్కలు రాయడం నా బాధ్యతగా భావించి ఈ పోస్ట్ రాస్తున్నాను.  

దక్షిణ భారద్దేశాన్ని ఇడ్లీ సాంబార్ ల్యాండ్‌గా మాత్రమే చూసే హిందీ వాళ్ళతో నెగ్గుకు రావడం అంత తేలిక కాదు. అట్లాంటి హిందీ సినిమా రంగంలో చాలా తక్కువ కాలంలో ఎక్కువ స్థాయికి చేరుకుంది హేమమాలిని. ఇందుకు హేమమాలినిని అభినందిస్తున్నాను. ఆ తరవాత ఆల్రెడీ పెళ్లై పిల్లలున్న ధర్మేంద్రని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అనాదిగా అందమైన సినిమా హీరోయిన్లు పెళ్లై పిల్లలున్నవారినే ఎందుకు ప్రేమిస్తారో తెలీదు. సరే! ఇది ఆయా నటీమణుల వ్యక్తిగత వ్యవహారం కనుక ఇంతటితో ఈ విషయం వదిలేస్తాను.

ఒకప్పుడు సినిమా నటులు సినిమాల్లో, రాజకీయ నాయకులు రాజకీయాల్లో వుండేవాళ్ళు(ట)! గత కొన్నేళ్లుగా రాజకీయ నాయకుల క్రెడిబిలిటీ దెబ్బ తినడం చేత ఎన్నికల సమయంలో పాపులారిటీ వున్న సినిమా నటులకి టిక్కెట్లిచ్చి గెలిపించుకోవడం మొదలైంది. సినిమా వాళ్ళు ఏ పార్టీ టిక్కెట్ ఇస్తే ఆ పార్టీ తరఫున నిలబడతారు. గెలిచినా ఓడినా వీరికి పెద్దగా రాజకీయ జ్ఞానం వుండదు. అందరూ గొప్ప జ్ఞానవంతులైతే ప్రపంచం పరమ బోరుగా వుంటుంది. ఎప్పుడైనా అజ్ఞానమే ముచ్చటగా వుంటుంది!

పుచ్చలపల్లి సుందరయ్య వంటి పార్లమెంటేరియన్లు సైకిల్ తొక్కేవారని విన్నాను. ఇవ్వాళ సైకిల్ తొక్కేవాళ్ళకి వోటు హక్కు మాత్రమే మిగిలింది. పారిశ్రామిక వేత్తలు, కాంట్రాక్టర్లు ఎన్నికల సమయంలో టికెట్ కొనుక్కుంటున్నారు. సెలబ్రిటీలు వారి గెలుపు అవకాశల బట్టి టికెట్ పొందుతున్నారు. ప్రజల సమస్యల గూర్చి వీరెవ్వరికి అవగాహన వుండదు. వీరికా జ్ఞానం వుండాలని ఆయా రాజకీయ పార్టీలూ అనుకోవట్లేదు. ఆ పార్టీల నాయకత్వానికి కావాల్సింది విప్ జారీ చేసినప్పుడు బుద్ధిగా ఓటేసే అజ్ఞాన ప్రజా ప్రతినిథులు మాత్రమే.

టూకీగా చెప్పాలంటే వీళ్ళు ఎమ్మెల్యే, ఎంపీలుగా కాకముందు ఫైవ్ స్టార్ మనుషులు. ఎన్నికల్లో గెల్చినంత మాత్రానికే రాత్రికి రాత్రి ప్రజల మనుషులుగా ఎలా మారిపోతారు? మరప్పుడు హేమమాలిని ఒక ఎంపీగా ఎంతో బాధ్యతాయుతంగా వుండాలని ఎందుకు ఆశిస్తున్నారు!? సోషల్ మీడియా మేధావులు నా అభిమాన నటి గొప్ప రాజకీయ పరిజ్ఞానంతో, క్షేత్రస్థాయి కార్యాచరణతో ఎంపీ అయ్యిందని నమ్ముతున్నారా!?

ఒక కారు ఇంకో కారుతో గుద్దుకుంది. ఇదసలు విషయం కాదు. ఒక బెంజ్ కారు ఆల్టో కారుని గుద్దింది. ఇదీ అసలు విషయం! భారద్దేశంలో బెంజ్ కారు ఆల్టో కారుని గుద్దుకుంటే ఏమవుతుందో - భారతీయుడు సినిమాలో ముసలి కమల్ హసన్ వంటి అమాయకులకి తప్ప అందరికీ తెలుసు. స్పీడుగా వెళ్ళే మన మంత్రిగార్ల కాన్వాయ్ గుద్దుకుని ఎంతమందికి దెబ్బలు తగల్లేదు? నాకు తెలిసి ఏ మంత్రిగారూ పన్లాపుకుని బాధితుల్ని ఆస్పత్రికి తీసుకెళ్ళిన సందర్భం లేదు. మరి - హేమమాలిని విషయంలోనే ఎందుకింత పట్టింపు!?

రామచిలక అందంగా వుందని వెండి సింహాసనంపై కూర్చుండబెట్టాం. తన అందచందాలతో మన మనసుని ఆనంద పరచడమే దానికి తెలిసిన విద్య. ఇవ్వాళ అవసరం పడిందని రామచిలకని కోయిలలా పాట పాడాలని కోరుకోవడం సబబా? అది రామచిలక పని కాదు గదా? అంచేత - ఒక చిన్నపిల్ల చనిపోయిందనే బాధ తగుమాత్రంగా మాత్రమే పడి, అందమైన హేమమాలిని మొహంపై గాట్లేమైనా పడ్డాయేమోనని కలత చెందుదాం! వ్యధ చెందుదాం!

హేమమాలిని! గెట్ వెల్ సూన్!

చివరి తోక -

హేమమాలినిపై 'పని లేక.. ' బ్లాగులో 'హేమమాలిని! బెస్టాఫ్ లక్' అంటూ ఒక పోస్టు రాశాను. ఓపిక వున్నవాళ్ళు చదువుకోవచ్చు.

(picture courtesy : Google) 

Friday 3 July 2015

పంచాగ్ని


జీవితం చిత్రమైంది. ఒక్కోదశలో ఒక్కోఅనుభవం హాయిగా వుంటుంది. ఆ తరవాత కొన్నాళ్ళకి అదే అనుభవం చిరాగ్గా కూడా వుండొచ్చు. ఒకప్పుడు నాకు స్నేహితుల్తో కలిసి సినిమా చూడ్డం అనేది గొప్ప అనుభవం. చదువైపొయ్యాక స్నేహితులు తలోదిక్కూ వెళ్ళిపొయ్యారు. ఆ తరవాత సినిమాలు చూడ్డానికి ప్రయత్నించాను గానీ - నా వల్ల కాలేదు. హఠాత్తుగా తెలుగు సినిమాస్థాయి దిగజారిందా? లేక స్నేహితుల్తో చెత్తసినిమాల్ని కూడా సరదాగా చూసేశానా?

ఒకానొకప్పుడు ప్రభుత్వ అధ్వర్యంలో నడిచే దూరదర్శన్ మాత్రమే వుండేది. దూరదర్శన్‌వాళ్ళు ఎవార్డ్ పొందిన ప్రాంతీయ చిత్రాల్ని ప్రసారం చేసేవాళ్ళు (ప్రభుత్వం అప్పుడప్పుడు మంచిపన్లూ చేస్తుంటుంది). ఆవిధంగా ఒకానొక ఆదివారం మధ్యాహ్నం యాక్సిడెంటల్‌గా ఒక మళయాళం సినిమా చూశాను. సినిమా పేరు 'పంచాగ్ని'.

కథలో ప్రధాన పాత్ర ఇందిర, నక్సలైట్ పార్టీ కార్యకర్త. ప్రస్తుతం యావజ్జీవ కారాగార శిక్ష (లైఫ్ సెంటెన్స్‌కి తెలుగులో ఇంతకన్నా తేలిక పదం వుంటే బాగుణ్ను) అనుభవిస్తున్న ఖైదీ. ఆవిడ కొన్నాళ్ళకి పెరోల్‌పై బయటకొస్తుంది (ఖైదీలకి సెలవలుంటాయని అప్పటిదాకా నాకు తెలీదు). ఈమధ్య కాలంలో బయటి ప్రపంచం చాలా మారింది, మానవ విలువలూ మారాయి. ఈ మారిన మనుషుల్తో ఇందిర అనుభవాల సమాహారమే ఈ కథ. సినిమా చివర్లో ఇందిర ఇంకో హత్య చేసి మళ్ళీ జైలుకెళ్తుంది. కథకి లింక్ ఇస్తున్నాను, ఓపిక వున్నవాళ్ళు చదూకోవచ్చు.

నాకు ADHD వుందేమోనని నా అనుమానం. ఏ సినిమానైనా మరీ బాగుంటే గానీ కుదురుగా కూర్చొని చూళ్ళేను. 'కొద్దిసేపు చూద్దాంలే' అనుకున్న నన్ను ఈ సినిమా రెండు గంటల పైగా తనతో వుంచేసుకుంది. నన్నిలా తనతో వుంచేసుకునే ఏ సినిమా అయినా మంచి సినిమా అని నా నమ్మకం. అట్లాంటి మంచి సినిమా తీసిన వాడే మంచి దర్శకుడు. తీసినవాడు అకిరా కురసోవా అవ్వచ్చు లేదా సత్యజిత్ రే అవ్వచ్చు - ఎవరికైనా సరే! ఇదే సూత్రం వర్తిస్తుంది.

అటు తరవాత కొన్నాళ్ళకి పీజిలో చేరాను. అక్కడ సైకియాట్రీ డిపార్ట్‌మెంట్‌ నిండా మలయాళీలు! నా సీనియర్ పి.ఎస్.శశిధరన్ (శశి) నాకు సన్నిహితుడయ్యాడు. శశి ఎక్కువగా పుస్తకాలు చదువుతాడు, తక్కువగా మాట్లాడతాడు. ఓసారి శశితో 'పంచాగ్ని' సంగతి ప్రస్తావించాను. శశి తన భీభత్సమైన మలయాళీ యాసతో సినిమా రచయిత ఎం.టి.వాసుదేవన్ నాయర్ (MT) గూర్చి యెన్నో వివరాలు చెప్పాడు. అటు తరవాత శశితో కలిసి ఒకట్రెండు మలయాళీ సినిమాలు చూశాను. ఆ సినిమాలేంటో గుర్తు లేవు కానీ - రెండూ మోహన్‌లాల్ సినిమాలే అన్న విషయం మాత్రం గుర్తుంది.

ఎప్పుడో చూసిన సినిమాని గుర్తు తెచ్చుకోవడం నాకు చాలా ఆనందంగా వుంది (నాకింకా డిమెన్షియా రాలేదన్న సంతోషం కూడా ఇంకో కారణం కావచ్చు). నాకు కొన్నివిషయాలు నచ్చుతయ్, ఇంకొన్ని నచ్చవు. నచ్చేవి నచ్చనివీ కాలానుగతంగా interchangeable. 'అందరికీ ఇంతేనా? నా వొక్కడికి మాత్రమేనా?' అన్నది తెలీదు.

ఇవ్వాళ నేను 'పంచాగ్ని' సినిమాని మొత్తం చూడగలనా? చూసినా సినిమా మళ్ళీ నచ్చుతుందా? ఈ ప్రశ్నలకి సమాధానం నాదగ్గర లేదు. ఒకానొకప్పుడు నాకీ సినిమా నచ్చిందని గుర్తు చేసుకోవడమే ఈ పోస్ట్ యొక్క ఉద్దేశం. కావున -  ఈ పోస్ట్ చదివి పంచాగ్ని సినిమా చూసి.. సినిమా బాలేదనీ, అనవసరంగా సమయం వృధా అయిందనీ ఎవరైనా చింతించిన యెడల - వారికి (ముందుగానే) నా సానుభూతి తెలియ జేసుకుంటున్నాను (ఇది మాత్రం కచ్చితంగా disclaimer).

ముగింపు -

నే చదూకునే రోజుల్లో మళయాళీ బూతు సినిమాలు కృష్ణ సినిమాల కన్నా స్పీడుగా ఠపీఠపీమంటూ వచ్చేవి. రతినిర్వేదం, సత్రంలో ఒక రాత్రి.. ఇలా టైటిల్స్‌తోనే కుర్రకారుని కిర్రెక్కించేవి. ఈ సినిమాలకి మా గుంటూరు రంగమహల్ నూన్ షోలతో నిలయంగా వుండేది. బయట ఎర్రని ఎండవల్లనూ, లోపల వేడి నిట్టూర్పులవల్లనూ - వాతావరణం భగభగా మండిపొయ్యేది!

నా ఆత్మీయ మిత్రుడొకడు బట్టలు తక్కువగానున్న స్త్రీల యెడల మిక్కిలి ఆసక్తి కలిగుండేవాడు. అంచేత రంగమహల్ అతగాడి కేరాఫ్ అడ్రెస్‌గా విలసిల్లేది! ఏ సినిమాలో ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు 'గిట్టుబాటు సీన్లు' వుండేవో అతనికి కొట్టిన పిండి, దంచిన కారం. ఓసారి 'పంచాగ్ని చూశావా?' అనడిగాను. క్షణకాలం ఆలోచించి 'కామాగ్ని చూశాను. పంచాగ్ని చూళ్ళేదు' అని చెప్పాడు!      

Saturday 27 June 2015

సుడిగుండాలు


ఈ ప్రపంచంలో మనుషుల్ని పోలిన మనుషులు వుంటారు. అంతకంటే ఎక్కువగా సినిమాల్ని పోలిన సినిమాలూ వుంటాయి. ఇది కేవలం కాకతాళీయం మాత్రమేనని సినీజీవులు అంటారు. కొందరు తెలివైనవాళ్ళు 'స్పూర్తి' పొందామని గడుసుగా చెప్పుకుంటారు. చాలాసార్లు ఈ స్పూర్తికీ, కాపీకీ మధ్యన విభజనరేఖ సూదిలో దారంలా కనపడీ కనపడనట్లు వుంటుంది. 

1959 లో 'కంపల్షన్' అనే ఆంగ్ల సినిమా వచ్చింది. ముఖ్యపాత్రని ఆర్సన్ వెల్స్ పోషించాడు (ఈయన పేరు వినంగాన్లే చప్పున గుర్తొచ్చేది 'సిటిజెన్ కేన్'). కథ టూకీగా - అనగనగా ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. ఒకే కాలేజిలో చదువుకుంటున్నారు, బాగా ధనవంతుల బిడ్డలు. సరదా కోసం ఏమైనా చేస్తారు, ఎంతకైనా తెగిస్తారు. థ్రిల్ కోసం - పోలీసులకి అంతుపట్టని విధంగా ఒక నేరం చేద్దామనుకుంటారు. 'పెర్ఫెక్ట్ మర్డర్' కోసం ఒక పిల్లాణ్ణి కిడ్నాప్ చేసి హత్య చేస్తారు. అన్నీ పెర్ఫెక్టుగానే చేస్తారు గానీ - ఒక ముఖ్యమైన ఆధారాన్ని హత్య జరిగిన ప్రదేశంలో వదిలేస్తారు. ఆ ఆధారంతోనే వారికి శిక్ష పడే సమయం వస్తుంది. అప్పుడు ఆర్సన్ వెల్స్ నటించిన న్యాయవాది పాత్ర కోర్టు రూములోకి ప్రవేశించి ముద్దాయిల తరఫున తీవ్రంగా వాదిస్తుంది. చివరాకరికి ముద్దాయిలకి పడాల్సిన ఉరిశిక్ష తప్పిపోతుంది! 

ఈ కథ చదువుతుంటే మీకో ప్రముఖమైన తెలుగు సినిమా గుర్తుకు రావాలి. 1969 లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన 'సుడిగుండాలు' అనే సినిమా కథాంశం కూడా ఇదే. ఈ సినిమా కథ 'కంపల్షన్' సినిమాని ఇంతగా పోలి వుండటం 'యాదృచ్చికం' అనుకోవాలంటే కొంచెం ఇబ్బందే! ఆ సినిమా తీసిన వాళ్ళెవరూ ఇప్పుడు లేరు, వున్నా మనకి చెబుతారో లేదో తెలీదు. ఆంగ్ల సాహిత్యం చదువుకుని లేదా ఆంగ్ల చిత్రం చూసుకుని - ఆ స్పూర్తితో కథలు వండటం అనేది ఒక పురాతన విద్య. 

ఏ సినిమాకైనా ప్రధాన కథాంశం ఫలానా అని ముందో ముక్క అనుకుంటారు. ఈ ముక్క చపాతీ ముద్దలాంటిది. అప్పడాల కర్రని ఒడుపుగా తిప్పుతూ ఆ ముద్దకే వెడల్పుగా, గుండ్రంగా చపాతీ షేపు తెప్పిస్తారు. అంటే ఒక సినిమా మంచిచెడ్డలు పిండిముద్దతో మొదలవుతాయి. అట్లాంటి ప్రధాన కథాంశాన్ని కాపీ కొట్టేసి మాది 'స్పూర్తి' మాత్రమే అంటారు సినిమావాళ్ళు. సరే! ఎవరి దృష్టికోణం వారిది!

'సుడిగుండాలు' సినిమా పెద్దగా ఆడకపోయినా, సినీప్రేమికుల్ని అలరించింది. ఒక గొప్ప సినిమాగా కీర్తి నొందింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కేంద్ర ప్రభుత్వ అవార్డునీ పొందింది. ఈ సినిమా తీసి బోల్డంత సొమ్ము నష్టపొయ్యామని దర్శక నిర్మాతలు పలుమార్లు వాపొయ్యారు. అయితే - ఈ సినిమా మాతృక గూర్చి ఎక్కడా (నాకు తెలిసినంత మటుకూ) ప్రస్తావన రాకపోవడం ఆశ్చర్యకరం. బహుశా ఆ రోజుల్లో ఇంటర్నెట్ లేకపోవడం ఒక కారణం కావచ్చు!

'సుడిగుండాలు'ని నేను మా గుంటూరు లక్ష్మీ పిక్చర్ పేలెస్‌లో చూశాను. అప్పట్లో నేను - ఫైటింగు లేని సినిమా మిరపకాయ లేని బజ్జీ వంటిదనే నమ్మకంతో వుండేవాణ్ని. అంచేత సినిమా నాకు చప్పగా అనిపించింది. చివర్లో న్యాయవాది నాగేశ్వరరావు 'ఈ దేశం ఏమవుతుంది? ఏమవుతుంది?' అంటూ మనకి బరువైన ప్రశ్నలు వేస్తూ, అందుగ్గానూ ఆయన కూడా తీవ్రంగా ఆవేదన చెందుతూ కోర్ట్ రూంలోనే పడిపోతాడు. 'గంటలకొద్దీ వాదించినందున అలసిపొయ్యి కళ్ళు తిరిగి పడ్డాడా? లేక చనిపొయ్యాడా?' అన్నది నాకు అర్ధం కాలేదు. ఆయన అలా పడిపొయ్యి అనేక దశాబ్దాలు దాటినందున - ఇప్పుడు తెలుసుకుని చెయ్యగలిగిందీ ఏం లేనందున, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం!


Wednesday 24 June 2015

నా కొత్త బ్లాగ్ - పిపీలికం

'పని లేక.. ' బ్లాగ్ మూతబడింది. ఇది బొత్తిగా పాతబడ్డ వార్త.

ఇవ్వాల్టినుండి 'పిపీలికం' అనే కొత్త బ్లాగ్ మొదలెడుతున్నాను. ఇది మాత్రం తాజావార్త!

నాకు దేవుడి మీద నమ్మకం లేదు. కానీ - దేవుడుకి కళ్ళజోడు పెట్టి, ప్యాంటూ చొక్కా తొడిగితే అచ్చు రావిశాస్త్రిలానే వుంటాడనే నమ్మకం మాత్రం వుంది. అట్టి దేవుడు కాని దేవుడు రాసిన 'పిపీలికం' అనే కథ పేరుని నా కొత్త బ్లాగుకి వాడుకుంటున్నాను. ఇందుకు నాకు చాలా సంతోషంగా వుంది.

నా మూతబడ్డ స్థావరం 'పని లేక.. ' అలాగే వుంటుంది. ఎవరైనా ఎప్పుడైనా yaramana.blogspot.in కి వెళ్లి చక్కగా చదూకోవచ్చు. అయితే - కామెంట్లు చేసే సౌలభ్యం మాత్రం లేదు, గమనించగలరు.

బ్లాగైతే మొదలెడుతున్నాను గానీ - ఏం రాయాలో ఇంకా నిర్ణయించుకోలేదు. ఒక బ్లాగుంటూ వుంటే ఏదోటి రాద్దామనే ఆసక్తి కలగొచ్చు. 'ప్రశాంతంగా పేషంట్లని చూసుకుని హాయిగా తిని పడుకోక - ఈ రాసే పని నాకెందుకు?' అనే సందేహమూ వుంది.

ఈ ఆలోచనలతో కొత్త బ్లాగ్ మొదలెడుతున్నాను, వుంటాను.

(picture courtesy : Google)

Thursday 11 June 2015

Love in Summer!


వేసవి కాలం, మిట్ట మధ్యాహ్నం. ఎండ పెళపెళ్ళాడుతూ మండుతుంది, వడగాల్పు భగభగలాడుతూ వీస్తుంది. సూర్యుడు ఫ్యాక్షనిష్టు లీడర్లా మొరటుగా, కోపంగా వున్నాడు. రోడ్లన్నీ ఖాళీగా కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తున్నయ్. ఆ సమయంలో ఎవరైనా జనాభా లెక్కల డిపార్టుమెంటువాళ్ళు లెక్కలు కడితే భారద్దేశ జనాభా ఫిన్లాండు కన్నా తక్కువ అని తేల్చేస్తారు!

వీధిలో మూలగా ఒక చిన్న ఇల్లు, చిన్నదైనా ముచ్చటగా వుంది. అది ఒక ప్రముఖ తెలుగు రచయితగారిది. గదిలో ఏసీ మెత్తగా, నిశ్సబ్దంగా పన్జేస్తుంది. గది చల్లగా వుంది. రచయితగారు ఎర్రగా వున్నారు, బుర్రగా వున్నారు. వారి జులపాల జుట్టు ఏసీ గాలికి నుదుటి మీద అలలా అలాఅలా కదుల్తుంది. వారి తెల్లని జుబ్బా, పైజమా బట్టల సబ్బు ఎడ్వర్టైజ్‌మెంటులా తళతళా మెరుస్తున్నయ్.

రచయితగారు తెలుగు రచనా రంగంలో సుప్రసిద్ధులు. వారు పదుల సంఖ్యలో పుస్తకాలు రచించారు, వేల సంఖ్యలో పుస్తకాలు అమ్ముకున్నారు. మార్కెట్ అవసరాలకి తగ్గట్టుగా కథలు రాయడంలో వారు నిష్టాతులు. సమయానుకూలంగా పాలకోవాల్లాంటి ప్రేమ కథలు రాయగలరు, కషాయంలాంటి విషాద కథలూ వినిపించగలరు. అవసరమైతే – మిర్చిబజ్జీలాంటి విప్లవ కథలతో భగభగా జ్వలించగలరు, అన్నార్తుల ఆకలి కేకలతో కేకుల్లాంటి కవితలు బేక్ చేసి హృదయాల్ని ద్రవింప చెయ్యగలరు, దగాపడ్డ దళితుల దుర్దశని దుఃఖభరితంగా వర్ణించనూగలరు. వారి కలానికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. వారొక సంపూర్ణ రచయిత. ప్రస్తుతం వారి కలం నుండి ఒక చిక్కని ప్రేమ కథ మెత్తగా జాలువారుతుంది.

ఆమె మెరుపు తీగ, కలువ బాల. అందంలో ఐశ్వర్యారాయ్, చందంలో కాంచనమాల. నవ్వితే మధుబాల, నవ్వకపోతే నర్గీస్. పేరు రాధ. ఆమెకు డబ్బున్నవాళ్ళన్నా, ఆకర్షణీయమైన మగవాళ్ళన్నా మిక్కిలి ఆసక్తి. ఈ రెండూ వున్నవాళ్ళ పట్ల మరింత మిక్కిలి ఆసక్తి. డబ్బులేని జీవితం నీళ్ళులేని కొబ్బరి బోండాం వంటిదని ఆమె నమ్మకం.

అతను ఆరడగులవాడు, తెల్లతోలువాడు, దండిగా డబ్బున్నవాడు, ఖరీదైన కారున్నవాడు, ఎల్లప్పుడూ డిజైనర్ దుస్తులే ధరించువాడు, శోభన్‌బాబు విగ్గులాంటి జుట్టుగలవాడు. దగ్గితే ధర్మేంద్రలా, దగ్గకపోతే అమీర్ ఖాన్‌లా వుంటానని అనుకుంటూ వుంటాడు. పేరు కృష్ణ. ప్రేమ లేని జీవితం జీడిపఫ్ఫు లేని పాయసం వంటిదని నమ్మినందున.. అందమైన అమ్మాయిల మెరుపు కళ్ళల్లో ప్రేమను వెతుక్కుంటుంటాడు.

గత కొన్నిరోజులుగా రాధ, కృష్ణ – తీవ్రంగా, తీక్షణంగా ప్రేమించుకుంటున్నారు. రోజూ కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని పది గంటలు కబుర్లు చెప్పుకుంటూ మైమరచిపోతారు. ఇంకో పది గంటలు ఫేస్బుక్కులో ఛాటింగ్ చేసుకుని పులకించిపోతారు. ఆ మిగిలిన నాలుగ్గంటలూ వాట్సప్పులో మెసేజిలు పంపుకుంటూ సంబరపడిపోతారు.

‘ప్రేమ’ – ఒక  మధుర భావన!

‘ప్రేమ’ – ఒక మది పులకరింత!

రాధ కృష్ణని చూసినప్పుడు సిగ్గుతో గువ్వలా (గవ్వ కాదు) అయిపోతుంది. బుగ్గలు సిగ్గుతో ఎలర్జిక్ రాష్ వచ్చినట్లు ఎర్రగా అయిపోతాయి. రాధ సిగ్గుల మొగ్గైనప్పుడు కృష్ణకి ప్రపంచాన్నే జయించినంత గర్వం, ఆనందం.

అంచేత –

‘ఆహా! ఏమి నా అదృష్టం, ఈ చిన్నది నా ప్రేయసి అగుట నా పూర్వజన్మ సుకృతం.’ పాత తెలుగు సినిమా జానపద హీరో స్టైల్లో అనుకుంటాడు కృష్ణ.

ఇలా ఒకళ్ళనొకళ్ళు తీవ్రమైన ప్రేమతో కొద్దిసేపు చూసుకున్న పిమ్మట, రాధ కృష్ణ కౌగిలిలో ఒదిగిపోయింది.

సృష్టిలో అత్యంత తీయనైనది ఏమి? – ప్రేమ!

ప్రపంచంలో అమూల్యమైనది ఏమి? – ప్రేమ! ప్రేమ!!

భూమండలాన్ని గిరగిరా తిప్పేది, పడిపోకుండా నిలబెట్టేది ఏమి? – ప్రేమ! ప్రేమ!! ప్రేమ!!!

సందేహం లేదు. ప్రేమ అనునది పెసరట్టు కన్నా రుచికరమైనది, తిరుపతి లడ్డు కన్నా తీయనైనది, కొత్తావకాయ కన్నా ఘాటైనది.

ఓయీ తుచ్ఛ మానవా! నిత్యావసర వస్తువుల రేట్లు, నిరుద్యోగం, అవినీతి, నేరాలు – పెరిగిపోతూనే వుంటాయి. అది ప్రకృతి ధర్మం. అందువల్ల నీవా పనికి మాలిన విషయాల గూర్చి కలత చెందకు. ప్రేమతో హృదయాల్ని కొల్లగొట్టు. ప్రేమతో ప్రపంచాన్ని జయించు!

అందువల్ల – ప్రేమించు! బాగా ప్రేమించు! ప్రేమని మనసారా గ్రోలుము, ఆస్వాదింపుము! ప్రేమ నీ జీవితాన్నే మార్చేస్తుంది. మానవ జీవితం చిన్నది, పొట్టిది, పెళుసుది.. ప్రేమంచి దానికి సార్ధకత చేకూర్చుకో!

ఇంతలో –

‘టప్’ – కరెంటు పోయింది, ఏసీ ఆగిపోయింది. క్రమేపి చల్లదనం తగ్గసాగింది. రచయితగారికి ఇబ్బందిగా అనిపించింది. కానీ వారు కథ రాయడం ఆపలేదు (తుచ్ఛమైన కరెంటు వారి కలాన్ని ఆపలేదు).

ఆరోజు కృష్ణని చూసిన రాధ (రోజూ పడే) సిగ్గు పళ్ళేదు, బుగ్గలు మొగ్గలెయ్యలేదు.

మొహం చిట్లించాడు కృష్ణ.

‘ఐ ఫోన్ కొనిమ్మని నిన్ననే కదా అడిగింది? ఈలోపే సిగ్గు పట్టం మానెయ్యాలా? ఈ అమ్మాయిలింతే, వీళ్ళవన్నీ ఎమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ప్రేమలు! రాజకీయ నాయకుల్లో నీతీ, అమ్మాయిల్లో ప్రేమ.. ఎడారిలో ఎండమావి వంటివి.’

మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యేలా మొహం మాడ్చుకుంది రాధ.

‘గిఫ్టు కొనివ్వలేడు గానీ, రోషానికి మాత్రం తక్కువ లేదు. తెల్ల దొరసానమ్మని నల్ల బానిస చూస్తున్నట్లు దేబిరిస్తూ ఎట్లా చూస్తున్నాడో కదా! ఓడిపోయిన పొలిటీషయన్ని, ఒట్టిపోయిన ప్రియుణ్ని సాధ్యమైనంత తొందరగా ఒదుల్చుకోమన్నారు పెద్దలు.’ అనుకుంది రాధ.

ఇప్పుడు గది వేడిగా అయ్యింది. ఉక్కపోతగా వుంది. రచయితగారికి బాగా చికాగ్గా వుంది. అయినా వారు రాస్తూనే వున్నారు (కరెంటు తుచ్ఛమైంది కాదు)!

ఏవిటీ ప్రేమ గొప్ప? తిని అరగని ప్రతి గాడిదా ప్రేమ, ప్రేమ అంటూ కలవరించడమే! ప్రేమ ఒక జ్వరం, ప్రేమ ఒక గజ్జి, ప్రేమ ఒక స్వైన్ ఫ్లూ, ఒక డెంగీ, ఒక ఎబోలా. సామాన్య ప్రజలు ఉక్కపోతతో, చెమటల్తో నానా ఇబ్బందులు పడుతుంటే – ఈ ప్రేమికులు మాత్రం ‘ప్రేమ! ప్రేమ!’ అంటూ కలవరిస్తుంటారు, పూనకం వచ్చినాళ్ళలా పలవరిస్తుంటారు.

ఓయ్ భజరంగ్ దళ్ కార్యకర్తలూ! ఒక్క వేలెంటేన్స్ డే రోజునే కాదయ్యా, మీరు ప్రతిరోజూ ప్రేమికుల్ని తంతూనే వుండండి! మాతృభూమిని శతృసంస్కృతి నుండి రక్షించండి!!

అబ్బా! ఈ ఉక్క భరించడం కష్టమే! చెమటకి జుబ్బా తడిసిపొయింది. వామ్మో! కుంపట్లో కూర్చున్నట్లుగా వుందిరా దేవుడోయ్ (కరెంటు ఎంతో ఉన్నతమైనది)!

‘ప్రేమికులకి బుద్ధి లేదు, ప్రేమకి అర్ధం లేదు. ప్రేమికులకి నిర్భయ చట్టాన్ని వర్తింపజెయ్యాలి, జైల్లో కుక్కాలి, ఉరి తియ్యాలి. భారద్దేశానికి తక్షణ సమస్య యేమి? ఎండ, ఉక్కపోత, చెమట! అయ్యా రాజకీయ నాయకులూ! ఇప్పుడు ప్రజలక్కావల్సింది స్మార్ట్ సిటీలు కాదండీ! కోల్డ్ సిటీస్! ఇదే అసలైన సమస్య. నా దేశ ప్రజలారా! రండి – వేసవికి వ్యతిరేకంగా ఉద్యమం చేద్దాం! రండి – ఉక్కపోత మహమ్మారిని తరిమేద్దాం! రండి – చెమటని పారద్రోలుదాం! రండి – పోరాడితే పొయ్యేదేం లేదు, చెమటకంపు తప్ప! విప్లవం జిందాబాద్! ప్రభుత్వం ముర్దాబాద్!’

ఇంతలో –

‘టప్’ – కరెంటొచ్చింది. ‘బయ్’ – ఏసీ పంజెయ్యడం మొదలెట్టింది. చల్లగాలి రచయితగారి ముఖానికి పిల్ల తెమ్మరలా తగిలింది. చెమటకి తడిసిన వారి జులపాల జుట్టు ఆనందంగా, ఉత్సాహంగా ఎగెరెగిరి పడసాగింది. రచయితగారు రెణ్ణిమిషాలపాటు ఏసీ చల్లదనాన్ని అనుభవిస్తూ పరవశంగా కళ్ళు మూసుకున్నారు. కొద్దిసేపటికి వారి శరీరం చల్లబడింది. మరి కొద్దిసేపటికి ఉత్సాహంగా రాయడం కొనసాగించారు.

పవిత్రమైన ప్రేమకి కరెంటుకోత అడ్డు కాదు, కారాదు. కృష్ణ రాధని ప్రేమగా, మురిపెంగా చూశాడు. ‘అయ్యో! నా ప్రేయసిని అపార్ధం చేసుకున్నానే! ఎంత తప్పు చేశాను! స్వగృహ ఫుడ్స్ వారి ఖరీదైన జీడిపప్పు పాకం వంటి రాధ ప్రేమని, అలగా జనం తినే చౌకబారు వేరుశెనగ పప్పుండగా భావించానే!’

‘రాధీ! నన్ను క్షమించు.’

రాధ కృష్ణని చూసింది. ఆ చూపులో కిలోల్లెక్కన  ప్రేముంది, టన్నుల్లెక్కన ఆరాధనుంది. ‘అయ్యో! కిన్లే వాటరంత ఖరీదైన వ్యక్తిని మునిసిపాలిటీ కుళాయి నీళ్ళంతటి చీప్ మనిషనుకున్నానే! నా ప్రియుడు ప్రేమికులకే ప్రేమికుడు – ప్రేమశ్రీ, ప్రేమభూషణ్, ప్రేమరత్న. ప్రియతమా! నిన్నెంత తప్పుగా అర్ధం చేసుకున్నాను!’

‘క్రిష్! నన్ను క్షమించు.’ అంటూ ప్రియుని వెచ్చని కౌగిలిలో ఒదిగిపోయింది రాధ.

ప్రేమ – స్వచ్చం, ప్రేమ – నిజం, ప్రేమ – అమర్ రహే, ప్రేమ – జిందాబాద్.

జైహింద్!

(ప్రచురణ - 'సారంగ' 2015 జూన్ 11)